2698* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమంలో అక్షరాలా 2698* వ నాడు.

            (3.3.23) శుక్రవారం ఉదయం, 4.17 - 6.15 మధ్య సమయం, సామాజిక కర్తవ్య స్పృహ ఉన్న వ్యక్తులు కనీసం 32 మంది, బందరు రహదారికి చెందిన ATM కేంద్రం!

            వాళ్లు 9 ఏళ్లుగా ఎందు నిమిత్తం వీధుల్లోకి వస్తున్నారో ఏ గ్రామస్తుల సౌకర్యార్థం శ్రమిస్తారో తెలిసి కూడ తమకే సంబంధం లేనట్లు సంచరిస్తున్న వందలాది ఊరి జనం!

            ఇక అక్కడకి దాపున కొంత కాలం నుండి నిర్మాణంలో ఉన్న - ప్రజా సౌకర్యార్ధం మనకోసం మనంధార్మిక సంస్థ వారి స్వచ్ఛ సుందర - పబ్లిక్ టాయిలెట్లు! అక్కడ ఎగుడు దిగుడు జాగాల మీద, డ్రైన్ల అపరిశుభ్రత మీద, సచివాలయం చుట్టూ వికారం కలిగించే అన్ని రకాల కశ్మలాల మీద, రహదారి దుమ్మూ - ధూళి మీద స్వచ్ఛ కార్యకర్తలు ప్రకటించిన 2 గంటల యుద్ధం!

            చీపుళ్లతో ఊడ్చేప్పుడు దుమ్ము లేచి, బట్టలకూ వంటికీ, ముఖానికీ, తల మీదా అంటుకొంటేనూ - ముక్కుల్లోకి దూరితేనూ ఆ ఊపులో ఎవరు లెక్కచేశారు గనుక! సచివాలయం చుట్టూ ఉచ్చ కంపులకు ఎవరు వెనకడుగేశారని! ఇద్దరు ముగ్గురైతే ఆ మడుగుల మధ్య కూర్చొని కత్తుల్తో దేనికీ పనికి రాని గడ్డినీ, పిచ్చి మొక్కల్నీ కొట్టేయలేదా?

            వాళ్లు పెద్ద డాక్టరైతే ఏంటీ సర్పంచైతే ఏంటీ - గడప దాటి బైటకు రాని గృహిణులైతేనో - ఉన్నతోద్యోగులైతేనో ఏంటిటా? ఈ 2 గంటల వీధి పారిశుద్ధ్య కృషిలో అందరూ సమానులే - తమ ఊరి ప్రధాన వీధి శుభ్రపడి, గ్రామస్తులకు సుకరంగా ఆహ్లాదప్రదంగా ఉండాలనే ప్రతి కార్యకర్త మనోగతం! రేపటి కల్లా - అంటే 2700 రోజులకు ముందుగానే స్వచ్ఛ - సుందర మూత్రశాలల ప్రాంతం నంబర్ వన్ గా కన్పించాలనే ఉమ్మడి లక్ష్యం!

            వీధి కాలుష్యాల అంతంఅనే గమ్యం నిర్ణీత వ్యవధిలో చేరుకోగలమనే వాళ్ల ధీమా! సదరు ధీమాతోనే 65 పర్యాయాల రక్తదాత బరువైన రాళ్ల మూటను అమాంతం ఎత్తి ట్రక్కులోకి విసిరాడు; ఒక గాయకుడు మురుగు తూములోకి దూరి, ప్లాస్టిక్ దరిద్రాల్ని బైటకు లాక్కొచ్చాడు - మరి ఇవన్నీ స్వచ్చంద శ్రమదానంలో ప్రతి వేకున కాలంలోనూ కనిపించే దృశ్యాలే! ఈ ఉద్యమం ఒక సామూహిక శక్తి! దాని అండ చూసుకొనే తప్ప కార్యకర్తలిలాంటి సాహసాలు ఇళ్ల దగ్గర చేస్తారని నేననుకోను! చేస్తే - కుటుంబీకులు అడ్డుపడతారు మరి!

            ఎల్లి ఉండిచారిత్రాత్మకమైన 2700* వ నాటి పాదయాత్ర గురించీ, ప్రారంభోత్సవాల గురించీ 6.35 సమయంలో చర్చ జరిగింది, కార్యక్రమం చాల వరకు నిర్ణయింపబడింది. నేటి కష్టసాధ్య శ్రమదానం గురించి DRK గారి ఆశ్చర్యమూ, సంతృప్తీ ప్రకటించే ముందు కొంచెం దూకుడుగా ముమ్మారు గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ ప్రతిజ్ఞలు పలికి, వివేకానంద వాణిని వినిపించినది అడపా గురవయ్య గురువే!

            ‘చేతి గుడ్డసంచుల పంపకం నేటి ఒక విశేషం!

            రేపటి వేకువ శ్రమదానం కోసం మనం కలువదగిన చోటు ATM కేంద్రమే గదా!

            శుభ సందర్భము ఇదే అని!

స్వచ్ఛ సుందరోద్యమమొక సాహసమని - పావనమని-

రెండు వేల ఏడొందల రోజుల వైశాల్యమనీ

అన్ని ఊళ్ల కనివార్యము - ఆచరణీయము అనుకొని

చాటి చెప్పవలసిన శుభ సందర్భము ఇదే అనీ...!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   03.03.2023.