2684* వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

శివరామపురం పంట కాల్వ దగ్గరగానే 29 మంది శ్రమదానం - @2684*

            శ్రమదానం శుక్రవారం - 17-2-23 నాటిది, సమయం - 4.176.45 మధ్యది 4.30 కు బదులు 4.17 కే వచ్చి, పనికి సంసిద్దులైన తొలి బ్యాచ్ 14 మంది! పని జరిగింది మాత్రం P.K. పల్లి రహదారికే చెందిన 3 చోట్ల! ముందుగా చలి దెబ్బ, 5.30 నుండి మంచు దెబ్బ పడి, 7 దాటినా తడాఖా చూపుతూనే ఉన్నాయి!

            ముందుగా రహదార్ల కూడలిలో నాకు కన్పించిందీ, నేను కూడ వేలు పెట్టిందీ కాస్త బరువైన రహదారి మరమ్మత్తు పనిలోదే! ఆ నలుగురైదుగురిలో ఒకాయన బండరాళ్ల బరువు డిప్పలెత్తి అందిస్తుంటే వ్యాను పైన నిల్చి, అందుకొని సర్దుతున్న వ్యక్తి ఒక పెద్ద డాక్టరమ్మ!

            అక్కణ్ణుంచి మేకలడొంక దాటి 1 కిలోమీటరు దూరం పోతే - మళ్లీ ఆ పొలం గట్ల, బాట అంచుల్ని గడ్డీ, పిచ్చి చెట్లూ నరికేస్తూ, తాటి - కొబ్బరి టెంకల్నీ, బొండాల్నీ గుట్టలు చేస్తూ, చతుర్లాడుకొంటూ పనిచేసుకుపోతున్న డజను మంది కార్యకర్తలు! అందులో ఒకాయన పనిచేస్తూనే తెలంగాణ ప్రాంతపు ఒగ్గుకథ’ (గొల్ల సుద్ధులు) ను పాడుతూ క(వి)నిపించాడు!

            ఇంకొంచెం ముందువైపు - కొలిమి దగ్గరగా 10 మందిది మరీ సందడి దృశ్యం! అప్పటికే చెట్ల సుందరీకరణలో భాగంగా నరికిన, చెక్కిన కొమ్మ రెమ్మల్నీ - గడ్డినీ, ఇతర తుక్కుతో బాటు దంతెల్తో గుట్టలు చేస్తూనూ, ట్రాక్టర్లోకి ఎక్కిస్తూనూ తీరిక లేకుండా చకచకా పనిచ జరిగిపోతున్నది!

            ముగ్గురేమో చీపుళ్లతో బాటను ఒకటికి రెండు మార్లు ఊడ్చే పనిలో! నాకు ఈ స్వచ్చంద శ్రమదాన దృశ్యాలు క్రొత్తగాదు గానీ, అప్పటికప్పుడు తొలిసారి వచ్చి చూసే వాళ్లకు మాత్రం ఇదొక వింత సన్నివేశమే!

            ఈ డాక్టర్లేమిటీ - పంతుళ్లేమిటీ - వ్యాపారులూ, రైతులూ మహిళలూ - వేకువ నాలుగింటికే రోడ్డెక్కి ఏదో ఉద్యోగం చేస్తున్నంత నిష్టగా ఈ పారిశుద్ధ్య - సుందరీకరణ పనులేమిటీ? ఆగంతుకులకిది అర్థం గాని అయోమయమే గదా!

            ఏ రోజైనా చల్లపల్లి శ్రమ వేడుకలో మరీ ఆకర్షణీయ దృశ్యం చివరి 20 నిముషాల్లో! బహుశా అది చెత్త లోడింగ్ పని! టైమయిపోతున్నదనీ ఆ నాటి పని మిగిలిపోతున్నదనే తొందరలో ఆ చురుకుదనం పని నైపుణ్యం - ఐదారు నిముషాల పనివేళ పొడిగింపూ నేను తప్పక గమనిస్తుంటాను.

            ఈ ఉదయం ప్రత్యేకతేమంటే - 4 గంటలకే ఇళ్లు వదలి - 4.17 కే రహదారి పన్లకు దిగి - అన్నీ ముగించుకొని ఇంటికి చేరే సరికి 7.00 దాటడం! అనగా తలా 3 గంటల సమయదానమన్నమాట! తొమ్మిదేళ్ల స్వచ్ఛోద్యమ చల్లపల్లి శ్రమ వేడుక రుచి అలాంటిదేమో!

 

15 నిముషాల సమీక్షా సభలో:

1) ఊరి సర్పంచమ్మ రెండేళ్ల పదవీ నిర్వహణ జ్ఞాపికగా కార్యకర్తల అభినందనమూ, ముఖ్యంగా గొరిపర్తి నాగ శేషు సహచరులకు బిస్కట్ల విందూ,

2) అతడు శ్రావ్యంగా పాడిన 2 గేయాలూ, ‘మనకోసం మనంట్రస్టుకు సమర్పించిన 500/- విరాళమూ,

3) సర్పంచి గారి స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలూ, స్వచ్ఛ సంప్రదాయానుగుణంగా ఆమెకు శేషు పచ్చని మొక్కల బహూకరణమూ,

4) మనమందరమూ గుర్తుపెట్టుకోదగిన మొన్నటి మిక్కిలినేని మధు గారి హరిత విందు వేడుకలను డాక్టర్ డి.ఆర్.కె గారు గుర్తుచేయడం.    

            రేపటి శ్రమదాన నిమిత్తం మనం మరొక మారు కలువదగినదీ, శ్రమించదగినదీ పంట కాలువ వంతెన దగ్గరే!

     ఆతని సత్కర్మాచరణే ముఖ్యం!

మేమె సుమా గాంధీజీ, సుందరయ్య వారసులం

సామాజిక బాధ్యతలను చక్క బెట్టు మనుష్యులం...

అనే అహం దరిజేరక ఆత్మీయతతో మెలిగే

కార్యకర్త - ఆతని సత్కర్మాచరణే ముఖ్యం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

  17.02.2023.