2703* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

2703* వ నాటి ఊరి బాధ్యతలు.

            అది బుధవారం – (8.3.23) చల్లని ఉదయం - 4.23. గాంధీ పాదపీఠం దగ్గర హాజరైన డజను మంది స్వచ్ఛ కార్యకర్తలు - త్వరగా వచ్చి చేరిన మిగతా వాళ్లను కలుపుకొని - మొత్తం 29 మంది సొంతూరి బాధ్యతలు నెరవేర్చినది 3 చోట్ల!

            అందులో 5+2 మంది ఇక్కడికి దూరంగా పోస్టాఫీసు ప్రక్కన ఇరుకు సందులోనికి వెళ్లడమూ, ఒక భవన నిర్మాణ దాతను సంప్రదించి, రాతిముక్కల ఇసుక - మట్టి రద్దును పరిగ్రహించడమూ - అప్పటికప్పుడు ట్రక్కులో దాన్ని నింపుకొని 2 కిలోమీటర్ల దూరాన - అమరుల స్మృతి చిహ్నం దగ్గరకు చేర్చడమూ గంటన్నర సమయంలోనే పూర్తయింది!

            ఇక వీధి సౌందర్యకారులేడెనిమిది మంది కాస్త ఎగుడు దిగుడుగా ఉన్న 50 గజాల బెజవాడ రహదారికే తమ సేవలు సమర్పించుకొన్నారు! నడక మరచిపోయి, మురుగు నిలిచిన రోడ్డు పడమర భాగం కూడ వీళ్ల ఖాతాలోనిదే !

            ఇంతకన్నా కష్టమైన కృషి - 10 మంది కార్యకర్తలది! కోమలానగర్ 8 వ అడ్డరోడ్డును సంస్కరించడం! ఇరుకు రోడ్దే గాని - సగమే ఇళ్లు, సగం ఖాళీ నివేశనాలు! ఇళ్లేమో అందంగా - వీధి అందులూ, ఖాళీ స్థలాలూ పెరిగిన గడ్డితోనూ - రకరకాల పిచ్చి మొక్కలూ - తీగల్తోనూ - ముఖ్యంగా ముళ్ల పొదల్తో కార్యకర్తల సహనానికి పరీక్షన్న మాట!

            కష్టమైనా ఆలస్యమైనా - మొత్తానికా చిన్న వీధి పారిశుద్ధ్యాన్ని సాధించారు! 6.15 కు గాంధీ విగ్రహం దగ్గరికి తిరిగి వస్తూ వారి ముఖాల్లో సంతృప్తే వాళ్ల విజయ చిహ్నం! ఈ స్వచ్చ కార్యకర్తలు పదే పదే స్వచ్ఛ సుందర చల్లపల్లిని - సాధిస్తాం, సాధిస్తాంఅంటూ చేసేవి వట్టొట్టి నినాదాలు కావు ప్రతి వేకువా అవి అనుభవ పూర్వకంగా పలికేవే!

            తమ ఊరి బాగుదల బాధ్యతను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకోకపోతే - రోజువారిగా అందులో ఎన్నెన్ని అనుభవాలు పొందకపోతే - గ్రామవీధి పారిశుద్ధ్య కృషిలో ఎంతగా  రుచి దొరక్కపోతే వేలాదిగా శ్రమదానాలూ, పాదయాత్రలూ, ఇన్ని ప్రణాళికలూ, వాటి అమలూ సాధ్యపడుతుందా?

            స్వచ్ఛంద శ్రామికులు తామనుకొన్నవి సంతృప్తికరంగా సాధిస్తున్న వేళ - మిగిలిన లక్ష్యాలనూ పూర్తిచేయగలమని ధైర్యంగా ఉన్న సమయాన - దాతలూ, సహృదయులూ ప్రోత్సహిస్తున్న సందర్భాననైనా కళ్ల ముందున్న కటిక నిజం 9 ఏళ్ల శ్రమదానోద్యమం తరవాతైనా - వీలైన ప్రతి గ్రామ పౌరుడూ, విద్యార్దీ, అవకాశం దొరికిన పెద్దలూ ముందుకొస్తే గ్రామానికి మరింత మేలు జరుగుతుంది.

6.20 వేళకు అన్ని చోట్ల కార్యకర్తలూ బాపూజీ విగ్రహం దగ్గర సమావేశమైనపుడు

1) అంతర్జాతీయ మహిళా దినాన్ని పురస్కరించుకొని గొరిపర్తి నాగ శేషు ఆలపించిన పాట,

2) అడపా గురవయ్య గాథలూ, క్వొటేషన్లూ

            ఆలోచనాత్మకం గానూ, సందేశాత్మకంగానూ ఉండెను!

శ్రమదానాలతో బాటు ఇద్దరి అర్ధ దానాల వివరాలు:

1) ఏ నాటి నుండో కోడూరు వేంకటేశ్వరుని క్రమం తప్పని 520/- విరాళమూ,

2) తనదెంతో రహస్య మిత్రునిదెంతో చెప్పని షణ్ముఖ శ్రీనివాసుని 700/- సహకారమూ!

            రేపటి వేకువ శ్రమదానం కోసం మనం ఇదే గాంధీ విగ్రహం దగ్గర ఆగి, కోమలానగర్ చివరి వీధో విజయవాడ బాటో ఎంచుకొని శ్రమించవలసి ఉన్నది!

      కావలసినదల్లా కాస్త శ్రద్ధ

సరళీ కృత కల్పవల్లి స్వచ్చోద్యమ చల్లపల్లి

ఎంట్రీ ఫీజులూ లేవు - పెద్ద నిబంధనలు లేవు

శక్తి మేర కృషే గాని శ్రమకు కొలతలుండబోవు

కావలసినదల్లా మన గ్రామంయెడ కాస్త శ్రద్ధ!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   08.03.2023.