2686* వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

ఆదివారం నాటి పనిదినం సంఖ్య 2686* పని వాళ్ల బలం – 32

          19.2.23 వేకువ 4.20 కే 16 మంది శివరాంపురం కాల్వ వంతెన దగ్గర మోహరించి, నిముషాలు గడిచే కొద్దీ మరో 16 మంది వచ్చి కలిసి 6.25 దాక - 2 గంటల పాటు - ఎర్రటి మొహం వేసుకొని సూర్యుడు వచ్చిన తర్వాత - కొత్తూరు శివరాంపురంలో తమ ప్రయత్నం విరమించారు. అప్పటికే 100 గజాల పెదకళ్లేపల్లి దారి చెప్పుకోదగ్గంత స్వఛ్ఛ - సుందరంగా మారిపోయింది!

          అసలు నేటి శ్రమదానం మొదలయ్యేప్పటికే ఈ బుల్లి ఊరు ప్రవేశం దగ్గర - చాల ఇతర గ్రామాల్తో పోలిస్తే చాల మెరుగ్గా ఉందనే చెప్పాలి. ట్రస్టు కార్మికులు కొట్టిన కొమ్మలు గాని, ఊరి వాళ్ళో బాట సారులో త్రాగి విసిరిన నీళ్ల, సారా సీసాలు గాని, కొబ్బరి - తాటి టెంకలు గాని, అన్నీ కలిపితే మహా ఐతే ఒక ట్రక్కు వ్యర్ధాలే గదా!

          పైగా చల్లపల్లి కార్యకర్తలకు ఈ ఉదయం సహకరించిన ఈ గ్రామస్తులు ఐదారుగురు! చలీ - మంచూ దోబూచులాటల నడుమ నేటి శ్రమదాతలు రెండుగా విడిపోయి, ఎక్కువ మంది ఇక్కడా, నలుగురైదుగురు బందరు రహదారి దగ్గరా శ్రమించారు. (పంటకాల్వ దక్షిణపు గట్టు వద్ద మరీజాస్తిగా గలీజు కనపడిందని - ఒక విశ్రాంత ఉన్నతోద్యోగి కసి తీరా మొక్కలు నరికి, తుక్కు లాగి, ఊడ్చి, ఇంచుమించు ఒంటరి పోరాటం చేశాడు!)

          నేటి అసలైన కష్టమూ, సందడీ ఊరి చివరి ఇళ్ల దగ్గరే! తాడి మొలకల్నీ, నూగు మొక్కల్నీ, పిచ్చి మేడిలాంటి చెట్లనీ, నరికే వాళ్లు నరుకుతుంటే - వాటి మధ్య ఇరుక్కొన్న ప్లాస్టిక్ తుక్కునీ, ఇతర చెత్తనీ దంతెల్తో లాగి, గుట్టలు చేసే వాళ్లు చేస్తుంటే - రోడ్డునీ, రచ్చబండ ఖాళీ చోటునీ ఊడ్చే బాధ్యత కొందరు  పంచుకొంటే - వచ్చే పోయే వాహన ప్రమాద హెచ్చరిక మరొకతను చేస్తుంటే - గంట కాల మిట్టే గడిచిపోయె!

          సుందరీకరణం ముఠా 2 వారాలుగా కఠిన బాధ్యత తీసుకొని, జాతీయ రహదారి జంక్షన్ గుంటల - ఎగుడు దిగుళ్ల లోపాల్ని సరిదిద్దడం 90% పూర్తి చేసింది. (కిలోమీటరు దూరాన ప్రధాన శ్రమదాన స్రవంతిలో కలిసేందుకు వాళ్లు బయల్దేరితే - A. V. గురవారెడ్డి మహాశయుడు (ఏస్) మొరాయించి, నెట్టుకొని, మళ్లీ ఇంజను మ్రోగించుకొని వచ్చే సరికొకింత ఆలస్యమయింది!)

          అసలు ఎత్తైన ట్రాక్టర్ మీద నిలిచి, చెత్తను లోడ్ చేయడమే కష్టమనుకొంటే - ఏడెనిమిది మంది క్రింది నుండి విసిరే చెత్త డిప్పల్నీ, తుక్కు నల్నీ అందుకొంటూ - రెండు ట్రక్కుల వ్యర్థాల్ని ఒక్కటికే పరిమితం చేసేలా సర్దుతూ - పైన కరెంటు తీగల ముప్పును కాచుకొంటూ ఇద్దరు లోడింగ్ వీరులు చేసిన శ్రమనూ - నైపుణ్యాన్నీ చూసి తీరాల్సిందే!

          ఈ సందడంతా సద్దుమణిగేందుకు - 6.00 కాదు - 6.40 దాక పొడిగింది! ఆ తదుపరి సమీక్షా సభలో:

1) తిరునాళ్లు - ఉత్సవాల కమాత్ర ప్రయోజనకర ప్లాస్టిక్ వ్యర్ధాల సమస్య మీద చర్చజరిగి,

2) స్థానికుడు - B.D. R. ప్రసాదు ముమ్మారు స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలను ప్రకటించి,

3) 20 రోజులుగా జరిగిన పెదకళ్లేపల్లి రహదారి మెరుగుదలను ప్రశంసించి,

          సుమారు 7.00కు ఇళ్లకు చేరారు!

          బుధవారం వేకువ మన శ్రమదానం కోసం ఎదురు చూస్తున్నది బెజవాడ బాటలో - చండ్ర వికాస కేంద్ర ప్రదేశమే!

        సహనంగా చూస్తున్నది!

వనరైనది - అనువైనది - ఘన చరిత్ర కలిగున్నది

ఎన్నెన్నో ఉద్యమాల కిది నెలవని పేరున్నది

చల్లపల్లి మెరుగుదలకు స్వచ్చోద్యమమొకటున్నది

క్రొత్త - శ్రమదాతల రాక కొరకు సహనంగా చూస్తున్నది!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

  19.02.2023.