2690* వ రోజు........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

ఊరికి నేటి సముచిత శ్రమ సమర్పకులు 37 మంది @2690*

            వారిలో మూడో వంతు మందైతే మరీ విడ్డూరం - నిర్ణీత సమయం వేకువ 4.30 ఐతే వాళ్ళు చండ్ర కేంద్రం దగ్గర 415 కే హాజరు! గురువారం (23.2.23) బ్రహ్మముహూర్తమప్పటి సంగతిది. నలుగురైదుగురు తప్ప మిగిలిన వారూ నిముషాల ఎడంతో వచ్చి చీపురో, దంతో, కొడవలో, డిప్పో పుచ్చుకొని - కోమలానగర్ రెండో వీధిలోనూ, బెజవాడ దారిలోనూ శ్రమదానానికి దిగారంటే

            అది స్వచ్చ సుందర చల్లపల్లి ప్రత్యేకత! లక్షలాది పంచాయతీల్లో ఆ వూరికే పట్టిన అదృష్టం! ఈ 30 + మంది బాధ్యుల్లో చల్లపల్లి వారందరిలో - ముఖ్యంగా కోమలానగర్ స్థానికులు కేవలం ముగ్గురు! రామానగరం, శివరాంపురం, మోపిదేవిల నుండి పాల్గొన్న వారే మిక్కుటం! ఎక్కడో 150 కిలోమీటర్ల దూరపు లింగారావు పాలేనికి చెందిన కుర్ర డాక్టరమ్మ - గుంటుపల్లి దివ్యతేజ కూడ!

            అసలిలాంటి వాళ్లంతా సజాతీయ పక్షులు ! ఎక్కడ సమాజానికి కాస్త మంచి జరుగుందని తెలిస్తే చాలు - ఎగిరొచ్చి శ్రమదానానికి పాల్పడే పరోపకార పారీణ పక్షులన్న మాట! ఇది ఈ 21 వ శతాబ్దంలో - ముఖ్యంగా బరితెగించి చెడిపోతున్న ఆంధ్ర సమాజంలో - చల్లపల్లిలో మాత్రమే కనిపించే సన్నివేశం!

            లేకపోతే - ఇందరు వర్తమాన, విశ్రాంత ఉద్యోగులు, రైతులు, సంపన్నులు, సామాన్యులు, గృహిణులు, వృత్తి నిపుణులు, ప్రవృత్తి చోదితులు ఈ చలిలో, మంచులో- ఒక ప్రక్క రోజుకు 1000/- ఇచ్చినా సరే ఎవ్వరూ ఇష్టపడని మురుగు - పారిశుద్ధ్య పనులకు 2690* రోజులుగా ఎందుకు పాల్పడాలి? చల్లపల్లిలో తప్ప ఇంత సుదీర్ఘకాల సామూహిక శ్రమదానం ఇంకెక్కడైనా జరుగుతున్నదా? ఇది చల్లపల్లికి పట్టిన అదృష్టమా ? కార్యకర్తలు దక్కించుకొంటున్న అవకాశమా?

            ఇక్కడికి చుట్టం చూపుగా వచ్చిన అల్లుళ్ళు శ్రమదానంలో సెటిలవుతారు; బెజవాడలోనో అహ్మదాబాద్ లోనో ఉండవలసిన వయో వృద్ధ విశ్రాంత ఉద్యోగి - అయిన వాళ్లకు దూరంగా వచ్చి, ఈ గ్రామం మేలు కోసం తపించి పోతుంటాడు; అమెరికా, లండన్, NRI లు ఈ ఊరి స్వస్తతా ప్రయత్నాలకు ఆర్థిక సాయం పంపుతుంటారు! ఇదంతా ఏమిటి? ఎందుకిందరికింత అంకిత భావం? మరి, స్థానికుల్లో కొందరి కెందుకింత తూష్ణీం భావం?

            ఏ 3.30 కో మేల్కోని, 4.15 నుండి 2 గంటలు శ్రమించిన 30 కి పైగా గ్రామ బాధ్యులు ఊరకుంటారా? బెజవాడ రహదారిలో కొందరు, కోమలానగర్ రెండో వీధి బారునా మరికొందరు ఒడలు వంచి కష్టంచి, అనుకున్నది సాధించారు.

            రైస్ మిల్లర్స్ భవనం వైపున 50 గజాల రహదారి సుందరీకరణ బాధ్యతను నలుగురైదుగురు బ్యూటిఫికేషన్ బ్యాచి నిర్వహించింది. 2 వ లైను మొదట వాళ్లు సాధించిన సౌందర్య సంపూర్ణతను ఎవరు చూసినా అభినందిస్తారు!

            20 మంది నికరంగా శ్రమించిన 2 వ లైనులో దారి ప్రక్క ఖాళీస్తలాల్లో పెరిగిన తుప్పలు, అల్లుకొన్న తీగలు, అప్పనంగా వచ్చిపడిన ప్లాస్టిక్ వస్తువులు తప్ప, సిమెంటు రోడ్డు కాస్త శుభ్రంగా ఉన్నట్లే! గంటన్నరపాటు కార్యకర్తలు శ్రమిస్తున్నా 2 - 3 ఇళ్ల వారు తమ ఆవరణలోనే నేత్రపర్వంగా చూడడం తప్ప అయ్యో! ఇది మన ఇంటి ఎదురు బజారే వేళ్లకపోతే బాగుండదే.అనే మోహమాటం పెట్టుకోలేదు!

            6.30 కు గ్రామ స్వచ్ఛ సౌభాగ్య నినాదాలు పలికింది రెండు వారాలుగా స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొంటున్న డాక్టర్ దివ్య తేజ. పిదప కార్యకర్తలకు తన వీడ్కోలు అల్పాహార విందునిచ్చినదీ ఆమే!

 

            రోజూ వారీగా జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యంవాట్సప్ వివరణలూ,వ్యాఖ్యానాలూ చదివి రేపటి శ్రమదానానికి క్రొత్తగా ఎవరైనా వచ్చి పాల్గొంటే ధన్యులం!

            మన రేపటి శ్రమదాన కేంద్ర కూడ వికాస కేంద్ర కోమలానగర్ లే!

     కొలమానం ఏమున్నది

కొలమానం ఏమున్నది వేకువ శ్రమదానం ఘనతకు?

అనుభవైక వేద్యమైన ఆ సామూహిక ఘటనకు!

అవసరార్థమది తిరిగిన అన్ని వింత మలుపులకు

ఏ సినిమా సీన్ల కన్న ఏ మాత్రం తగ్గవు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   23.02.2023.