2688* వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

నిన్నటి రహదారి సేవలోనే - @ 2688*

            మంగళవారం (21-2-23) వేకువ కూడ ఆ ఐదుగురు స్వచ్ఛ వీరులే అదే గస్తీ గది  దగ్గరే 4.25 కే  - త్వరగా శివరామపురం బాటలోని మేకలడొంక దగ్గరకు చేరుకోవడమేంటీ - పనిలో దిగడమేంటీ - గబగబా జరిగిపోయాయి!

            ఈ వీధి - రహదారి నెలనాళ్ల పాటు - స్వల్ప విరామాలతో ఏ వెయ్యిగంటలో కార్యకర్తలు శ్రమించి, శుభ్రపరిచిందే. మరి మళ్ళీ ఈ రెస్క్యూటీం అనబడే వాళ్లకిక్కడేం పనిఅనుకోనవసరం లేదు. ప్రభుత్వ సారా అంగళ్లూ, తాడిచెట్లూ చల్లగా ఉండాలే గాని, వేళా పాళా లేకుండ మత్తులో జోగే వాళ్లు పచ్చగా ఉండాలే గాని, వచ్చే - పోయే వాళ్ళు కూడ తలా చెయ్యి వేస్తుండాలే గాని - ఈ రహదారిలో చెత్తకూ, ప్లాస్టిక్ నికృష్టాలకూ లోటేమిటి?

            కూర్చొని తింటుంటే కొండలైనా కరిగి పోతాయిఅనే సామెతొకటుంది. దాన్ని కాస్త మార్చి, “ప్ర-సా-దు-ల దగ్గర త్రాగి త్రాగి పడేస్తుంటే అన్ని చెత్త సంపదలూ కొండల్లా పెరుగుతాయిఅని చెప్పుకోవాలి మరి!

            పంచ కార్యకర్తల శ్రమదానం గురించి చెప్పేదేముంది? 4.25 మొదలు 6.20 దాక డ్రైన్లో పడిన అన్ని రకాల చెత్తనే ఏరారో, మళ్లీ పడిన కొబ్బరి బొండాల్నీ, తాటి టెంకల్నీ ప్రోగేసి, ట్రక్కులోకెక్కించారో, ఆకులలముల్ని ఊడ్చి బాటను పునః సుందరీకరించారో..... అది చాల వరకు ప్రాత కథే!

            ఐతే ఉన్న ఆరుగురికీ తోడుగా పాదచార స్వచ్ఛ కార్యకర్తలు నలుగురు వెళ్లి, పరామర్శించారు.          

            7.00 సమయంలో గస్తీగదికి తిరిగి వచ్చిన కార్యకర్తలు శంకర శాస్త్రీయ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలతో ఏకీభవించి, నేటి తమ కర్తవ్యాన్ని విజయవంతంగా పాలించారు!

            రేపటి వేకువ మనమందరం బెజవాడ రోడ్డులోని చండ్ర వికాస కేంద్ర ప్రాంతం యొక్క అహ్వానాన్ని అందుకొందాం!

       ఈ స్వచ్చ - సుందరోద్యమం

సామాజిక విధిప్రక్రియ జరిగే సక్సెస్ మంత్రం

స్వార్ధం వాసన సోకని స్వప్నాలకు ఋజుమార్గం

శ్రమజీవన సౌందర్యం సాధించే ప్రయత్నం

సదాలోచనా పరులకు సత్వర ఆచరణీయం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   21.02.2023.