2677* వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

2677* వ నాటి స్వచ్చ సుందరోద్యమ కబుర్లు.

            ఆనవాయితీగా నిర్ణీత స్థలానికి చేరుకొని, అనుకొన్న వేళకు ముందుగానే అంటే నేటి (10.02.2023) వేకువ 4.17 కే తొమ్మిది మంది కార్యకర్తలు కళ్లేపల్లి బాటలో బోణీ కొట్టారు! రోజుకొక గంట శ్రమ సమర్పణం అనే నియమం ఎప్పుడో దాటి పోయి, 6.16 దాక అంటే 2 గంటల తమ సమయాన్నీ, శ్రమనూ, విచక్షణనూ, మొత్తం 24 మంది ఇంచుమించు 40 కి పైగా పని గంటల వ్యవధిని మనస్ఫూర్తిగా ఈ రహదారి మెరుగుదలకు వెచ్చించారు!

            వారిలో ఇద్దరు సీనియర్ డాక్టర్లు, ముగ్గుర్నలుగురు ప్రస్తుత/ మాజీ బడి పంతుళ్లు, రైతులు, గృహిణులు, ఉద్యోగులు, ఒక CPM నాయకుడూ ఉన్నారు. విద్యార్థి యువతరం ప్రాతినిధ్యం ఈ వేకువ లేదు. బాట వెంటే వచ్చే - పోయే వ్యక్తులు గాని, ఆక్వా దాణా ఫ్యాక్టరీ సంబంధీకులు గాని చూడడం మినహా తమ వీధి స్వచ్చ సుందరీకరణలో వ్రేలు పెట్టిందీ లేదు!

            ఎవరు సహకరించినా, పట్టించుకోకున్నా ఈ చల్లపల్లి శ్రమదానం ఏళ్లుగా వేల దినాలుగా జరిగిపోతూనే ఉన్నది. పాతిక-ముప్ఫై మందో-అప్పుడప్పుడు 40-50 మందో పూనుకొని ఊరి చుట్టూ 7 రహదార్లను, బస్ స్టాండు ను, శ్మశానాల వంటి పబ్లిక్ ప్రదేశాలను, గ్రామ ముఖ్య వీధుల్ని, పంట మురుగు కాల్వల్నీ సంస్కరిస్తూనే ఉన్నారు. వివిధ కారణాలతో పాల్గొనజాలని దాతలు, సానుభూతి పరులు ఏదో విధంగా శాయ శక్తులా ఈ ఆదర్శ శ్రమదానానికి సగంమంది మద్దతు తెలుపుతూనే ఉన్నారు.

            విచారమేమంటే సాధారణ గృహస్తులూ, విద్యార్థులూ ఒక కాలక్రమణ పట్టికతో తమ గ్రామ బాధ్యతలకు ఉత్సహించకపోవడం!

            మహా శివరాత్రి పర్వదినం నాటికి శివరామపురం దాక 3 కిలోమీటర్ల బాటను ఎప్పటిలాగే ఒక శివాలయమంత స్వచ్చంగా శుభ్రంగా చేయాలనుకొన్న స్వచ్చ కార్యకర్తలు-

- ఈ వేకువ సమయంలో మేకల డొంక దాక చేరుకోగలిగారు. వాళ్లకు అడుగడుగునా మద్యం, ప్లాస్టిక్ సీసాలు, గ్లాసులు స్వాగతిస్తూనే ఉన్నాయి. ఎండు కొమ్మలూ, రకరకాల చెత్తలూ, పుల్లలూ, ప్లాస్టిక్ సంచులూ అన్నీ షరా మామూలే!

- సుందరీకరణం ముఠా కాస్తా ఈ వేళ రోడ్డు పునర్నిర్మాణ కార్మికులుగా మారి, కళ్లేపల్లి బందరు రహదారి కూడలిలో రాళ్లు మోసి, గుంటల్లో సర్ది, ఆ జంక్షన్ లో రద్దీ వాహనాలకు మరికాస్త వెసులుబాటు కల్పించారు.

- కత్తుల ముఠా యథా ప్రకారం డ్రైను లోనూ, గట్టు మీదా పనికిరాని మొక్కల్నీ, గడ్డినీ తొలగించే పనిలో ఉంటే -

- ఏడెనిమిది మంది పనిమంతులు ఒక ప్రక్క తుక్కుల్ని ట్రాక్టర్ లోకి నింపుతూనే గోనె సంచీడు ప్లాస్టిక్ వ్యర్థాల్ని సమీకరించారు!

- చీపుళ్ల వారు తమ విధిని తాము నిర్వర్తించారు.

- ఇద్దరు మళ్ళీ వెనక్కి పోయి, మద్యం దుకాణం దగ్గర మరొక పెద్ద సంచిని ప్రమాదకర ప్లాస్టిక్ వ్యర్థాల్తో నింపారు...

..... ఇలా ప్రతి వేకువ శ్రమదాన సంగతుల్ని నేను వ్రాసుకుంటూ పోవడమూ, చదివే వాళ్లు చదవడమూ సరేగాని, ఒక్క రోజన్నా ఈ శుభోదయ పారిశుద్ధ్యంలో పాల్గొనని, కనీసం వచ్చి చూడని వాళ్ళకు మాత్రం ఈ వ్రాతలు నమ్మదగనివిగానో ఆశ్చర్యార్థకం గానో ఉండవచ్చు.

            నేటి కఠిన శ్రమ సమీక్షకు ముందు  - నువ్వంటే నువ్వనుకొని ఆఖరికి BSNL నరసింహునికి అవకాశం దక్కి, శ్రమదానోద్యమ సందేశ నినాదాల్ని ముమ్మార్లు గట్టిగా విన్పించడమూ,

            కస్తూరి శ్రీనుడి చెత్త నుండి సంపద మొత్తం 560/- ని స్వచ్చోద్యమానికందించడమూ - ఆవిధంగా 6.45 కు నేటి కార్యక్రమం ముగియడమూ....!

            రేపటి శ్రమదాన సందడి కూడ ఇదే కళ్లేపల్లి రహదారిలో మేకలడొంక వంతెన కేంద్రంగా జరగవలసి ఉన్నది.    

          స్వచ్ఛ సైన్యపు పాదముద్రలు!

మంచు కురిసిన వానదంచిన మండుటెండల కాలమందున

విలాసముగా- వినోదముగా- విభ్రమముగా విచలితముగా

సమస్యాత్మక వీధులన్నిట స్వచ్ఛ సైన్యపు పాదముద్రలు!

కశ్మలాలను తరిమి కొట్టే కఠిన తర శ్రమదాన రీతులు! 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

  10.02.2023.