2700* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

 గ్రామ స్వచ్చ-సుందరోద్యమకాలం కొలతలో మంచి మైలు రాయి @ 2700* !

          05.03.2023 వేకువ 4.308.00 నడుమ 3 గంటలకు పైగా కార్యక్రమమంతా నిజంగా చిరస్మరణీయమూ, అన్ని గ్రామాలకు అనుసరణీయమూ, మననీయమూ, మాననీయమూనూ! మూడు చోట్ల 3 వేడుకలూ, 150 మందితో 6 ½ కిలో మీటర్ల పాదయాత్రలూ, మౌనతపోమూర్తి దగ్గరైతే 193 మంది సమావేశమూ, ఆద్యంతమూ అద్భుతమూ గ్రామ స్వచ్చోద్యమానికి ఆశావహమూ!

          3 గంటలే నిద్రించి, 3 గంటలకే  మేల్కాంచి, 100 కిలో మీటర్లు ప్రయాణించి, 5.00 కే గస్తీ గది దగ్గర కనిపించి, స్వచ్చోద్యమానికి 5000/- సమర్పించి, 5.30 కు జెండా ఊపి స్వచ్చ పాదయాత్రను ప్రారంభించిన గోపాళం శివన్నారాయణుడు అద్భుతమైతే – “ మేరా జీవన్ హీ మేరా సందేశ్అనిన గాంధీ తత్త్వాన్ని 3 నిముషాల్లో వివరించడమంటే ఒక గాంధీని, ఒక మదర్ థెరిస్సానీ జీర్ణించుకొన్న మనిషికే సాధ్యం!

          120 మందితో గస్తీ గది నుండి ప్రారంభమైన కార్యకర్తల ప్రవాహంలో అక్కడక్కడా కొన్ని ఉపనదులు వచ్చి కలిసి చివరికి 193 మందితో మహా నదిగా మారింది. ఆ జీవ నది మునసబు వీధి లోనికీ, పోలీస్ స్టేషన్ ముందుకూ, సాగర్ టాకీస్ దగ్గరా మలుపులు తిరిగి, బెజవాడ దారిలో కాసేపు ఆగి, ఉదయ శంకర శాస్త్రి చేతులతో జాతిపిత స్మృతివనం పునః ప్రారంభం జరిగి, బందరు రహదారిలో స్వచ్చ సుందర టాయిలెట్ల ఆవిష్కరణం దగ్గర తాత్కాలిక విరామంతో 7.20 కి పద్మాభిరామంలోకి సంగమించింది!

          ఇక అక్కడి ఆతిధ్యమూ, అల్పాహారం పేరిట ఇచ్చిన విందూ ఎంత బాగున్నాయంటే కొందరది పూర్తిగా తిన లేకా, వదల్లేకా ఇబ్బంది పడి సగటునకు ఏ ½  కిలో బరువో పెరిగుంటారు! అంతకన్నా రెట్టింపు అందరి హృదయాలు బరువెక్కింది మాత్రం నేటి స్వచ్చ- సుందర జైత్ర యాత్ర పట్ల సంతృప్తితోనే!

          అసలు ప్రతి వేకువ 30-40 -50 మంది కష్ట జీవుల శ్రమ 9 ఏళ్లుగా  ఈ ఊరి కెందుకు సమర్పితం కావాలి? ఈ చల్లపల్లి లోనే 2700* దినాలుగా ఈ సుదీర్ఘ స్వచ్చ సుందరోద్యమం వర్ధిల్లుతుండాలి? పంచాయతీ గాని, పరస్పర వైరి పక్షాల రాజకీయులు గాని, గ్రామంలోని స్వచ్చంద సంస్థలు గాని, స్థానిక-స్థానికేతర దాతలుగాని ఇంత కాలంగా ఎందుకు కార్యకర్తల కృషికి సహకరించాలి?

