2683* వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

మంచు వానలోనే రహదారి మెరుగుదల పనులు - @2683*

            పని వాళ్లు పాతిక మంది - పదిమందికి పైగా 4.17 కే తయారు, ఎక్కడంటే శివరాంపురం దిశగా కొలిమి వద్ద, అద్దానికి ఉత్తర - దక్షిణాభిముఖాలుగా 100 గజాల పరిశుభ్ర - సుందరీకరణం! పారిశుద్ధ్య కార్మికులుగా కనీసం ఇద్దరు డాక్టర్లు, నలుగురైదుగురు రైతులు, ఒకరిద్దరు వ్యాపారులు, విశ్రాంత వయోవృద్దులు, టీచర్లు, ఉద్యోగినులూ వగైరా!

            గురువారం (16.2.23) నాటి వేకువ శ్రమదాన చరిత్ర టూకీగా అదీ! మరి వీళ్లంతా ఇంత చలిలో వేకువ కాలంలో - ఈ 3 కిలోమీటర్ల దూరంలో - డ్రైన్లను బాగుచేసేదీ, రోడ్లు ఊడ్చేదీ, ప్లాస్టిక్ తుక్కులు ఏరేదీ, తామే నాటి - పెంచి - రహదార్లను పచ్చదనంతో పరవశింపజూస్తున్న చెట్లను మరింత సుందరీకరించేదీ, ఇంకా రోడ్ల గుంటలు పూడ్చేదీ..... ఇంటి వద్ద వెచ్చగా పడుకొని నిద్ర పట్టక కాదు!

            పంచాయితీల వంటి ఎన్నికైన ప్రభుత్వ వ్యవస్థలు విఫలమౌతుంటే - స్వచ్ఛంద సేవా సంస్థలూ శక్తి లేకో ఎందుకో పట్టించుకోకుంటే - స్వచ్ఛ సంస్కృతికి పిలుపిచ్చిన ప్రభుత్వాలు మర్చిపోతే - వాతావరణం కాలుష్య ఆర్తనాదాలు చేస్తుంటే - విని, తట్టుకోలేక, ఒక సామాజిక కనీస బాధ్యతగా రోడ్డెక్కిన వాళ్లు తప్ప మరొకటి కాదు!

ఈ వేకువ వేళ ఆ పాతిక మందీ ఒక ఉమ్మడి పయత్నంగా ఒరగ బెట్టిందేమిటని సమీక్షిస్తే:

- అడుగో ఒక రైతు పెద్ద - కొన్ని అనారోగ్య సమస్యలున్నా లెక్కచేయక ట్రాక్టర్ పై కెక్కి, 10 మంది కార్యకర్తలందిస్తున్న ఎన్నో రకాల వ్యర్ధాల డిప్పలందుకొని, గంటన్నరపాటు సర్దాడు - 2 ట్రక్కుల చెత్తను ఒక్కదానికే పరిమితం చేసిన పట్టుదల అతనిది!

- ఒక సీనియర్ మోస్ట్ వైద్యుడూ, మరొక జూనియర్ మోస్ట్ డాక్టరమ్మా చీపుళ్లతో రహదారినీ, మార్జిన్లనూ శుభ్రపరిచారు!

- ఇద్దరు నర్సులూ ఇందులో కృతకృత్యులయ్యారు!

- అవి పాము పుట్టలో - చెద పుట్టలోగాని, నరుకుతున్నవి పిచ్చి మొక్కలో ముళ్ళ మొక్కలో గాని, 10 మంది కత్తుల వారు రోడ్డుకూ పొలం పంటకూ నడుమ 60 - 70 గజాల మేర తేట పరిచారు! రోడ్ల గుంటల స్పెషలిస్టులు కూడ వీరికీ రోజు కలిసొచ్చారు! ఈ పనిలోనలుగురు దంతెల వాళ్ల సహకారం తప్పలేదు!

- పని మధ్య శ్రమ తెలియకుండ ఒకాయన కూనిరాగాలు తీస్తే మరొక కార్యకర్త జోకుల్లాంటివి వదిలాడు!

 

            వీళ్లలో ఎవరెంత కష్టించారు, ఎన్ని గంటలు పాటుబడ్డారు, ఎన్ని గజాల బాటను మెరుగుపరిచారు...అని కాదు లెక్కలేయ వలసింది – ‘ఈ కార్యక్రమం మొత్తం నుండీ ఆలోచనాపరులైన గ్రామస్థులేపాటి స్ఫూర్తిని తీసుకొన్నారుఅని కదా!

            3.30 కు మేల్కొని, 4.15 కు నిర్ణీత రహదారిని చేరుకొని, 6.37 దాక - రెండు గంటల పైగా - అంతా కలిపి ఏ 45 పనిగంటలో స్వార్ధానికి కాక, పరార్థానికి పాటుబడిన చల్లపల్లి శ్రమదానం కాక ఇంకేది స్ఫూర్తిమంతం కాదగినది?

            నిన్న – 15.02.2023 న మిక్కిలినేని మధు & రాజశ్రీ ల కుమార్తె లక్ష్మీ మనోజ వైవాహిక విందు వేడుకలలో వేలాది మంది భోజన - భాజనాలలో ఏ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడక – 99 శాతం పర్యావరణహితంగా నిర్వహించడం మాత్రం మనందరికీ ఆమోదయోగ్యం- ఆదర్శవంతం- ఆచరణీయం- స్ఫూర్తిమంతం కాకపోతుందా?

            6.40 కి బృందమంతా అర్థవలయంగా నిలబడి, పద్మావతి ఆస్పత్రిలో క్రొత్తగా చేరిన డాక్టర్ దివ్య తేజ ముమ్మార్లు ప్రకటించిన నినాదాలతో నేటి స్వచ్చోద్యమ కథ ముగింపు!

            ఇంకా మిగిలిన రహదారి సుందరీకరణ కోసం మనం రేపటి వేకువ సమధికోత్సాహంతో కలిసి శ్రమించవలసినది పంట - కాల్వ వంతెన దగ్గరే!

   మీనమేషాలను లెక్కించడ మిదేం ఖర్మ?

సదుద్దేశమని గ్రహించి, సత్ఫలితాలనుభవించి

తొమ్మిదేళ్ల స్వచ్ఛోద్యమ తుది ఫలితాలందుకొనీ

ఇంకా మీనమేషాలను లెక్కించడ మిదేం ఖర్మ?

గ్రామానికి - రాష్ట్రానికి - దేశానికి ఇదేం ఖర్మ?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

  16.02.2023.