2693* వ రోజు........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

             శ్రామికులు 35మంది, స్థలాలు 4, సమయం 2 గంటలు - @2693*

          ఈ లెక్కలు, కొలతలూ ఆదివారం (26.02.2023) నాటివి. 13 మందితో 4.20 A.M తో మొదలై, క్రమంగా ఆ సంఖ్య 35కు చేరి, 6.20 తో పారిశుద్ధ్య కృషీ, 6.50 దాక కాఫీల – కబుర్ల –సమీక్షల – గానాలతో అంతమైన స్వచ్చ కార్యకర్తల పారిశుద్ధ్య ప్రయత్నము లిట్లుండెను!

1)కోమలా నగర వీధుల లోనికి ఎక్కువగా వారు చొరబడలేదు గాని, ముఖ్య రహదారి ప్రక్కనే, కాస్త చాటు మాటున గల ఖాళీ స్తలమూ,

2) చండ్ర వికాస కేంద్ర మెదురుగా తడి ఆరిన మురుగు కాలువా,

3) మరి కాస్త ప్రభుత్వాసుపత్రి బాట ప్రక్క డ్రైనూ,

4) విజయా కాన్వెంటు వైపు వీధి మార్జినూ,

5) కోమలా నగర 6 వ వీధి ప్రారంభానా

          ఎవరి శక్తి మేరకు – ప్రణాళికను బట్టి- అవసరాన్నీ గమనించుకొనుచూ  వారు గ్రామ స్వచ్చ – సుందరీకరణ కోసం శ్రమించిరి.

          “ ఇది ఆదివారమైననూ పని వేళ పొడిగించనందున ఒకటి రెండు ఆలోచనలు అమలు కాలేదు అను అసంతృప్తి కొందరు కార్యకర్తలలో కనుపించెను!

          సంవత్సరాల తరబడీ లక్షల పని గంటల సమయమునూ, శక్తి యుక్తులనూ, కొండొకచో కష్టార్జితమునూ, తమ ఊరికి సమర్పించుచున్న నేటి శ్రమదాతలను సవివరంగా – వ్యక్తి పరంగా పేర్కొను అవకాశము లేనందున క్లుప్తముగానైన, గుర్తున్న వరకూ వ్రాసెదను.

          - వికాస కేంద్రము ప్రహరీ బారునా మురుగు కాల్వలో మురుగు నీరులేదు గాని, రకరకాల గడ్డీ ముళ్ళ-పిచ్చి మొక్కలూ, దురదగొండి వంటి చిరాకు పరచు తీగలూ వేకువ సమయాన ఈ 15 మంది కార్యకర్తలు గాక, ఏ వూరి యందు ఏ కార్మికులిట్లు తొలగించగలరు?

- ఆ కాలువ గట్ల మీద పూల మొక్కల పాదులకలుపు తీయుట, కసవు నూడ్చుట, పాదుల్ని సరిజేయుట మాత్రం చిన్న పనులా?

- లారీల మాటున రోడ్డు మీదకు కనిపించలేదుగాని, అచ్చటి గాజు, ప్లాస్టిక్ సీసాలే పెద్ద గోనె సంచి నిండుగా వచ్చినవి గదా! అసలా కాస్తంత ఖాళీ ప్రదేశము 10 మంది శ్రమ వీరుల కన్ను పడక ముందెట్లుండెనో – ½ గంట కృషి పిదప ఎంత శుభ్ర-సుందరముగా మారెనో – మన వాట్సాప్ చిత్రాలలో చూసే వారికీ, విడిగా కూర్చొని వ్రాసే వారికీ పూర్తిగా తెలియునా?

- బెజవాడ – కోమలా నగర 6 వ వీధుల కూడిక ఎగుడుదిగుడు గాను అసౌకర్యముగాను కన్పించగా – ముగ్గుర్నలుగురు ఎంతగా శ్రమించి, శుభ్ర- సుందరముగా రూపొందించారో గమనించుడు!

- గూళ్లు నొప్పి లెక్క చేయక గంటన్నర పాటు రోడ్ల దుమ్మునూ, చెత్తా చెదారములనూ ఊడ్చిన మహిళలది శ్రమ – సమయ త్యాగమో లేక కొరగాని పిచ్చి పనో ఆలోచించుడు!

-రోడ్లు మార్జిన్ల లో నాలుగైదు దుకాణాల నేర్పరచుకొని ప్రయాణిక ప్రజలకు అసౌకర్య కారకులగు వారు స్వచ్చ కార్యకర్తలకెందుకు సహకరించరని నన్ను కాక – వారినే ప్రశ్నింపుడు!

          6.30 నుండి పాఠశాల ద్వారముముందు కొలువు తీరిన సమీక్షా సభలో:

          1) కుక్కల పెంపకం దారుల గురించి కాంపౌండర్ శేషు పాటనూ -

          2) జాగ్రత్తగా విని – ఆలోచించదగిన “ శ్రమదాన యజ్ఞ “ గేయమునూ వాట్సాప్ చిత్రమందు ఎవరైననూ వినదగును!  

          3) మెహెర్ అనుమాయులు నిన్న అశేష ప్రజలకు చేసిన అన్నదానము హరిత విందుగా జరిగినందుకు నిర్వాహకులకు కార్యకర్తల పునః పునరభినందనము కూడ ప్రస్తావనార్హము!

          బుధవారం వేకువ మన పరిశుభ్ర – సుందరీకరణ బాధ్యతలు విజయవాడ మార్గమందలి ఉభయ పాఠశాలల ఎదుటనే ఉండును.    

           పచ్చినిజం

చల్లపల్లి స్వచ్చంద శ్రమదానం ఒక యజ్ఞం

ఊరు దానివల్ల చాల మారడమొక పచ్చినిజం

ఆటంకాలేవేవో అప్పుడపుడు వస్తున్నా

ఆ ప్రవాహ మెన్నడాగ నందులకే ధన్యులం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   26.02.2023.