2697* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

గాంధీ స్మృతి వనం కేంద్రంగా 2697* వ నాటి బాధ్యతలు!

            గురువారం (2-3-23) వేకువ 4.20 కే సదరు పవిత్ర కర్తవ్యానికి దిగినది డజనుకు పైగా కార్యకర్తలు; క్రమంగా వచ్చి చేరి కష్టించినది 15 మంది; ఈ 27 మంది దెబ్బకు తోక ముడిచిన వీధి కాలుష్యాలు కనీసం 3 చోటులకు చెందినవి; పని ముగిసింది 6.16 కు; ఈ సత్కర్మలకు సాక్ష్యం మౌనముద్రాంకిత జాతిపిత!

            ఊరంతటి స్వస్తతలోనూ, సంక్షేమంలోనే తమ సంతోషం వెతుక్కోదలచుకొన్న స్వచ్ఛ కార్మికుల నేటి పని విధానమిలా ఉంది

1) విజయా కాన్వెంటు, ప్రభుత్వ పాఠశాల, సచివాలయాల బారునా 17 - 18 మంది శ్రమించినది ఎండిన 3 - 4 అడుగుల లోతైన మురుగు కాల్వలోనూ, గట్ల మీదా అక్కడి ఎంగిలాకులూ, త్రాగి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులూ, సీసాలూ, ఎండుటాకులూ, ఇప్పటికిప్పుడు సుందరీకరణ కోసం కొట్టేసిన చెట్ల కొమ్మలూ, ఇంకా పీకేసిన బంతి చెట్లూ వగైరాల పరిమాణం ఒక ట్రాక్టర్ నిండుగా!

2) ఐదారుగురి 10 పని గంటలపైగా శ్రమ స్మృతి ఉద్యానంలో జరిగింది. వాళ్లకేమో సుందరీకరణ బృందంఅనే ఒక బిరుదు తగిలించబడింది. ఏ చిన్న, పెద్ద పనైనా తమకు సంతృప్తి కలగందే, పరిపూర్ణతదక్కందే వాళ్లూరుకోరు మరి!

3) ఇద్దరి ప్రయత్నమేమో జాతీయ పతాక రూపకర్త పింగళి వేంకయ్య విగ్రహ ప్రాంగణ పరిశుభ్రత కోసమే కేటాయించబడింది. రోడ్డు మీద వెళుతూ కూడ ఎవరైనా తేలిగ్గా కనిపెట్టవచ్చు ఆ పరిసరాల్లో నిన్నటికీ ఈ ఉదయానికి వచ్చిన మార్పులు!

4) ముగ్గురనుకొంటా - సుమారు 120 గజాల బారునా బెజవాడ రహదారిని చీపుళ్లతో ఊడ్చి, గాంధీ పాద సన్నిధినీ, త్రివిర్ణ పతాక శిల్పి విగ్రహ పరిసరాన్నీ శుభ్రపరిచారు!

            కార్యకర్తల్లో ప్రతి యొక్కరూ ఐచ్ఛికం గానూ, ప్రతిఫలాపేక్షారహితంగానూ, చిరకాలంగా పని చేస్తున్నందున 2 గంటల శ్రమ తరువాత కూడ ఏ ముఖంలోనైనా చిరాకు లేదు ప్రశాంతత తప్ప! 2700 రోజుల సంస్కరణం తరవాత కూడ - ఈ ఊరి జనం కలిసిరారేం? శ్మశానాలూ, బాహ్య రహదార్లూ, పబ్లిక్ ప్రదేశాలూ, అత్యున్నత ప్రమాణాలతో స్వచ్ఛ - సుందర టాయిలెట్లూ ఇంత అందంగా, కొంత పొందికగా, లక్షలాది గ్రామాలకాదర్శంగా మారుతున్నా కొందరు గ్రామస్తులు గ్రహించరేం?” అనే సదసత్సంశయం కార్యకర్తలకు పుట్టుకు రాలేదు - నిష్కామ కర్మిష్టులుకనుక!

            ఒకానొక 83 ఏళ్ల వైద్య వృద్ధుడు అరగంటలో శ్రమదానం ముగుస్తుందనగా వచ్చి, తోచిన పని చేస్తుండడాన్నీ, మరో కార్తకర్త - రాత్రంతా జ్వరంతో ఉన్నా, ఆలస్యంగానైనా వచ్చి ఒక ప్రేక్షకుడుగానైనా ఈ స్వచ్చంద కార్యక్రమంలో కలవడాన్ని గ్రామ సోదరులెందుకు ఆలోచించరో మరి!

            6.30 కి నూతక్కి శివబాబు నిస్సందేహంగా ముమ్మారు పలికిన సొంతూరి స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలూ, DRK వైద్యుల వారి శ్రమదాన పూర్వాపరాల సమీక్షలూ యధావిధిగా జరిగిపోయాయి! ఒక సుదీర్ఘ చారిత్రాత్మక శ్రమదానం 2700 రోజులకు దగ్గరైనందుకు చేయదగిన ఏర్పాట్ల గురించీ కొంత చర్చ జరిగింది.

            రేపటి 2698* వ నాటి శ్రమ వేడుక బందరు రహదారిలోని ATM కేంద్రం దగ్గర కలుసుకొని, నిర్వహించాలని నిర్ణయమూ జరిగింది!

            బహుశా కార్యకర్త శ్రమమే గద!

ఎన్ని వేల - వేల యేళ్లు ఈ గ్రామం ముది వయస్సు?

దశాబ్ది స్వచ్ఛోద్యమ మనగా దానిలోన ఒక్క నలుసు!

ఈ మాత్రం కళకళగా ఏ కాలంలో ఉందని?

కారణ మందుకు బహుశా కార్యకర్త శ్రమమే గద?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   02.03.2023.