2676* వ రోజు........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

ప్ర.సా.దు, ప్లాస్టిక్ వ్యర్థాలకే నేటి శ్రమదాన సమర్పణం  - @ 2676*.

            అనగా కళ్లేపల్లి బాటలోని ప్రభుత్వ సారా దుకాణమని అర్థం! గురువారం నాటి 24 మంది చాకిరీ కూడ ఆ 3-4 సెంట్ల దుకాణాంతర్భాగానికి ఏ మూలకూ చాల్లేదంటే - అక్కడి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల సాంద్రత, ఘనత తెలిసి పోవాలి! రహదారి మీదికంతగా కనిపించదు గాని, గ్లాసుల సీసాల- సంచుల విశ్వరూపం లోతట్టున తెలుస్తుంది!

            15 మంది కార్యకర్తలు ఎవరెక్కడ కూర్చున్నా, వంగినా, కాలు కదిపే అవసరం లేకుండానే పెద్ద డిప్ప నిండిపోయింది! అలా- తలా 100 నిముషాల్లో వాళ్ళు సముపార్జించిన వ్యర్ధాలు లెక్కిస్తే 10 వేలకు తక్కువ కావు! షణ్ముఖ శ్రీనివాసుడు స్వచ్చోద్యమానికి బహూకరించిన రెండు పెద్ద సంచుల్నిండి, (ఫొటోల్లో చూడవచ్చు) ఏరవలసినవింకా మిగిలిపోయినవి!

            ఏడెనిమిది మంది కత్తి వీరుల - దంతెధారుల శ్రమ సదరు దుకాణం ఎదుటి డ్రైనును చక్కదిద్దింది! ఇద్దరో ముగ్గురో చీపుళ్ల వారు అంగడి బైటా లోపలా చెత్త - దుమ్ము ఊడ్చారు.

            కార్యకర్తల నేటి శ్రమదానం చూసే కొద్దీ నాకు ఆశ్చర్యం, ఆనందం, దిగులూ ఏక కాలంలోనే కలిగాయి! ముఖ్యమంత్రంతటి వ్యక్తి ఏనాడో ఏకమాత్రవాడక ప్లాస్టిక్ లు నిషేధించాక ప్రభుత్వ దుకాణం దగ్గరే అవి గుట్టలు పడుతున్నందుకు ఆశ్చర్యమూ, గ్రామ సమాజంలో మంచి గుర్తింపున్న వైద్యులూ, ఉద్యోగులూ - వృద్ధులూ, రైతులూ - సొంతింటి బాధ్యతలు మోసే గృహిణులూ ఈ వేకువ కాలంలో వచ్చి, చెత్త మనుషులుగా మారి భూమికి కాలుష్య భారాన్ని తగ్గిస్తున్నందుకు ఆనందమూ!

            దిగులెందుకంటే - “9 ఏళ్లుగా నిరంతరంగా ప్రస్థానిస్తున్న చల్లపల్లి స్వచ్చ సుందరోద్యమం ఖర్మకాలి ఎప్పుడైనా ఆగిపోతే ఈ పచ్చదనాల 7 రహదారులు డజన్ల కొద్దీ మురుగు కాల్వలు, తలకుమించిన కాలుష్యాలు ఏమైపోవాలిఅనే భయంతో!

            ఇంత మురికి - చెత్త - కరకు పనులు చేస్తూ కూడ తమ పారిశుద్ధ్య పనుల్తో వెగటులేక విసుగు లేక వాతావరణ విధ్వంసకారుల్ని నిందించక తమ పని తాము చేసుకు పోతున్న స్వచ్చ సైనికులకు పాద నమస్కారాలు!

6.40 సమయంలో సమీక్షా సభ విశేషాలు:

1) కార్యకర్తలు నింపిన 2 నిలువెత్తు భారీ సంచుల వ్యర్థాల గ్రూప్ ఫోటో,

2) పరిమితకాల కార్యకర్త మిక్కిలినేని మధు గారు కూచిపూడిలో 15 వ తేదీన జరుగనున్న తన కుమార్తె ఉద్వాహ వేడుకలకు సహ కార్యకర్తలనాహ్వానించడం,

3) షణ్ముఖ శ్రీనివాసుని రాగిపొడి పొట్లాల వితరణ,

4) శంకర శాస్త్రీయ పప్పుండల పంపకం,

5) ముమ్మారు అడపా వారి గ్రామ స్వచ్చ సుందరోద్యమ సారాంశ నినాదాలూ, ఒక చిన్న ప్రవచనమూ!

            Dr. డి.ఆర్.కె గారు అత్యవసర ప్రయాణాల వల్ల ఈ సమీక్షా సభలో లేక పోవడమే ఒక లోటు!

            రేపటి మన రహదారి సుందరీకరణం కూడ కారం మిల్లు- ఆక్వా దాణా కేంద్రాల మధ్యనే ఉండగలదు!

           చెమట చుక్క మేలన్నా!

ఆరోగ్యమె భాగ్యమనెడి మన ఆర్యుల సూక్తి కన్న

శతమానంభవతియనెడి చల్లని దీవెనలకన్న

పరుల కొరకె దేహమనెడి ప్రవచనమ్ముల కన్నా

స్వచ్చ కార్యకర్త కార్చు చెమట చుక్క మేలన్నా!  

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

  09.02.2023.