2701* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

2701*వ నాటి వీధి మరమ్మత్తు పనులు రెస్క్యూ టీమ్ వంతు!

            సోమవారం (6.3.23) వచ్చిందంటే అర్థం - ఒక ప్రత్యేక వాలంటీర్ల దళం సిద్ధంగా ఉంటుంది - వాళ్లు చేసుకోవడానికి ఏ రోడ్డు గుంటలో - విరిగిపడిన చెట్టు కొమ్మలో - డ్రైన్లలో పడి - మురుగు కడ్డం నిలుస్తున్న రకరకాల తుక్కులో రడీగా ఉంటాయి! అవి చల్లపల్లిలో కావచ్చు ఊరి వెలుపల 7 రహదార్ల పనులూ కావచ్చు! కాదేదీ వాళ్ల కనర్హం!

            ఈ ఉదయం 4 .30 కే ఈ కార్యకర్తలకు పెదకళ్లేపల్లి బాటలోని - శివరాంపురం సమీప డ్రైను నుండి ఆహ్వానం అందింది. ఇంకేముంది - 2 కిలోమీటర్లు వెళ్లడమూ, రోడ్డు అపరిశుభ్రత మీద కలబడడమూ జరిగిపోయినవి!

            రోజువారీ కార్యకర్తలు ఐదుగురు కాక గ్రామ స్వచ్ఛ ప్రాత కార్యకర్త - నడకుదురు బాటలో ఉండే మెకానిక్కు రవి మళ్లీ అందుబాటులోకి వచ్చాడు. సుమారు రెండు గంటల పాటు వీధి మార్జిన్లు ఊడ్చి డ్రైనులోని తాడి మట్టలూ, ఆకులూ, పుల్లలూ, ప్లాస్టిక్ తుక్కులూ లాగి, గుట్టలు చేసి, ట్రక్కులో నింపి, చేర్చవలసిన చోటికి చేర్చి - స్వచ్ఛ కృషికి తన కొన్నాళ్ల ఎడబాటు బెంగను తీర్చుకొన్నాడు!

            ఈ ఉదయం పనితో శివరాంపురం దగ్గరా, మేకలడొంక దాపునా పనులు పూర్తైనవనీ, కొన్ని నెలల దాక ఆ రహదారి స్వచ్ఛ - శుభ్రతలకు డోకా లేదనీ వాళ్ళ నమ్మకం!

            ఈ ఉదయం నడక సందర్భంగా బందరు రోడ్డు - పెట్రోలు బంకు ప్రక్క నిన్న వందలాది జనం సమక్షంలో ఆవిష్కరించిన స్వచ్చ - సుందర పబ్లిక్ టాయిలెట్లనూ - వాటి నిర్వహణలో ఉన్న నాగరాజనే ఉద్యోగినీ గమనించాం. అవి గ్రామస్తులకూ, బైట ఊళ్ల నుండి వచ్చే వారికీ - ముఖ్యంగా బస్సులు దిగి వచ్చే మహిళలకూ ఎంతగా వరప్రసాదాలో గుర్తుచేసుకొన్నాం! మహిళల పరువు దక్కించే ఈ అందమైన మూత్రశాలల్ని గ్రామ సర్పంచమ్మతో బాటు మహిళా పంచాయతీ ప్రతినిధులే నిన్న ప్రారంభించడం ఎంతో సమంజసంగా ఉన్నది!

            సరిగా గమనింపుడు!

ఆశయాలు స్వార్థంతో అంటకాగ నప్పుడు

పదగురికీ ఆనందం పంచాలనుకొన్నప్పుడు

స్వచ్ఛంద శ్రమదానం సంభవించు చుండును

చల్లపల్లె ఉదాహరణ సరిగా గమనింపుడు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   06.03.2023.