2689* వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

32 మంది కార్యకర్తల రెడ్ శాల్యూట్’ - @2689*

ఎక్కడంటే - బెజవాడ బాటలోని చండ్ర వికాస కేంద్రం దగ్గర;

ఎప్పుడంటే బుధవారం వేకువనే - మరీ 4.19 కే;

అరుణ వందనంమాత్రం 6.35 కు!

వివరాల్లోకి వెళితే:

- ముందుగా బెజవాడ దారి బాధ్యతలు - ఊడుపూ, దారికి తూర్పు పడమరల మార్జిన్ల గలీజును అంటే నిరుపయోగ, అనాకారి మొక్కల్నీ, గడ్డినీ, ప్లాస్టిక్ ఛండాలాన్ని నరుక్కుంటూ, ఏరుకొంటూ, చెక్కుకొంటూ, ఎగుడు దిగుడుల్ని సరిదిద్దుకొంటూ - ఏళ్ల తరబడీ అలవాటైన రహదారి శుభ్ర - సుందరీకరణ కోసం 16 మంది,

- తమ ప్రత్యేకతను ప్రదర్శిస్తూ - అది మురుగుకాలువైనా, తామే నాటి పెంచిన చెట్లైనా, రోడ్లు గతుకులైనా, టీ - టిఫిన్ దుకాణాల వ్యర్ధాలైనా క్షుణ్ణంగా మెరుగులు దిద్దే నలుగురైదుగురు సుందరీకర్తలూ;

- విద్యుత్ ఉపకేంద్రం దగ్గరున్న దుమ్మూ - ధూళీ, మరెన్నో వ్యర్థాలనూ, పెట్రోలు బంకు మొదలు టీ దుకాణాల దాకా గంటన్నర పాటు విసుగు చెందని విక్రమార్కుల్లాగా ఊడ్చిన ముగ్గురు వాలంటీర్లూ;

- రహదారి కాలుష్యం పని పట్టాక - కోమలానగర్ తొలి వీధిలో - అనగా మిల్లు ప్రక్క వీధి చివరి కంటా కశ్మలాల మీద వీర విహారం చేసిన మొదటి షోడశ సంఖ్యాకులూ;

- గంటన్నర పైగా శ్రమదానంతో పుట్టు కొచ్చిన వ్యర్థ భీభత్సాలను ట్రక్కులోకి ఎగుమతి చేసి, చెత్తకేంద్రానికి చేర్చిన నలుగురు పనిమంతులూ;

- పని విరమణ విజిల్ మ్రోగాక 6.16 దాకా వికాస కేంద్రం ఎదుట డ్రైనును బాగుచేస్తున్న ముగ్గుర్నలుగురు రైతులూ......

నేటి శ్రమదానంలో ఇవి కొన్ని ముఖ్య ఘట్టాలు!

            కాఫీ సేవనం పిదప - సమీక్షా సభకు ముందు ఒక వీరసింహుడి సందడి! అతని మనుమడు – కొర్రపాటి అభినవ్ అష్టమ జన్మదినోత్సవాన్ని ఇందరు శ్రమదాతలు ఆశీస్సులతో రోడ్డుపైన జరపడమొక ప్రత్యేకత! ఈ విశ్రాంత పంచాయతీ చిరుద్యోగి యధాశక్తిగా సోదర కార్యకర్తలకు మిఠాయిలు తినిపించి, ఎర్ర టీ షర్టులు తొడిగించి, స్వచ్ఛ సుందరోద్యమానికి అర్థవెయ్యిన్నూట పదార్లు సమర్పించి, టాంజానియాలో ఉన్న జన్మదిన బాలకుడిని కార్యకర్తలభినందించి......

            అలా ముగిసెను - 2689* వ నాటి గ్రామ స్వచ్ఛ సుందరీకరణ బాధ్యతలు!

            గురువారం నాటి వేకువ సమయ శ్రమదాన నిమిత్తం మనం మరొకమారు చండ్ర వికాస కేంద్రం ముంగిటనే కలిసి, శ్రమించవలెనని మనవి!

        శ్రమదానం చూడ రండు

స్వచ్ఛ - శుభ్ర స్వప్నాలను - సామాజిక బాధ్యతలను

కలలు నిజం చేయగలుగు కర్మిష్టుల కదలికలను

చూడాలనిపిస్తుంటే - స్వచ్ఛ చల్లపల్లిలోన

ప్రతి వేకువ విధిగా జరిగే శ్రమదానం చూడ రండు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   22.02.2023.