2680* వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

మళ్లీ రెస్క్యూ కార్యకర్తల వంతు - @2680*

            సోమవారం (13.2.23) వచ్చిందంటే ఆ కార్యకర్తలకు ఊళ్లో చేసినంత పని! రెండ్రోజుల భద్రతా చర్యల ప్రణాళిక సిద్ధంగానే ఉంటుంది! ఎక్కువగా బరువు పనులే!

            ఈ ఉదయం 4: 29 - 6.20 నడుమ 5+1+1 = ఏడుగురు బాధ్యుల శ్రద్ధ పెదకళ్లేపల్లి బాటలోని 2 పనుల మీద కుదిరింది

1) నిన్న - ఆదివారం ఇతర కార్యకర్తలు వృక్ష సుందరీకరణలో భాగంగానూ - రోడ్ల మెరుగుదల కోసమనీ కత్తిరించిన, చెక్కిన కొమ్మరెమ్మలూ, గడ్డీ కాస్త ఎండితే ఆ వ్యర్ధాల్ని ఊడ్చి, ప్రోగులు చేసి, చెత్త కేంద్రానికి చేర్చిన పనీ,

2) మేకలడొంక వంతెన ఒడ్డు వాన నీటికి కోసుకుపోకుండా గతంలో తామే తాటి బొందులమర్చిన చోట - మళ్లీ పెగ్గులు పాతి పటిష్టపరచిన పనీ,

            పనులేమంత నాజూకైనవీ కాదు, టన్నుల కొద్దీ పెరువు బరువు బండ పనులూ కావు గాని గ్రామ, జాతి సంపదల పట్లా, వంతెనల, రోడ్ల మన్నికల పట్లా ఈ మాత్రం దృష్టి పెట్టి, ఒళ్ళొంచి బాధ్యతగా పని చేసే మనుషు లేరీ?

            పంచాయతీలు, ఎన్నికైన వ్యక్తులు, వ్యవస్థలు, ఇతర సేవా సంస్థలు పూనుకోకనే గదా ఈ ఆరేడుగురు తమ సమయాన్నీ, శక్తియుక్తుల్నీ ఈ వేకువ సమయాన త్యాగం చేస్తున్నది?

            తమ లక్ష్యం నెరవేరి, 6.30 సమయంలో ఉదయ శంకర శాస్త్రీయ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలతో ఊరికి వారి ఉడతా సేవలు ముగిశాయి!

            మనసారా కోరుదాం!

ఒక మనోజ్ఞ దృశ్యం వలె - ఒక సుందర స్వప్నం వలె

ఒక సమగ్ర శిల్పంగా ఉమ్మడిగా - కలివిడిగా

సొంతూరిని దీవించే స్వచ్చోద్యమ సంరంభం

విజయ వంతమవ్వాలని, వేగమందుకోవాలని!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

  13.02.2023.