2694* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

2694* నాటి శ్రమదానం కూడ పెదకళ్లేపల్లి బాటలోనే!

          సోమవారం (27.2.23) వేకువ 4.30 కి గస్తీగది దగ్గర ఆరుగురూ, శివరాంపురం దగ్గర కత్తుల సాన పాక దగ్గర ఇద్దరూ - రెస్క్యూ టీం అనే పేరిట - 6.30 దాక ప్రయత్నించిన వీధి పారిశుద్ధ్య ప్రక్రియలో విశేషాలేమంటే :

- ఈ ముఠా బలం కాస్త పెరగడానికి కారణం - పద్మావతి ఆస్పత్రి లాబ్ ఉద్యోగి ఒకాయనా, శివరాంపురపు మాటకారి ఇంకొకాయనా పాల్గొనడమే!

- ఈ ఫిభ్రవరి మాసమంతా - శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ పెదకళ్లేపల్లి మార్గాన్ని – 2 కిలోమీటర్ల బారునా స్వచ్ఛ - శుభ్ర – హరిత - సుందరంగా మార్చినా - 10 రోజులైనా గడవకుండా రెస్క్యూ టీం అవసరం పడడం మరొక విశేషం!

- ఈ రహదారి వినియోగదారుల మాదక ద్రవం వాడకం వంద పూవులు - ఆరొందల కాయలుగా వర్ధిల్లి, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకు కలిసొస్తున్నదనడానికి నిదర్శనం – ఈ వేకువ స్వచ్ఛ కార్యకర్తలు ఏరిన గాజు సీసాలు పది సంచులు నిండడమే!

- వాటిని అక్వా పరిశ్రమ ప్రక్కనున్న ప్రభుత్వ సారా దురాణం దగ్గరకే చేర్చారు.

- ఇది గాక కాస్త ఎండిన ప్రాత - కొత్త కొమ్మ - రెమ్మలూ, గడ్డీ వగైరాల్ని ప్రోగులు చేసి, చెత్త కేంద్రానికి తరలించడమూ,

          6.30 కు మళ్లీ గస్తీ గది వద్దకు చేరుకొని, బాల దుర్గా రాం ప్రసాదుని స్వచ్ఛ సుందరోద్యమ స్ఫూర్తిదాయక నినాదాల్ని మిగిలిన వాళ్ళంది పుచ్చుకోవడమూ నేటి కార్యక్రమ విశేషాలు!

      అంటీ - ముట్టకుండడం?

ఔనన్నా - కాదన్నా అగ్ని వంటిదే సత్యం

అలాంటిదే చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదానం

ఏవో లోపాలున్నా ఎందుకు దాన్నాపడం?

ఆ వంకతొ ప్రజలెందుకు అంటీ - ముట్టకుండడం?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

  27.02.2023.