1854 * వ రోజు....

          

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1854* వ నాటి శ్రమదాన సంగతులు.

 

స్వచ్చోద్యమ చల్లపల్లి ఆనవాయితీ ప్రకారం ఈ సోమవారం వేకువ 4.05-6.20 నిముషాల నడుమ గ్రామ ప్రధాన (మూడు రోడ్ల) కూడలిలో జరిగిన శ్రమదాన బాధ్యతలు నిర్వర్తించిన కార్యకర్తలు 27 మంది.

 

నాగాయలంక రోడ్డు లోని పెట్రోలు బంకు దగ్గర ప్రాంత మంతా శుభ్ర పరుస్తూ, బందరు దారిలోని పెట్రోలు బంకు, చిన్న కార్ల స్టాండు, A.T.M కేంద్రం, కూరగాయల దుకాణాల మీదుగా బందరు మార్గంలో షాబుల్ వీధి వరకూ కొనసాగింది. టిఫిన్ బళ్ల, కొబ్బరికాయల దుకాణాల, ఉభయ దేవాలయాల ముంగిట అన్ని రకాల చెత్త-దుమ్ము-రకరకాల వ్యర్ధాలన్నిటిని ఊడ్చుకొంటూ-పేరుకుంటూ-అన్నిటినీ గుట్టలు చేసి, ట్రాక్టర్ లోని కెక్కిస్తూ గంటన్నర పైగా నిస్వార్ధంగా శ్రమించిన కార్యకర్తలకు గ్రామస్తుల తరపున నా అభినందనాలు.

 

దారి కిరుప్రక్కల రాతి ముక్కల్ని, మట్టిని బైటకు లాగి, అంచుల్లో పేరుకున్న మట్టిని గోకి ట్రాక్టర్ కెత్తి అవసరమైన చోట ఆ రాళ్లు- మట్టి నంతటినీ గుంటల్లో నింపుతున్న ఈ స్వచ్చోద్యమ కారుల ఋణం ఈ గ్రామం ఎప్పటికి  తీర్చు కొంటుందో!

 

వీరు కాక, మరొక ఇద్దరు గ్రామం అష్ట దిక్కులా గతంలో నాటి, పెంచుతున్న వేలాది చెట్లకు, పూల మొక్కలకు టాంకరుతో నీరందించే తమ దైనందిన విధులలో ఉనారు.

 

ఆనవాయితీ కిభిన్నంగా సుందరీకరణ బృందం చీపుళ్లను, గొర్రులను వాడుతూ జాతీయ రహదారిని వదలి సంత బజారును శుభ్రం చేయడం నేటి విశేషం! పోలీసు కార్యాలయం రైతు బజారు, సంతల ముందు స్వచ్చోద్యమ కారులే వ్యయ ప్రయాసలతో వేసిన రంగు రాళ్ల మీది మట్టిని, మురికిని, గోడల మీది దుమ్ము, ధూళిని కూడ తొలగించడంతో నేటి కార్యకర్తల కృషి పరి పూర్ణమయింది.

 

నేటి సమీక్షా సమావేశంలో మధురంగానూ, కాస్త దబాయింపు గాను దేసు మాధురి నినదించిన స్వచ్చ-శుభ్ర-సుందర సంకల్పాన్ని పునరుద్ఘోషించి 6.45 నిముషాలకు గ్రామ బాధ్యతలకు స్వస్తి పలకడమైనది.

 

రేపటి మన గ్రామ బాధ్యతల కొనసాగింపును విజయవాడ రోడ్డులో 6 వ నంబర్ కాలువ దగ్గర ప్రారంభిద్దాం.

 

                సర్వదా అనుసరణీయత...

స్వచ్చ-శుభ్ర స్వాంతమెవరిది? సహాన శీలన జాడలెవరివి?

నిరంతర శ్రమదానమెవరిది? సృజనశీల వినోదమెవరిది?

ఎవరు పంచాబ్దముల పైన సుదీర్ఘ స్వచ్చోద్యమం కర్తలు-

ఆ మహత్తర చల్లపల్లి స్వచ్చ సైన్యపు అడుగు జాడలు...

 

     నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

సోమవారం – 9/12/2019

చల్లపల్లి.