2702* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

వీధి వృక్షాల మరమ్మత్తులో రెస్క్యూ దళం - @2702*

            మంగళవారం(7-3-23) నాడు వేకువ వాళ్ల ఉనికి గంగులవారిపాలెం బాటలో కన్పించింది. తొలుత ఐదుగురే కాని, క్రమంగా ఇతర కార్యకర్తల మద్దతు ఎక్కువై చివరి దశ బాల దుర్గారాంప్రసాదుని నినాదాల వేళకు 14 మందిగా లెక్క తేలింది! అది జరిగిందేమో పద్మావతి ఆస్పత్రి ఎట్ట ఎదుట!

            నేను ఇంటి నుండి గేటు ఎదుటికి వచ్చేప్పటికే రెస్క్యూ కార్యకర్తల పని ముమ్మరించింది - కరెంటు తీగల దాక పెరిగిన పచ్చని వృక్షం సగం మర రంపంతో కోసేశారు. చెట్లు నాటి - పెంచడంలోనే కాదు - తప్పనప్పుడు వాటి సుందరీకరణ నిమిత్తమో, విద్యుత్ ప్రమాద భయంతోనో వాటి కొమ్మల్నెలా తొలగించాలో కూడ వాళ్ళకు బాగా అనుభవం వచ్చింది!

            ఒక్క గంటలోపే ఆ చెట్టునూ, ఎండిన 2 మృత వృక్షాల మొదళ్లనూ కోసి, కొమ్మ రెమ్మల్ని ట్రక్కులోకి ఎక్కించి, కొమ్మల్ని అక్కడే ఉంచి, మళ్లీ అదే వీధి చివరి మలుపులో ఇలాగే హద్దు మీరి పెరుగుతున్న ఇంకో చెట్టు సంగతి చూశారు! ఊరి వీధుల మెరుగుదలకూ సౌకర్య కల్పనకూ - సుందరీకరణంతో ప్రజల ఆహ్లాదానికీ అంకితమైపోయిన కార్యకర్తలు ఇలాగే ఉంటారు మరి!

            మహాభారత యుద్ధ క్షేత్రంలో అర్జునుడికి ఉపదేశించే గీతాచార్యుడిలా అన్నాడట!

            యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత -....

            సంభవామి యుగే యుగే!

            (ఏ యుగంలో ఎప్పుడు ధర్మానికి భంగం వస్తుందో అప్పుడు అక్కడ నేను అవతరిస్తుంటాను.)

            ఈ ఒక్క దశాబ్దంలో - ఈ చారిత్రాత్మక చల్లపల్లి కశ్మల భీభత్సాల ప్రమాదం తప్పించడానికి అలా సంభవించిందే చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమం!

            రేపటి బెజవాడ రహదారి పారిశుద్దీకరణ కోసం మనం కలిసి శ్రమించదగింది గాంధీ స్మృతి వనం 6 వ నంబరు కాలువ ప్రాంతం!

 

అదెట్లు వచ్చి చేరిందో అందరికీ తెలియకున్న

అలవడింది పరిశుభ్రత అందరికీ ప్రతి యొకరిని!

పలకరించు పచ్చదనం లేకుంటే తొమ్మిదేళ్లు -

ఊరి జనుల కాహ్లాదం ఉండదుగద ముందునాళ్లు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   07.03.2023.