2704* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడవచ్చా?

2704* వ పనిదినం కూడ బెజవాడ బాట కేంద్రంగానే!

            చిన్నపాటి మార్పుల్తో నేటి (9.3.23 - గురువారం) శ్రమ కూడా నిన్నటి చోట్లనే! శ్రమదాతలు 26 మంది, పనివేళ 4.15 - 6.15 నడిమి కాలం! సదరు కృషి స్థలాలు

1) 6 వ నంబరు కాలువ వంతెన - సచివాలయాల రోడ్డు,

2) ప్రభుత్వోన్నత పాఠశాల,

3) కోమలానగర్ చివరి వీధి!

            ఇద్దరు ముగ్గురు ప్రాత కార్యకర్తలు తప్ప అక్కడి క్రొత్త కార్యకర్తలు వచ్చిందీ లేదు!

            సిమెంటు కొట్టు నుండి వంతెన దాక 50 గజాల మేర - ఏడెనిమిది మంది పారిశుద్ధ్య కృషి బాగా అక్కరకొచ్చింది. అక్కడికి అదేదో తేలికైన విషయమనుకొనేరు! 20 - 30 అడుగుల పొడవునా గజంలోతునా కంపుగొట్టే మురుగు కాల్వ ఉన్నదక్కడే! దానికేం తక్కువైంది! - నాలుగు డిప్పల్నిండా నాలుగు రకాల చెత్తను బైటకు లాగారు.

            వంతెన దాకా ఉన్న ఐదారు చెట్ల కొమ్మల్ని అవసరమైనంత తొలగించి, బాటను ఊడ్చి, అన్ని తుక్కుల్నీ ట్రాక్టర్ లోకి చేర్చారు.

            కోమలానగర్ తుది వీధి బాగా పొడవాటిది. చివరికంటా అది శుభ్రపడకపోయినా, 6070 శాతం పారిశుద్ధ్యమైనా 10 మంది కార్యకర్తలు సాధించగలిగారు. చాల ప్రాతదే 2704* రోజులుగా ఈ ఊళ్లో జరుగుతున్నదే ఐనా - ముగ్గుర్నలుగురు స్ధానికులు ఆసక్తిగా చూడ్డం తప్ప - ఈ శ్రమదానంలో జోక్యం చేసుకోనేలేదు!

            మిగతా వాలంటీర్లంతా కత్తులు - దంతెలు - చీపుళ్లతో ప్రభుత్వ పాఠశాలలోకి చొరబడ్డారు. వాళ్ల శ్రమ గంటన్నర పాటు - వెలుతురు చాలని మసక చీకట్లోనే పింగళి వేంకయ్య విగ్రహం లోతట్టు రెండు ప్రక్కలకూ వ్యాపించింది. అందుకు గాను మహిళా కార్యకర్తలు సైతం ఇనుప కంచె మీదుగా క్రిందకు దిగారు. ఐతే - ఇందరు సాధించిన పారిశుద్ధ్యమూ, అందుమూలంగా ప్రోగుబడిన గడ్డీ గాదమూ ఎత్తడం కుదరక - ఈ రోజుకక్కడే మిగిలిపోయింది!

            వీళ్ల సంగతట్లా ఉంచి - ముగ్గరి ముఠా బెజవాడ రోడ్డు కంటుకొన్న గులక - ఇసుక - దుమ్ము - సిమెంటుల కాంక్రీటును గునపాల్తో పొడుస్తూ, గోకుడు పారల్తో ప్రయత్నిస్తూ, పారల్తో గోకుతూ రోడ్డు మార్జిన్ సుందరీకరణకై గూళ్లు పోయేలా కష్టించడం కూడ చూశాను ఐదు నిముషాలు అది ఏపాటి బరువుపనో స్వానుభవంతో గ్రహించాను!

            ఇది గాక - ఒక విశ్రాంత కేంద్ర ప్రభుత్వోద్యోగి మరో కార్యకర్త తన ప్రక్కనే ముళ్ల మొక్కల్ని నరుకుతూ వేసిన కత్తి వేటును తప్పించుకొన్నట్లు తెలిసింది!

            వినే వాళ్లు - చదివే వాళ్లు ఉండాలే గాని, ఈ దైనందిన శ్రమదానంలో ఇలాంటి విశేషాలకేమి లోటు?

            గోళ్ల విజయకృష్ణ అనే నడిమి వయస్సు బాలకుడు 6.35 కు పలికిన గ్రామ స్వచ్చ సుందరోద్యమ నినాదాలతో మొదలైన నేటి కృషి సమీక్షలో నాటు వైద్యం వికటించి, ప్రాణ ప్రామాదికమైన సంగతొకటి ప్రస్తావించబడింది.

            ఒక BSNL విశ్రాంత ఉద్యోగికి అయాచిత ధనప్రాప్తితో - అతన్నభిమానించే కాల భైరవులకు నెల నాళ్లకు సరిపడా గ్రాసం!

            మన రేపటి ఉషోదయాత్పూర్వ శ్రమదానానికి గాను బెజవాడ రోడ్డులోని పంట కాల్వ గట్లు ఎంపిక చేయబడినవి!

            ఏం లాభం? కష్టించక?

శ్రమదానోద్యమ మంటే గౌరవ భావం చూపక

సామాజిక కార్యకర్త స్థానమునూ గుర్తించక

ఊరంతటి ప్రయోజనం ఊహింపక - పాల్గొనకా

ఏం లాభం? కష్టించక? ఏ ఫలితం ఊడి పడును?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   09.03.2023.