2695* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

మంగళవారం నాటి రహదారి శ్రమదానం - @2695*

          పిబ్రవరి మాసాంత దినం కూడ ఇంచుమించుగా ఆ కార్యకర్తలే - శివరామపురం కొత్తూరు దిశగా ఆ రహదారే దారిన పోతూ చూస్తున్నవాళ్లూ, చేస్తున్నవాళ్లూ అవే దృశ్యాలు!

          జై స్వచ్చ చల్లపల్లి సైన్యంసామాజిక మాధ్యమంలో మీరెవరైనా తిలకిస్తే పరిశీలిస్తే రెండు మూడు ముఖ్య సన్నివేశాలు ఆకర్షిస్తాయి!

- విసుగూ విరామం లేక వేలాది రోజులుగా ఊరికి సంబంధించిన 7 బాహ్య రహదార్లలోనో, గ్రామ ముఖ్య వీధుల్లోనో, అవసరమైనప్పుడు శ్మశానాల దగ్గరో, మేటవేసి కదలక మొరాయిస్తే మురుగు కాల్వల్లోనో, గుంటలు పడి వాహనదారుల ప్రమాద స్థితిలో రోడ్ల మీదనో, స్వచ్ఛ సుందర కార్యకర్తలు శ్రమిస్తూనే ఉంటారు!

- అది వానో - ఎండో మంచో - వేళ కాని వేళో వాళ్లు పట్టించుకోరు! ఈ రోజు మన ఊర్లో ఏదొక లోపాన్ని సరిదిద్ది, చాతనైనంత మెరుగుపరిచామా లేదాఅనేదే వాళ్ల వైఖరి!

- ఈ వేకువ 4.30 & 6.30 నడుమ మేకలడొంక - కత్తుల సాన కొలిమి నడుమ రెస్క్యూ టీం చేష్టలు కూడ అంతే - నిన్నటంతగా లేవు గాని - మద్యం, నీళ్ల సీసాలూ, ఒక ట్రక్కు నిండా రకరాల చెత్తలూ,.....

- ఎందుకో గాని ఈ ఉదయం వాళ్లు స్వచ్ఛ కార్యకర్తల చొక్కాలుబదులు వీరసింహుడు బహూకరించిన ఎర్ర చొక్కాలు ధరించి, ప్రాతకాలపు కమ్యూనిస్టు కార్యకర్తల అవతారమెత్తారు!

          6.30 దాటాక ఒక మహా ముదురు కార్యకర్త - తూములూరి లక్ష్మణరావు ననుసరించి, గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలు పలికి, నేటి కర్తవ్యాన్ని ముగించారు!

          జిల్లా పరిషదున్నత పాఠశాల - కోమలానగర్ లో మిగిలిన రెండు వీధుల సుందరీకరణం కోసం రేపటి వేకువ కలయిక విజయవాడ బాటలోనే!

          సమగ్రమా - సశేషమా!

దినదిన గండంగానా ప్రతిక్షణానందంగానా

బాహ్య ప్రేరణగానా - అంతరంగ ప్రబోధమా

ఆదర్శం చెప్పడమా - ఆచరించి చూపడమా

స్వచ్ఛ కార్యకర్త సేవ సమగ్రమా - సశేషమా!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   28.02.2023.