2679* వ రోజు........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

           2679* (ఆదివారం) నాటి శ్రమ దాన వేడుక ! 

          12.2.2023 వ తేదీన గరిష్టంగా కురుస్తున్న మంచులో – ఊరికి 2-3 కిలోమీటర్ల దూరాన – కళ్ళేపల్లి మేకల డొంక దగ్గర 4.20 కే చేరుకొన్న కార్యకర్తలు 14మంది! వీధి దీపాలున్నా, వాహన దీపాలు వెలుగుతున్నా కనిపించని దారుల నుండి నెమ్మదిగా వచ్చి కలిసిన వారు పాతికమంది! ఇక – అక్కడి నుండి 2 గంటల పాటు – ఈ 39 మందీ ఏం సాధించిందీ వివరిస్తాను:

          3 భాగాలుగా మారిన కార్యకర్తలు ఒకే రహదార్లో 3 చోట్ల మూడు రకాల చర్యలు. అందులో మొదటిది జాతీయ రహదారి – శివరామపురం క్రాస్ రోడ్ల దగ్గర బండ పనులు! దూరం నుండి బరువు రాళ్లు ట్రక్కుతో తెచ్చి, జంక్షన్ రోడ్డు గుంటను పూడ్చి, సువిశాల పరచి, మునుముందు ఏ ప్రమాదమూ జరగనట్లుగా జాగ్రత్తలన్నమాట! వీళ్ళ ముందు చూపు విలువేంటో ఈ మంచు కురిసిన వేకువలో తెలిసొచ్చింది!

          2 వది సారా దుకాణం నుండి మేకల డొంక దాక- నిన్నా మొన్నటి డ్రైను వ్యర్థాల్ని పెద్ద ట్రక్కులో కెక్కించి, చెత్త కేంద్రానికి చేర్చడం. ఇందులో స్కూలు విద్యార్థులతో సహా 14 మంది శ్రమించారు.

          మరొక 14 మంది గుంపు కత్తులు- దంతెలు వాడి, శివరామపురం దిశగా 50 గజాల దారి కాలుష్య దరిద్రం పని పట్టింది. అక్కడ ముళ్ళ కంపలూ, ముళ్ళ మొక్కలూ, పాము పుట్టలూ ఉన్నా సరే-ఏ ఒక్కరూ సంకోచించలేదు.

          ఈ బృందం శ్రమదానానికి పర్యవేక్షకుడొకరు, మంచూ-చలీ నడుమనే మంచినీళ్ళందించేదొకరూ, ఛాయా గ్రాహకుడొకరూ! పని ముట్లందించే పెద్ద మనిషి ఇంకొకరూ! వెరసి 39 మందీ, మూణ్ణాలుగు వాహనాలూ, సరంజామా.... మొత్తానికిదొక సంచార వీధి పారిశుద్ధ్య కర్మాగారమనుకోండి! పెద్దగా రిపేర్లు లేకుండానే ఈ ఫ్యాక్టరీ 9 ఏళ్లుగా పనిచేసుకుపోతున్నది!

          ఇదంతా కూటికోసమో, గుడ్డ కోసమో కాదు- చల్లపల్లీ, దాని పరిసరాలూ పచ్చగా, శుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండాలనే కోరికతో మాత్రమే! ఇవన్నీ గ్రామస్తుల ఉమ్మడి ఆనందం-ఆరోగ్యం కోసమే!

          అంత చిన్న కోరిక ఖర్చు కోట్లలోనూ, శ్రమదానం లక్షల గంటలలోనూ! ఒక మంచి ఆశయం సాధించాలంటే ఇంత హంగామా తప్పడం లేదు!

          6.25 కు గాని ముగియని నేటి శ్రమదాన వేడుక, కబుర్ల- కాఫీల తరువాత నేటి శ్రమదాన సమీక్షా సమావేశంలో – 37 మంది అర్థ వలయంగా నిలబడి, చాలా నాళ్ళ ఎడంతో శ్రమదానం చేసిన లక్ష్మీ సెల్వం గారు సక్రమంగా ముమ్మారు చాటిన స్వచ్చ-సుందరోద్యమ నినదాలతోను, లంకే సుభాషిణి పంచిన కూరగాయలతోనూ, నందేటి శ్రీనివాస గాయకుని గానంతోను, స్వచ్చోద్యమ సంచాలక  వైద్యుని సముచిత సమీక్ష తోను 6.50 కి ముగిసింది.

          జనవరి మాసపు జమా- ఖర్చుల నివేదిక కూడ తెలిసింది.

          బుధవారం వేకువ మన పునరాగమనం శివరామపురం బాటలోనే!

        అదేం ఖర్మమో గానీ  

చదువుకొనీ మర్యాదగ ఉద్యోగిస్తున్న వాళ్లు

త్వరగ గడప దాటిరాని మహిళలు, కర్షకులిట్లా

మద్యం వాసనలు, దుమ్ము, మురుగు కంపు పీల్చడమే

అదృష్టమను కొంటున్నారదేం ఖర్మమో గానీ !  

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

  12.02.2023.