2687* వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

2687* వ రహదారి పెరుగుదల ప్రయత్నం రెస్క్యూ టీం వారిది!

          పెదకళ్లేపల్లి దిశగా మేకలడొంక, పంటకాల్వ వంతెనల రోడ్డు సేవలకు వెళ్లే ముందు ఐదుగురు స్పెషలిస్టు వాలంటీర్లు 4.26 కే గస్తీగది వద్దకు చేరారు. తదాది 6.20 దాక - శివరామపురం నుండి మరొక వ్యక్తి కూడ కలిసి, కాలుష్యం పని పట్టారు.

          ఐదారేళ్ల క్రిందటి ఒక రాజకీయ పెద్దమనిషి ఒకానొక ఆనకట్ట ఏమైనా సరే పూర్తిచేయాలనుకొని ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకొని, నానాపాట్లూ పడినట్లే - ఈ ఆరేడుగురు మొండి వాళ్ళు కూడ ప్రతి సోమ మంగళవారాల్లోఏదో ఒక వీధి పారిశుద్ధ్యమో రోడ్ల గుంటలో, కాల్వ గట్ల పటిష్టీకరణమో చేస్తుంటారు!

          ఎంత బరువు - మురుగు పనులైనా వెనకాడరు! ఐదారేళ్లుగా ఇదే వరస! మళ్లీ ఈ గట్టి వాళ్లకు ఒక హిందీ పంతులు గారి, పశువుల డాక్టరు గారి సపోర్టులు!

          ఈ వేకువ కూడ ఏ 3 కిలోమీటర్లో వెళ్లి, నిన్నటి దాక స్వచ్ఛ కార్యకర్తలు చెమటోడ్చిన శివరామపురం రోడ్డునే మరింత మెరుగుపరిచేందుకు తయారయ్యారు. క్రొత్తగా పడిన, ఎక్కడైనా నిన్నటి మిగిలిపోయిన చెత్తుంటే - క్షుణ్ణంగా ఊడ్చి, ఎత్తి, డంపింగ్ కేంద్రానికి చేర్చారు!

          ఆ కార్యకర్తల దృష్టిలో ఇది చాల తేలిక పనే గాని, ఆ 2 - 3 కిలోమీటర్ల రహదారి సౌందర్యానికవసరం! మరి - ఆ పారిశుద్ధ్య సౌందర్యాలేమో వందలాది ప్రయాణికుల ఆహ్లాదానికి ముఖ్యం!

          పని ముగించుకొని, తాము నెల నాళ్లుగా తీర్చిదిద్దిన రహదారి పట్ల సంతృప్తితో తిరిగి గస్తీగది వద్దకే వచ్చి - 6.55 కు BDR ప్రసాద్ పలికిన గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలతో ఈ శుభోదయాన్ని ముగించారు!

         చేసేవారు కాదు గనీ -

ఇంత పెద్ద చదువు చదివి డాక్టర్లూ, ఈ రైతులు

ఇదేం ఖర్మ! ఇదేం ఖర్మ - మట్టి పిసుక్కోవడమా!

చెత్త ఏరి - రోడ్లు ఊడ్చి - సిల్టు తోడు ఖర్మేంటని

చేసేవారు కాదు గనీ చూసేవారికనిపిస్తది!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   20.02.2023.