2681* వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

2681* వ వేకువలో రెస్క్యూ టీం కృషి.

            మంగళవారం (14-2-23) అదేదో ప్రేమికుల ప్రత్యేకమట! (దాన్నడ్డం పెట్టుకొని రాజకీయాలు కూడ నడుస్తాయట)

1) ఈ ప్రేమలూ - దోమలూ సరే మన ఊరి జనుల ఆరోగ్య సంక్షేమమే తొలి ప్రాధమ్యంగానూ, 'అందుకవసరమైన శ్రమదానం ఎన్ని రోజులైనా మేము సంసిద్ధంఅనే స్వచ్ఛ కార్యకర్తలారుగురు కేవలం మాటలు కాదు - ఆచరణలో పాటించిన సంగతిది!

            అందుకు ఈ చలీ - మంచు వేళ 4.30 నుండి 2 గంటల కాలాన్నీ, శ్రమనూ అర్పించేశారు. అంతకు ముందు వాళ్లు గుమికూడింది గస్తీ గది వద్ద; ఆయుధాలతో పాటు వెళ్లింది పెదకళ్లేపల్లి బాటలోని మేకలడొంక చెంతకు; దిగింది ఎండీ - ఎండని ఆకులు కొమ్మలు - బోలెడంత చెత్తా నిండిన డ్రైనులోకి;

            దంతెలతో లాగింది ఆ చెత్తా చెదారాన్ని, పనిలో పనిగా ఏరింది ప్లాస్టిక్ గ్లాసులూ, కప్పులూ, ఖాళీ సారా సీసాలూ, ఎంగిలాకులూ! ఈ వ్యర్థాల సంతను ఎక్కించి తరలించింది చెత్తకేంద్రానికీ, అందుమూలంగా వాతావరణానికి తప్పిందేమో కాలుష్యం బెడద! ఇక - ఈ అల్ప సంతోషులకు దక్కింది గుండెల్నిండా సంతృప్తి!

            ఇది 9 ఏళ్లుగా చల్లపల్లిలో ప్రతి వేకువా జరుగుతున్న దినచర్యే! ఇదంతా చూసీ, వినీ ఇప్పటికీ సరిగా స్పందించనిది కొందరు గ్రామస్తులే!

            మాలెంపాటి అంజయ్య గారు ముమ్మారు అరచి చెప్పినవి గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలే!

            రేపటి వేకువ విస్తృత కార్యకర్తల శ్రమదానం ఆవశ్యకత మేకలడొంక (శివరామపురం బాటలో) దాటాక వీధి గుడిసెల ప్రాంతమే!

            అతని చేతి చలువ లేక

కార్యకర్త శ్రమ జరుగక కల్మష హరణం ఉండదు

అతని చేతి చలువ లేక రహదారులు బాగుపడవు

శ్మశానాలు మెరుగు పడవు - అతని చొరవ లేకుండా

పచ్చదనం, ఆహ్లాదం పరచుకొనవు ఊరినిండ!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

  14.02.2023.