2692* వ రోజు.... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

నేటి పారిశుద్ధ్యకర్తలు 34 మంది, కర్మలు 1+1+ ½  రోడ్లూ! @2692*

            కార్యకర్తల బృందంలో తొలి సగం మంది వేకువ (శనివారం 25.2.23) 4.22 కూ, మలి బాధ్యులు నిముషాల క్రమంలోనూ వచ్చి కలిసింది విజయవాడ బాటలోని విజయా కాన్వెంట్ ఎదుట; చేతొడుగులూ- తల దీపాలూ-యుద్ధ పరికరాలూ ధరించి, వీధి కాలుష్యాల మీద దండయాత్రకు పోయింది కోమలానగర్ 4, 5 వీదుల్లోనికి2 గంటల జైత్రయాత్రానంతరం సభ ముగించింది కాటాల ఎదుట !

            ఇంకొక యుద్ధ భూమి ప్రభుత్వాసుపత్రి, బెజవాడ బాటల కూడలి.  అచ్చటి అస్తవ్యస్త పారిశుద్ధ్య సాధకులో - వీధి సౌందర్యశిల్పులో గాని వాళ్లు ఐదుగురు! గుంటలు కనపడితే-రోడ్డు మార్జిన్ల సమతలం లోపిస్తే పాపం వీళ్లకు రాత్రికి నిద్ర కరువే! అందుకని - ముఖ్యమైన రోడ్ల కూడలిని గంట సమయంలో ఎలా మార్చారో, ఫలితంగా వాళ్ల ముఖ సంతృప్తేమిటో ఒక ఫొటోలో కనిపెట్టండి! ఇందుకు గాను- దూరం నుండి 20 -30 డిప్పల రాళ్లూ, మట్టి మోసి, సర్దాల్సొచ్చింది!

            పాతిక మంది వీధి బాధ్యులదింకొక కథ!  బాట అపరిశుభ్రత మీద వీధి బారునా ఉన్న నాలుగైదు ఖాళీ నివేశన స్థలాల రోడ్డు వార చిట్టడవుల మీద, 4వ లైనులో మొదలెట్టిన పోరాటం 6.15 వేళకి కాలనీ ముఖ్య వీధి గుండా, మళ్లీ 5 వ వీధిలోకి మళ్లి, దానిలో సగం దాక చేరింది. అందుకు వాళ్ళు కత్తులే వాడారో, దంతెల్తో లాగారో, చీపుళ్ల సహాయమే తీసుకొన్నారో - వంచిన నడుము లెత్తారో అవి వేరే విషయాలు?

            కాకపోతే 2 గంటల యుద్ధ సమయంలో మంచి నీళ్లు త్రాగడమూ, ఛలోక్తులు వదలడమూ, ఇద్దరు ఛాయాచిత్ర గ్రాహకులు తమకు నచ్చిన పోరాట దృశ్యాలను ఫోను కెమేరాలో బంధించడమూ వగైరా ఉంటాయనుకోండి!

2 ½ వీధుల రణక్షేత్రంలో

1) ఊడ్చిన చెత్తా, ఏరిన ప్లాస్టిక్ వస్తువులూ,

2) పిచ్చి, ముళ్ల - మొక్కలూ, తీగలూ వంటి వ్యర్ధాల లోడింగు కూడ సమాంతరంగా జరిగిపోయింది.

            నిన్న - మొన్నటిలా కాక ఈ వేకువకాలాన కోమలా నగర్ నుండి నలుగురో ఐదుగురో శ్రమ సహకార మందించారు - ముఖ్యంగా 4 వ లైనులో కాస్త పెద్దామె ఎవరిల్లు వాళ్లూడ్చుకోవడమే కష్టమౌతున్న రోజుల్లో - ఇంత ఊరి బాగోగుల్ని పట్టించుకొంటున్న కార్యకర్తల్ని మెచ్చుకోవడంఒక విశేషం!

            గ్రామ స్వచ్చ - సుందరోద్యమ సంచాలకుని పరిశీలన ప్రకారం - ఈ ఊరి కొన్ని వీధుల్లో చెత్తా - చెదారం చిమ్మడం తగ్గింది - ముఖ్యంగా కోమలానగర్ రోడ్ల మీద! ఊళ్లో క్రమం తప్పని చెత్త బండి విహారమే అందుకు కారణం కావచ్చు!

            ఈ నాటి చల్లపల్లి మెరుగుదల నినాదాలను గట్టిగా ముమ్మారు వినిపించినదీ అందరిచే అనిపించినదీ - ఉపాధ్యాయిని శ్రీమతి కోట పద్మావతి!

            అందరి ఏకగ్రీవ నిర్ణయం రేపు కూడ మనం విజయా విద్యా సంస్థ దగ్గరే కలుసుకోవాలని!

            ఏదైనా చేదైనా

దృఢ నిర్ణయ మయ్యాక దీటుగ చేయక తీరదు

ఏదైనా ఊరి కొరకు చేదైనా అది తప్పదు

స్వార్ధానికి కానందున సంశయమసలుండబోదు

స్వచ్చోద్యమ చల్లపల్లి చరితార్ధం కాకపోదు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   25.02.2023.