2678* వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

శనివారం – 2678* స్వచ్ఛ - సుందరీకరణ ప్రయత్నం!

          11.2.23 నాటి వేకువ 4.17 - 6.20 నడుమ సదరు ప్రయత్నంలో విజయం సాధించిన వారు 28 మంది! అందుమూలంగా బాగుపడినది పెదకళ్లేపల్లి దిశగా 100 గజాల మేకలడొంక ప్రాంతం. దానికి కొసరుగా జాతీయ రహదారి - శివరాంపురం రోడ్ల కూడలిలో నలుగురైదుగురి కృషి!- టూకీగా నేటి స్వచ్ఛ-శుభ్ర - సుందరోద్యమం అది! మరికాస్త వివరంలోకి దిగితే:

- ఏడెనిమిది మంది కార్యకర్తల గట్టి పూనికతో బాటకు పడమర డ్రైను చాల వరకు కశ్మల భారాన్ని వదిలించుకొని ఇది స్వచ్ఛ - సుందర చల్లపల్లి డ్రైనే అని చెప్పదగినట్లుగా మారింది. మరి - దాని కోసం కత్తులతో ఎన్ని పనికి మాలిన మొక్కలు తెగిపడ్డాయో, ఎన్ని ఎండుటాకులు, కొమ్మలు, చెత్త, ప్లాస్టిక్ వస్తువులు దంతెలతో లాగి, ట్రక్కులోకి చేర్చారో - కరెంటు కార్మికులు కొట్టి పడేసిన బరువు కొమ్మలెంత కష్టిస్తే రోడ్డు మార్జిన్ లో పొందికగా అమిరాయో... ఆ శ్రమకదా అసలు సంగతి?

- ఈ శనివారం నాటికి గాని రహదారి పారిశుద్ధ్య/సుందరీకరణ ప్రక్రియ ఎట్టకేలకు మేకలడొంక వంతెన దాటి 40 గజాల దాక విస్తరించింది. అందుకు పడిన అడుగులు రేడుగురు కార్యకర్తలవి!

- ఇద్దరు నర్సులు తదేక దీక్షతో ఊడ్చి, ఇప్పుడు పరిశుభ్రంగా ఉన్న 100 గజాల బాటను కూడ గమనించండి!

- మొన్నెప్పుడో ఒకాయన చేయి రంపం కోతకు గురైనా, ఈ వేకువ మరొక స్వచ్ఛ వీరుడు ఒక పెద్ద ఎండు కొమ్మను డ్రైను నుండి పైకి లాగుతూ కూలబడినా వాటిని మనం సీరియస్ గా తీసుకోవడమెందుకు?

- రోజైనా, ఎప్పుడైనా ఊరి వాళ్ళైనా, బైట వాళ్ళైనా చల్లపల్లిలో శ్రమదానం చూడాలనిపిస్తే - ఒక ఎడమచేతి వాటం కత్తి నిరర్థక చెట్లనెలా ఖండిస్తున్నదో ప్రత్యేకించి చూడండి!

- ఇక - సుందరీకర్తలది మరొక వీరోచిత శ్రమ సన్నివేశం. రెండు రోడ్ల కూడలిలో బాట అవక తవకల్ని ఐదారు రోజులుగా సరిదిద్దుతూనే ఉన్నారు. ఈ వేకువైతే ఒక పెద్దగుంట పూడిక కోసం దూరం నుండి రాతి ముక్కల్నెలా మోసుకొస్తున్నారో – వాట్సప్ మాధ్యమ చిత్రాల్లో వీలైతే పరిశీలించండి!

          అంతే గాదు స్వార్థంతో ఇన్నేళ్లుగా 30 40 - 50 మంది చల్లపల్లి వీధుల్లోనో, బైట రహదార్ల మీదో, శ్మశానాల్లోనో, మురుగు కాల్వల్లోనో - ఊడుస్తూ, చెట్లు నాటుతూ, సుందరీకరిస్తూ 4 లక్షల పైచిలుకు పనిగంటల కాలాన్నీ - శ్రమనూ వెచ్చిస్తున్నారో కాస్త పట్టించుకోండి! ఎక్కడో పెదకళ్లేపల్లి శివరాత్రి తిరునాళ్ళైతే నెల రోజులపాటు ఈ బాటను పరిశుభ్రతతో, పచ్చదనంతో వీళ్ళెందుకు ఎందుకు నింపాలి ?

          6.20 దాకా శ్రమించిన కార్యకర్తలు శ్రీనీత దాణా మిల్లు ఆవరణలో సంఘటితపడి, నేటి తమ శ్రమదాన బాధ్యతల్ని సమీక్షించుకొనేముందు విశేషాలు:

 

- దేసు ప్రభాకరుని జన్మదినాన్ని అతని సతీమణి ఘనంగా జరపడంలో భాగంగా కార్యకర్తలకు అ(న)ల్పాహార విందునిచ్చి, మనకోసం మనం’ ట్రస్టుకు 1000/- విరాళం సమర్పించడమూ,

- జన్మదిన బాలుడు (బర్త్డేబాయ్) ముమ్మార్లు మనసారా తన గ్రామ స్వచ్ఛ సుందర శ్రమదానోద్యమ నినాదాలు కావించడమూ!

          శివరాంపురం బాట శుభ్ర సుందరీకరణ కోసం మనం రేపటి వేకువ కలువదగిన చోటు మేకలడొంక వంతెన దగ్గరే !

          ఇదె సుమా సుమనోజ్ఞ దృశ్యం!

ఉమ్మడి శ్రేయస్సు కొరకు ఉడుం పట్టుగ స్వచ్ఛ సైన్యం

లక్ష్య సాధనకై వినూత్న విలక్షణ శ్రమదాన యజ్ఞం

ఊరి మేలుకు ఒక సమూహపు ఉత్తమోత్తమ మగు ప్రయత్నం

ఇది గదా మన స్వచ్ఛ గ్రామం! ఇదె సుమా సుమనోజ్ఞ దృశ్యం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

  11.02.2023.