2682* వ రోజు.... ....

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

గ్రామ స్వచ్ఛ- సుందరోద్యమ పని దినాల సంఖ్య 2682*

            బుధవారం (15.2.23) వేకువ 4.22 కు మొదలై 6.18 కి ముగిసిన పెదకళ్లేపల్లి రహదారి పారిశుద్ధ్య కృషిలో కాలు పెట్టిన - వేలు పెట్టిన కార్యకర్తల సంఖ్యా బలం 34. ఈ సంఖ్య పెరగడానికొక కారణం కోడూరు వారి 44 వ వివాహ వార్షికోత్సవం!

            అలాంటి వైవాహిక విందు వేడుకల్నెవరైనా ఊరికి 3 కిలోమీటర్ల దూరంగా ఉదయం ఆరింటికే - మురికి పని వాళ్ళ మధ్య జరుపుకోవడం చూశారా? మరి స్వచ్చోద్యమ చల్లపల్లిలో ఇలాంటివి - 4.20 కే రోడ్లు ఊడుపులూ, మురుగు కాల్వల రిపేరునూ వైద్యులూ, పంతుళ్లూ, రైతులూ, గృహిణులూ, వ్యాపారులూ తదితర కార్యకర్తలూ చేసుకుపోతుంటారు! మీటింగులూ - చర్చలూ గట్రా జరిగిపోతుంటాయి!

            అయంముహూర్తోస్సుముహూర్తఃఅంటూ తగుదుమమ్మా - అని 15 మంది 4.20 కే మేకలడొంక వంతెన దగ్గర నిలబడితే ఇంకా 19 మంది నిముషక్రమంలో వచ్చి కలిస్తే - శివరాంపురం బాటలోనే 3 చోట్ల - మువ్విధాలుగా జరిగిన నేటి 2 గంటల శ్రమదాన పని విధంబెట్టిదనిన:

1) జాతీయ రహదారి కూడలిలో రోడ్డు మరమ్మత్తు పని కార్మికుల సంఖ్య తగ్గినా, పని తగ్గలేదు! కొంచెం దూరంనుండి ట్రక్కులో రాళ్లు నింపుకొని, ఒక గుంటలో నింపి, పైన మట్టి కప్పి, కూడలి మలుపుల్ని మరింత విశాలంగా, సౌకర్యంగా మార్చారు!

2) ½ కిలోమీటరు బారునా అక్కడక్కడా మిగిలిన డ్రైను వ్యర్థాలను ప్లాస్టిక్ వస్తువుల్ని వేరు చేసి, డిప్పల్తో ట్రక్కులోనికి మోసి, చెత్త కేంద్రానికి తరలించిన వారు మొత్తం 15 మంది!

3) మిగతా కార్యకర్తల్లో సగం మంది బాట కిరుప్రక్కలా పిచ్చిమొక్కల్నీ, గడ్డి దుబ్బుల్నీ నరుకుతూ, ప్లాస్టిక్ పదార్థాల్ని ఏరుతూ, కొబ్బరి బొండాల్నీ, తాటి టెంకల్నీ, మట్టల్నీ ప్రోగులు చేస్తూ, బాటను ఊడుస్తూ పొలం గట్టునూ, లోతట్టు దిబ్బల్ని శుభ్రపరుస్తూ గడిపారు!

            ఎలాగైతేనేం 6.15కు సూర్యుడు జంకుతూ తొంగి చూసే వేళకు ప్రాతదికాక - క్రొత్తగా 150 గజాల బాట చూడ చక్కగా మారింది! ట్రాక్టర్ కు అటూ - ఇటూ వ్రేలాడుతున్న ప్లాస్టిక్ వస్తువుల గోనె సంచులు నిండాయి. అటు పని విరమణ వేళకు తాము సాధించిన రహదారి మెరుగుదలను చూసుకొని స్వచ్ఛ కార్యకర్తల మనస్సులూ సంతృప్తి చెందాయి!

            కొద్దిమంది కార్యకర్తలు అఇష్టంగానే పని విరమించి, 3 వ విజిల్ మ్రోగడం వల్ల - న్యూట్రిఫీడ్  ప్రక్క అడితీ దగ్గరకు చేరుకొని, సమీక్షా సమావేశంలో నిలబడి, 44 ఏళ్ల నాటి ప్రాత పెళ్లికొడుకు - కోడూరు వేంకటేశ్వరుడు స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలుచ్ఛరించి, ‘మనకోసం మనంట్రస్టుకు 1020/- సమర్పించి, స్వల్పాహారం పేరిట ఘనాహారాన్నే సహకార్యకర్తల కందించి

            అడపా మహాశయుని సూక్తులు విధిగా అందరూ విని - రేపటి శ్రమదాన కార్యక్రమాన్ని నిర్దేశించుకొని - 7.00 కు గాని ఇళ్లకు చేరుకోలేదు!

            శివరాత్రి నాటికి శివరామపురం దాక స్వచ్ఛ సుందరీకరించే లక్ష్యం చేరుకొనేందుకు

            రేపటి శ్రమదాన ప్రదేశం - కొలిమిశాల దగ్గర మనం కలిసి సాగవలసియున్నది!

            ఇదేం ఖర్మ గ్రామాలకి?

వీధులన్ని అశుభ్రమా! వెగటు పుట్టు దరిద్రమా!

గుడులు బడులు పవిత్రమా! గోడ బైట అసహ్యమా!

ఇళ్లలోని పరిశుభ్రత వెలుపలంత నిషేధమా!

ఇదేం ఖర్మ గ్రామాలకి? ఎన్నాళ్ల దుస్థితి?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

  15.02.2023.