          ఎందుకో చెప్పలేను గాని- ఇన్ని సానుకూలతలతో, సహకారాలతో, సంప్రదింపులతో గాకుంటే ఈ శ్మశాన సౌందర్యాలూ, 7 రహదార్ల అందాలూ, ఇన్ని సౌకర్యాలూ, అడుగడునా అనితర సాధ్యమైన స్వచ్చ సౌందర్యాలూ చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలు సాధించగలిగేవారా ? ఈ సువిశాల దేశంలోని ఆరేడు లక్షల గ్రామాల్లో చల్లపల్లి మాత్రమే ఇంత ప్రత్యేకంగా విశిష్టంగా వినమ్రంగా వికసించగలిగేదా?

          దీన్నే ఈ స్వచ్చ సుందరోద్యమ చల్లపల్లి ప్రయాణాన్నే గాంధేయ మార్గమంటారు! ఒక వివేచనా, ఒక విచక్షణా, ఒక సదవగాహనా, ఒకానొక సహన శీలతా, ఒక మంచి పునః పునరంకిత తాత్త్వికతా ఈ మార్గం యొక్క బలాలు! అక్కడక్కడా అప్పుడప్పుడూ నెమ్మదించినా అంతిమంగా గాంధేయ మార్గానికి ఎదురేలేదు!

         ఇక- నిన్నటి మాలెంపాటివాని 2000/- విరాళం కాక- ఈ ఉషోదయ కాలాన మనకోసం మనం ట్రస్టుకుఆర్ధిక ప్రోత్సాహకాల జాబితా:

1) గాంధీ విగ్రహం సాక్షిగా అన్నవరపు పాండు రంగారావు గారి 15000/-

2) చల్లపల్లి  వస్త్ర వ్యాపారుల సంఘం వారు 5,000/-

3)గుత్తికొండ కోటేశ్వరుని 10,116/-

4) ప్రాతూరి శాస్త్రి మహాశయుని 5000/-

5) దేసు మాధురీ -  ప్రభాకరుని 50 స్టీలు గ్లాసులు,

6) తమ్మన ప్రసాదు అనబడే గాంధీ అనుచరుని 1000/- మరియు లక్ష వాగ్దానమూ,

7)నాదెళ్ళ పూర్ణ చంద్ర రావు గారి బంగినపల్లి మామిడి మొక్క బహూకరణ ,

          ప్రత్యేకించి ఒక అల్పాదాయ విశ్రాంత చిరుద్యోగీ, పాగోలు నివాసీ కంఠంనేని రామబ్రహ్మం  1,05,000/- భూరి విరాళమూ

          ఈ ఆదివారం విడుదలైన బంపర్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ స్వచ్చ సుందరోద్యమ చల్లపల్లి 2700* వేడుక సినిమా చూశాక 160 నుండి 190 మంది ఉత్సాహ ఉద్వేగాలు గమనించాక- ఇళ్ళ నుండి గృహస్తులు కూడ స్వచ్చ సుందరోద్యమ నినాదాలు చేయడం వీక్షించాక- నా ఆశాభావమేమంటే ఈ సినిమా ఓపెనింగ్సే కాదు- వందల, వేల రోజులు నిలకడగా ఆడి, ఊరంతా స్వచ్చ శుభ్రతలు తాండవించి, శుభం కార్డు పడగలదనే!

          నాకే ఈ సినిమా ఇంత అద్భుతంగా నచ్చితే

          ఆరుగాలాలూ చెమటలు చిందించే స్వచ్చ కార్యకర్తలూ, ముఖ్యంగా తమ నరనరానా చల్లపల్లి స్వచ్చోద్యమాన్ని నింపుకొన్న దాసరి రామకృష్ణ ప్రసాదూ, తరిగోపుల పద్మావతీ, సుదూరస్తుడు నాదెళ్ళ సురేషూ ఇంకెంత ఆనందిస్తున్నారో!

          బుధవారం నాటి మన వీధి పారిశుద్ధ్య కృషి బెజవాడ బాటలోని గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమగును!

          చల్లపల్లి సంచలనం

స్వచ్చోద్యమ చల్లపల్లి సంచలనం గద ఇప్పుడు

కార్యకర్త శ్రమదానమె కారణమని నమ్ముడు

శ్రమ లేనిదె  ఫలిత మసలు సమకూడినదెప్పుడు?

శ్రమ మూలమిదం జగత్ సార్థకమని ఒప్పుడు! 

 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   05.03.2023.