2696* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

బెజవాడ రోడ్డుకు మారిన శ్రమదానం - @2696*

            మార్చి ప్రథమ దినాన (బుధవారం) పాతిక మంది స్వచ్ఛ - సుందర కార్యకర్తల శ్రమ మూలంగా బాగుపడినవి మూడు చోటులు:

1) విజయా కాన్వెంట్ ప్రహరీ ఎదుట వేగ నిరోధకాల దగ్గరి 3 పెద్ద గుంటలూ, 3 చిన్నగుంటలూ,

2) కోమలానగర్ 6 వ వీధీ,

3) ప్రభుత్వాసుపత్రి వీధిలో కొలువు తీరిన పాతిక పూల మొక్కలూ,

            ఇవాళ వేకువ 4.186.20 నడుమ కార్యకర్తల ఉత్సాహానికేలోటూ లేదు! ఐతే పని చోటుకు వాళ్ల చేరికకు ముందే దట్టమైన మంచు నిర్దాక్షిణ్యంగా విరుచుకు పడింది. ఆ హిమపాతంలోనే దారి తడుముకుంటూ సైకిళ్లో, ఇతర ద్విచక్ర వాహనాలో నడుపుకుంటూ 2 - 3 కిలోమీటర్లు ప్రయాణించి నాల్గుంబావుకే 10 మంది ప్రత్యక్షమయ్యారు.

            నేటి వేకువ నేను చూసిన తొలి శ్రమదాన ఘట్టం బెజవాడ బాటలో గుంటల పూడిక! అప్పటికొక సుందరీకర్త ఇద్దరు మహిళా మణులతో రాళ్ల డిప్పలు మోయించి, గుంటల అడుగున సర్దుతున్నాడు. చట్టుగా గట్టిపడ్డ ఇసుక - సిమెంటు మిశ్రాన్ని పారల్తో త్రవ్వి, గుంటలెంత బాగా పూడ్చారంటే - వాహనాలు నిశ్చింతగా 3 - 4 నెలల పాటు తిరగొచ్చన్న మాట!

            కోమలానగర 6 వ వీధిలోనే 20 మంది పారిశుద్ధ్య ప్రయత్నం విజయవంతమయింది! వట్టి శ్రమ సమయ త్యాగాలతోనే ఈ వీధి ఇంతగా మెరుగుపడలేదు - ఒక అవగాహన, ఒక సమన్వయం, ఒక క్రమశిక్షణ ఆ విజయం వెనక ఉన్నవి మరి! వీధి బారునా దుమ్ము ఊడ్చినా - ఖాళీ స్థలాల పనికిరాని మొక్కల్ని తొలగించినా - ప్లాస్టిక్ తుక్కుల్ని ప్రోగు చేసినా - కడాన ప్రోగులన్నిటినీ చకచకా ట్రాక్టర్లో నింపినా - ఏ పనీ గ్రుడ్డిగా జరగలేదు.

            “అరె! ఇళ్లేమో అందంగా ఉన్నాయి - వాటి ముందూ, ప్రక్కనా ఇంత అపరిశుభ్రతలేమిటి?” అని కార్యకర్తలు విసుక్కోలేదు. గంటన్నరకు పైగా ఆ వీధినలా ఓపికగా సుందరీకరిస్తూనే ముందుకు సాగారు. బట్టలూ, తలలూ మంచుకు తడవడమూ దుమ్ము కొట్టుకోవడమూ వాళ్లకి క్రొత్త కాదు. ఆ వీధి తామనుకొన్నట్లు శుభ్రపడిందా లేదా అనేదే వాళ్లకు ముఖ్యం!

            ఇక మూడవ శ్రమ వేడుక - హరిత సుందరీకరణ ఘట్టం. అది చండ్ర వికాస కేంద్రం సర్వజనాస్పత్రి మధ్యగా డ్రైనేజి గట్టు! పాతిక గద్ద గోరు పూలమొక్కలు నాటి, నీరు పోసి, సంతృప్తిగా తిరిగి వచ్చేందుకు పావుగంట శ్రమదానం!

విజయా విద్యా సంస్థ ముంగిట జరిగిన సమీక్షా సభలో:

- తదుపరి ఆదివారం నాటి 2700 వ పని దినం నిర్వహణ గురించి, కొంత చర్చ నడిచింది.

- అంతకు కాస్త ముందు - కాఫీల సమయంలోనే ఉదయశంకర శాస్త్రుల వారి బిస్కట్ల పంపకం చోటు చేసుకున్నది. సందర్భమేమిటో నాకు తెలవదు! (ఏదో ఒక సందర్భాన్ని అతడు సృష్టించుకోగలడు!)

- పునర్నిర్మాణంలో ఉన్న గాంధీ స్మృతి వనమూ, నిర్మాణం పూర్తి కావచ్చిన బందరు వీధిలోని స్వచ్చ -  సుందర పబ్లిక్ టాయిలెట్లూ ప్రస్తావనకొచ్చాయి!

- స్వచ్చోద్యమ అనుభవజ్ఞుడు - భోగాది వాసు విస్పష్టంగా పలికిన నినాదాలతో నేటిశ్రమ వేడుకకు ముగింపు.

            రేపటి గ్రామ వీధి బాధ్యతల కోసం వేకువనే మనం కలుసుకోదగిన చోటు ప్రభుత్వోన్నత పాఠశాల (బెజవాడ రోడ్డు) దగ్గరే!

            చల్లపల్లి హొయలు

వంక బెట్ట వలసినదా స్వచ్చోద్యమ చల్లపల్లి?

శంకించుట వివేకమా శ్రమ సంస్కృతి ప్రభావాన్ని?

చిత్త శుద్ధి లేకుంటే జరిగేదా ఇది తొమ్మిదేళ్లు?

కార్యకర్త శ్రమ ఫలితం కాద చల్లపల్లి హొయలు?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   01.03.2023.