2705* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడవచ్చా?

బెజవాడ రోడ్డు లోనే - 2705* వ నాటి పారిశుద్ధ్యం !

 

          అది శుక్రవారం (10.03.2023) నాటిది. సమయమైతే యధాతథం- 4.19 నుండి 6.16 దాక! 8-9 ఏళ్ల నాటి ఆశయమేమో 4.30 నుండి కనీస పక్షం – ఏడెనిమిది మందిమైనా – తలా ఒక గంట కాలమైనా ఊరి బాధ్యతగా శ్రమించాలని! అదీ ఒక్క సంవత్సరం పాటు!

          కాని – కాలం మారే కొద్దీ సమయమేమో 4.15 నుండి 6.15 – అనగా తలా రెండు గంటలుగా మారి, ధ్యాన మండలి, సేవా క్లబ్బులు వంటి సంస్థలు ముందు కొచ్చి – కార్యకర్తలేమో ఎక్కువ రోజుల్లో 25 నుండి 35 మందీ, అప్పుడప్పుడూ 40-50 మందీ – అరుదుగా 70-80 వరకూ శ్రమదానంలో పాల్గొంటుంటే – ఒక్క సంవత్సర కాల నియమం కాస్తా 9 ఏళ్లకు దగ్గరగానూ నడుస్తున్న చల్లపల్లి స్వచ్చ – సుందరోద్యమ శ్రమదాన చరిత్ర మారుతున్నది!

          ఊరి వీధులూడ్చే పరిధి దాటి, మురుగు కాల్వలూ, శ్మశానాలూ, వెలుపలి ఏడు రహదార్లూ, పాతిక ముప్ఫై వేల మొక్కలు నాటడంగానూ, ఊరి రోడ్ల గుంటలూ, గుడులూ-బడులూ సంస్కరించడంగానూ,  పరిణమించి, ఒక రకంగా చెప్పాలంటే – వందలాది స్వచ్చ కుటుంబీకులకిదొక శ్రమదాన వ్యసనంగా మారిపోయింది!    

          అప్పుడప్పుడూ పని వేళ విరమణ సూచకమైన ‘ఈల’ మ్రోగించినా, స్వచ్చ శ్రమదానోద్యమ సంచాలకుడు అభ్యర్థించినా, 6.15 దాటినా కొందరు పారిశుద్ధ్య సుందరీకరణ కృషి విరమించరు! ఇది వారి సామాజిక బాధ్యతా నిర్వహణా నిబద్ధత ఔతుందేమో గాని – క్రమ శిక్షణా రాహిత్యమనలేం!

          మరి – “ ఈ నాటి 26 మంది స్వచ్చ – సౌందర్యకారుల 2 గంటల శ్రమ విధంబెట్టిది ? ఫలితమెట్లుండెను?” అని నిదానిస్తే – 150 గజాల బెజవాడ రహదారి – గాంధీ స్మృతి వనం, 6 వ నంబరు కాల్వల ప్రాంతంలో శ్రమించిన ఏడెనిమిది మందీ ;

- సిమెంటు దుకాణాల వ్యర్థాలతో కప్పబడిన 20 గజాల రోడ్డు ను గోకి, మార్జిన్లను ఊడ్చి, మరొక మారు గాంధేయ ఆవరణను పవిత్రీకరించిన స్వచ్చ-సుందర కష్ట జీవులూ;

 - చెన్నై ఆరోగ్య సదస్సు వల్ల రాలేకపోయినా, తన ఆలోచనలన్నీ గ్రామ స్వచ్చోద్యమం చుట్టూ అల్లుకొన్న ఒక విశేషానుభవజ్ఞ వైద్యుడూ;

- నిన్నటి ప్రయాణ బడలికనూ, వంట్లో నలతనూ ప్రక్కకు నెట్టి, కాస్త ఆలస్యంగానైనా కర్తవ్య పాలనకు వచ్చిన విశ్రాంత ఉద్యోగీ;

- అసలీ నాటి శ్రమంతా, సందడంతా  ప్రభుత్వోన్నత పాఠశాలా ప్రాంగణంలోనే! 15-20 మంది శ్రమదాన విన్యాసాలన్నీ ఆ 15-16 సెంట్ల ఉద్యానానికే సమర్పితాలు!

- కూర్చొనీ, వంగొనీ కలుపు పీకడాలూ, పాఠశాల ద్వారం మూయడం వల్ల ‘ జెండా రూప కర్త’ విగ్రహం దగ్గరి ఇనుప ఊచల మీదుగా లోపలికి పోయి – అందులో మహిళా సర్పంచీ, మంచి నీళ్ల బుట్టతో 83 ఏళ్ల వైద్యుడు తిరగడాలూ,

- బడి కక్కూసు దొడ్ల చుట్టూ కత్తుల – దంతెల – చీపుళ్ల- చివర్లో డిప్పల –టైమైపోతుందనే హెచ్చరికల నడుమ ప్రతి కార్యకర్త యొక్క సందర్భోచిత శ్రమ సంగతులూ,

- పని విరమణ సమయపు బూర మ్రోగినపుడు కొందరనిష్టంగా బైటకు రావడాలూ-

6.25 కు మౌనముద్రాంకితుని సాక్షిగా సమీక్షా సభలో మాలెంపాటి గోపాలుని గ్రామ సుందరీకరణ సంకల్ప నినాదాలూ –

          3 మండలాల నుండి పంచాయతీ శాఖాధికారులు వచ్చి- యాదృచ్చికంగా ఊరి వీధుల్నీ – గాంధీ స్మృతి ఉద్యాన అద్భుతాన్నీ- వేల రోజులుగా, 4 లక్షల పని గంటలుగా జరుగుతున్న శ్రమదానాన్నీ అభినందించిన విశేషాన్ని సర్పంచి కృష్ణ కుమారి గారి వివరణా –

          6.50 కి సంతృప్త శ్రమదాతలు ఇళ్ళకేగుటా!

          శనివారం వేకువ కృషికోసం 6 వ నంబరు కాలువ వంతెన (బెజవాడ రోడ్డు) వద్ద కలుసుకొందాం!

     పాటుబడక ఏ ఫలితం సిద్దించును?       

అందరూ విజ్ఞాన ధనులె – అందరునూ విశ్లేషకు

లందరి కవగాహనుంది – ఆరోగ్య ప్రదమిది యని

తెలిసి తెలిసి స్వచ్చోద్యమ శ్రమదానానికి రానపు

 డేం లాభం? పాటుబడక ఏ ఫలితం సిద్దించును?       

 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   10.03.2023.