2699* వ రోజు....... ....

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

గ్రామ స్వచ్చ-సుందరోద్యమం లో ఇది 2699* వ నాడు!

            ఈ శనివారం(04.3.2023) ఆ పనులు 4.18 కే మొదలై, 6.15 దాక జరిగినవి. ఈ నాటి ఊరి వీధి అలంకరణ పనిమంతులు 36 మందిలో ఆలస్యంగా వచ్చిన మూడు నాలుగు మంది అతిథి కార్యకర్తలు పోను నికరంగా 30 మంది కరుడు గట్టిన స్వచ్చోద్యమకారులు!

            వాళ్లు వీర విహారం చేసిన రణస్థలి సంత వీధి మొదలు బందరు బాటలోని పెట్రోలు బంకు దాకా! నేటి వీధి పారిశుద్ధ్య పనుల తీరు చూస్తుంటే కార్యకర్తల ఎర్ర చొక్కాలు చూస్తుంటే పాత కాలపు కమ్యునిస్టు కార్యకర్తల శ్రమదాన వాతావరణం గుర్తుకొచ్చింది. అప్పటి త్యాగ బుద్ధీ, చిత్త శుద్ధీ ఇంకోమారు మనస్సులో మెదిలాయి!

            ఇది 400 మీటర్ల నిడివీ, 70-80 అడుగుల వెడల్పూ ఉన్న బందరు జాతీయ రహదారి భాగం. ఇక్కడనే 2 ముఖ్య దేవాలయాలూ, 20-30 దుకాణాలూ, టిఫిన్ బళ్ళూ, కూరల అంగళ్లూ, ATM సెంటర్లూ, క్రొత్త పెళ్లి కూతుర్లా ముస్తాబైన స్వచ్చ - శుభ్ర - సుందర టాయిలెట్ల ప్రాంగణమూ, నిర్మాణంలో సచివాలయమూ వగైరా!

            అవన్నీ ఎవరో మంత్రించినట్లు ఈ 30 మంది పట్టుదలతో 2 గంటల వ్యవధిలోనే ఎంత స్వచ్చ-సుందరంగా మారిపోయమో ఎవరైనా స్వయంగా వెళ్లి చూడవచ్చు బైటి దూరస్తులైతే వాట్సాప్ మాధ్యమ చిత్రాల్లో నైనా పరీక్షించవచ్చు. ఏ ఊళ్ళో ఏ వీధినైనా ఈ ½ కిలో మీటరు రోడ్డు కన్నా శుభ్రంగా, దర్సనీయంగా ఉందాఅని పోల్చి చూచుకోవచ్చు!

            ఎందుకుండదు? ఆ పనులు చేసిందెవరు? గ్రామ మెరుగుదల పనుల్లో 9 ఏళ్ల -2699*నాళ్ళ అనుభవజ్ఞులు! ఈ మురికి పనుల్లో చేతులు రాటు తేలి, చలినీ ఎండనూ వానల్నీ లెక్క చేయనివాళ్ళు! లక్షలాది పని గంటలుగా శ్రమించి, పుట్టి-పెరిగి- జీవిస్తున్న తమ ఊరిని శక్తి వంచన లేకుండా అలంకరించి పూజించి- తరించే ఒక చిన్న బృందం!

            చల్లపల్లి ప్రజానీకం మీద ఈ స్వచ్చ - సుందరోద్యమ ప్రభావం ఇప్పటికేమాత్రం ఉందో గాని ఎక్కడెక్కడి వాళ్ళో ఉండ బట్టలేక వచ్చి, ఊరి శ్మశానాన్నీ, బస్ ప్రాంగణాన్నీ, 7 రహదారుల్నీ, ముఖ్య వీధుల్నీ వారిలో కొందరు సజాతీయ సామాజిక బాధ్యులుంటే చల్లపల్లి కార్యకర్తల వేకువ సమయ శ్రమదానాన్నీ చూచి, పాల్గొని, మెచ్చి, వాళ్ల గ్రామాల్లో ప్రయత్నిస్తూనే ఉన్నారు!

            ప్రాత - క్రొత్త కవిత్వాల్ని తెగ చదివి, స్వయంగా పద్యాలు గిలికే నా బోటి వాళ్లట్లా ఉంచి చిరకాలంగా కత్తుల్తో కడుపులు కోసే ఒక సీనియర్ శస్త్ర వైద్యుడు నేటి కార్యకర్తల శ్రమ పద్దతి చూసి, బాగుపడిన వీధిని తన్మయంగా తిలకిస్తూ వర్ణించిన మాటలివి:

            మిడతల్దండు పడినాకేసిపోయినట్లూ – ‘బాహుబలిసినిమాలో కర్కోటక కాలకేయులు శత్రు ప్రాంతాల్ని ధ్వంసం చేసినట్లూ... చల్లపల్లి స్వచ్చ కార్యకర్తల దెబ్బకి ఎక్కడెక్కడి కాలుష్యాలూనాశనమై పోయినవి చూడండి!

            సీనియర్ శస్త్రకార వైద్యుడు సరే - పెద్దగా చదువుకోని ఇద్దరు కార్యకర్తలు సైతం వాళ్ల పద్దతిలో వాళ్ల మాటల్లో నేటి శ్రమదానాన్ని వర్ణించడం కూడ విన్నాను. (స్థలాభావం వల్ల సదరు వర్ణనలు తరువాత రోజుల్లో వివరించబడును) అంటే ఈ స్వచ్చ- సుందర శ్రమదానోద్యమం కొందర్లో పాటలుగా మరి కొందర్లో కవిత్వాలుగా బైట కొస్తుందన్న మాట!

            6.35 కు జరిగిన సమీక్షా సభలో కార్యకర్తల్లో తరగని ఉత్సాహం చూస్తుంటే – “ చీకటి వేళ-2 గంటలుగా మురికి కసవు-దుమ్ము పన్లు చేసింది వీళ్ళేనా?” అనిపిస్తుంది. సమయాభావం వల్ల ఆస్థాన గాయకుని పాటే కుదర్లేదు.

రేపటి 2700* వ నాటి కార్యక్రమం ఇలా ఉండునట:

1) 4.30 కే బందరు వీధి ప్రక్క గస్తీ గది దగ్గర చేరుట, 5.00 AM నుండి పాద యాత్రగా జాతిపిత విగ్రహం దగ్గరికి పోవుట, తిరుగు నడకలో బందరు రహదారి ప్రక్క నూతన టాయిలెట్ల నావిష్కరించుట, 6.40 కి పద్మాభిరామం దగ్గర సమావేశమై, అల్పాహారమొనర్చుట

2) పనిలో పనిగా తన పెన్షన్ నుండి ఈ నెల 2000/- చందాను మాలెంపాటి వైద్యుల వారు మనకోసం మనంసంస్థకు సమర్పించిరి.

            రేపటి వేకువ గంగులవారిపాలెం దారిలోని గస్తీ గది వద్దనే మన కూడిక! 

      నిరాశ నిస్పృహ లెందుకొ!

ఆశించిన ఫలితాలకు ఆమడ దూరం ఉందనొ

గ్రామస్తుల్లోన స్ఫూర్తి కలింగించుట చాల్లేదనొ

సగం ఊరి వీధుల్లో సౌందర్యం రాలేదనో

నిరాశ నిస్పృహ లెందుకొ నేటి ప్రగతి చూడకుండ?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   04.03.2023.