2691* వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

శుక్రవారం – (24-2-23) శ్రమ సమర్పకులు 24+2 మంది - @2691*

శ్రమ గ్రహీతలు

1) బెజవాడ బాట,

2) కోమలానగర్ లో 1 ½  వీధులు,

3) ఇంకొన్ని కొసరులూ!

            సమయం 4.24 నుండి 6.15 దాక! నేను గమనించినంత వరకూ స్థానిక కార్యకర్తలు ఇద్దరే!

            ఊరి వార్డులేమో ఒక లెక్క ప్రకారం 20, గడపలేమో 5000/- దాక! వార్డు కిద్దరు శ్రమదానంలోకి వచ్చినా, పొరుగూళ్లు కార్యకర్తలతో కలిసి 50 మంది ఔతారు. ఒక్కో వార్డును 2 రోజుల చొప్పున బాగుచేసినా, ఎంత సందడి - ఎంత జాగృతి - అసలదెంత అభ్యుదయకర సంస్కృతి! ఇది చల్లపల్లి కనుక ఇలాంటి ఊహాత్మక స్వప్నాలు - ఇతర గ్రామాలకవి వర్తించవు!

            ఒక న్యూజిలాండో - స్విట్జర్లాండో- అమెరికా పడమటి అంచున ఇర్వైన్పట్టణమో ఆఖరికి ఇండియాలోని ఇండోర్ నగరమో, అంతగా చూపు త్రిప్పుకోనంత సుందరంగా ఎలా నిలుస్తున్నాయి? ప్రతి పౌరుడిలో ఎంత అవగాహన - ఎంత స్ఫూర్తీ ఉండి ఉండాలి? మరి చల్లపల్లికేం తక్కువని? జనంలో శుభ్ర - సౌందర్య స్పృహ పెరిగితే పౌర బాధ్యతలు పెంపొందితే మన ఊరు దేశమందలి  6 లక్షల గ్రామాల్లో తలమానికం కావడమెంతసేపు?

            కలలు కనండహో!అని వేరే సందర్భంలో యువతకు పదే పదే ప్రబోధించింది మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మహాశయుడు! సదరు కలలు కేవలం వ్యక్తిగతం కాక - సమాజం గురించి కూడాఅనేది చల్లపల్లి స్వచ్చ - సుందరోద్యమకారుల ఆశ!

            ఈ ఉదయం బెజవాడ దారిలో మరొక 50 గజాల భాగాన్ని తీర్చిదిద్దినది అలా గ్రామ సౌభాగ్యాన్ని కలగనే కేవలం ముగ్గురే! మచ్చుకు వాళ్ల పనితనం చూడాలనుంటే - మన వాట్సప్ మాధ్యమ చిత్రంలో 3 వ వీధి తిలకించండి.

            18 - 20 మంది కార్యకర్తల మూకుమ్మడి శ్రమదానంతో గాని కోమలానగర్ 3 వ లైనూ, మధ్యలో అడ్డ రోడ్డూ బాగుపడలేదు. ఆ వీధిలో నాలుగైదు ఖాళీ స్థలాలు పాక్షికంగానైనా సరే కాస్త శుభ్రంగా, అందంగా మారడానికి కారణమూ గంటన్నరకు పైగా కార్యకర్తల శ్రమే!

            2 వీధుల పిచ్చి కంపలూ, ప్లాస్టిక్ తుక్కులూ, పచ్చి ఎండు వ్యర్ధాలూ విజయవాడ దారిలో ప్రోగుబడిన చెత్త గుట్టలూ ట్రాక్టర్లో కెక్కి, చెత్త కేంద్రానికి చేరినదీ మానవ శ్రమతోనే!

            6.35కు కార్యకర్తలంతా విజయా కాన్వెంటు ముఖద్వారం ఎదుట క్రమపద్ధతిలో నిలిచి, తాతినేని రమణ గారు ముమ్మారు నినదించిన గ్రామ స్వచ్ఛ - సుందరాశయాన్ని ముక్తకంఠాలతో ప్రతిధ్వనించి, రేపటి వేకువ ప్రణాళికను రచించి, ఇళ్లకేగారు!

            బెజవాడ మార్గంలోని విజయా కాన్వెంట్ దగ్గరే మన రేపటి వేకువ కలయిక!

            ఇదేం ఖర్మ గ్రామానికి?

ప్రతి వేకువ వీధుల్లో శ్రమదానం జరుగుతోంది-

సందడిగా ఊరంతా చెత్త బండి తిరుగుతోంది-

మనకోసం మనంట్రస్టు ఘన సేవా అందుతోంది-

ఇంకెప్పుడు పూర్తి మార్పు? ఇదేం ఖర్మ గ్రామానికి?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   24.02.2023.