2706* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవచ్చా?

శనివారం - 2706* వ నాటి శుభ్ర సుందరీకరణం.

11.03.2023 వేకువ 4.18 -6.15 నడుమ జరిగిన సదరు కృషి తో 27 మంది భాగస్వాములూ, బాగుపడినవి 3 ప్రాంతాలూ, కాలుష్యంపైన 2 గంటల పెనుగులాట తర్వాత ప్రశాంతించినవి స్వచ్చోద్యమ కారుల అంతరంగాలూ! గుట్టలుగా తేలి, ట్రాక్టర్ లోకి ఎక్కి, చెత్త కేంద్రానికి చేరింది ప్లాస్టిక్ పదార్థాల, సారా గాజు బుడ్ల, గ్లాసుల – కప్పుల - ముళ్ళ మొక్కల వ్యర్థాలూ!

          20 వేలకు మించిన జనాభాలో సగం మంది పట్టించుకోని-పాల్గొనని – ఆలోచించని – వీధి పారిశుద్ధ్యం పట్లా, మురుగు కాల్వల, పంట బోదెల, ఊరి వెలుపలి రహదార్ల, కొన్ని దేవాలయాల, బడుల పరిశుభ్రత కోసమూ ఈ పాతిక – ముప్ఫై – నలభై మందికే ఎందుకింత బెంగ, చక్కదిద్దాలనే పంతమూ, తమ ఊరి స్వచ్చ-శుభ్ర-సౌందర్యాలను ఎన్నేళ్ళు పట్టినా, మెరుగుపరచాలనే తపనా, విసుగు చెందని విక్రమార్కుని మొండి తనమూ?

          కొన్ని జీవితాలంతే! పది మందికీ మేలు కలిగే నిస్వార్థ సేవను ఎంచుకొని – అందులోనే 9 ఏళ్లకు పైగా ఆనందం పొందే తాత్త్వికుల సంగతి ఎప్పుడైనా, ఎక్కడైనా ఇలాగే ఉంటుంది కాబోలు! అలాంటి అదృష్టం ఎక్కడో చల్లపల్లి లాంటి ఊరికి తప్ప అన్నిటికీ దక్కదు.

          తమ సామాజిక బాధ్యతా నిర్వహణంలో ఏ నాటికానాడు పొందుతున్న ఎనలేని సంతృప్తి కోసం ఈ కార్యకర్తలు వేకువ 3.30 కైనా మేల్కొంటారు, ఇళ్ళ నుండి 2-3-4 కిలో మీటర్ల దూరాన్నీ లెక్క చేయరు, వాతావరణ కాలుష్య నివారణ కోసం చెమటలు చిందిస్తారు, గట్టిగా ఆలోచిస్తారు! వేకువ శ్రమదానాన్ని తమ జీవితంలో భాగంగా మార్చుకొన్నదందుకే మరి!

          అలాంటి 2706* పని దినాల్లో ఈ మార్చి పదకొండో రోజొకటి! అందుకు గాను 4.18 కే 6వ నంబరు కాల్వ వంతెన దగ్గర చేరిన తొలి గుంపు 12 మందీ, క్రమంగా వచ్చి కలుస్తున్న మిగతా వాళ్లతో నారాయణరావు నగర్ దిశగా వెళ్లే పంట కాల్వ గట్టు రోడ్డు మీది కాలుష్యాల మీద యుద్ధం జరిపింది 18 మందీ!

          వంతెన క్రిందుగా ఆ కాల్వలో నీళ్ళూ – బురదా పెద్దగా లేవు గాని ప్రాత మురికి గుడ్డలూ, ఎక్కువగా చెత్తా, తక్కువగా ప్లాస్టిక్ వస్తువులూ – అన్నీ కలిపి డజను కు పైగా డిప్పల్నిండా సేకరించిన వారు ముగ్గురు.

          ఆ రోడ్డు మొదట్లో గేదెలు దిగేందుకో – బట్టలుతికేందుకోగాని- కోతబడిపోయింది. అక్కడి నుండి 50-60 గజాల వీధేమో మూత్రం కంపులు! వాటి మధ్యనే కార్యకర్తల గంటకు పైగా కృషి! కంట్లో పుల్లపడీ, కాలికి కత్తి తేలిగ్గా తగిలీ – ఇద్దరి కృషి కొనసాగింపు !

          వంతెన దాటి రోడ్డు తూర్పు మార్జిన్ ను 20 గజాల దాక శుభ్ర పరచిన ఇద్దరు బడి పంతుళ్ళూ, మళ్ళీ సిమెంటు కొట్ల దగ్గర రోడ్డును కప్పేసిన కృత్రిమ కాంక్రీటును బద్దలు కొట్టి – డిప్పల కెత్తి – కొన్ని రోడ్డు అంచుల్ని గట్టి పరిచి, అసలా రోడ్డెంత వెడల్పో చూపి, ఊడ్చి నిగ్గు తేల్చిన సుందరీ కర్తలూ!

          ఇవన్నీ వ్రాస్తే చదివే వాళ్లకేమో గాని, వేల కొద్దీ రోజులుగా “ ఏమంత అందంగా, హుందాగా, పరువుగా” కన్పించని ఈ మురికి పనులు దగ్గరగా చూసే నాకు మాత్రం ఎంతో అందమైన – ఊరి ప్రతిష్టను పెంచుతున్న – ఏ ఇతర ఊళ్లలోనూ కనిపించని-పుణ్య కర్మల్లాగే – మహత్కార్యాల్లాగే కనిపిస్తుంటాయి!

          6.30 వేళ – ఒక హోల్ సేల్ వ్యాపారి – షణ్ముఖ శ్రీనివాస నామధేయుడు ప్రకటించిన, మిగిలిన వారు పునరుద్ఘాటించిన గ్రామ స్వచ్చ- సుందర సాధక నినాదాలతో కృషి సమీక్షా సమావేశం ముగిసింది.

          రేపటి వేకువ మన కలయిక బెజవాడ దారిలోని 6 వ నంబరు కాల్వ వంతెన దగ్గరేనని నిర్ణయమై పోయింది!

        గ్రామం వెలవెల పోవును!   

మంత్రాలతో డ్రైను సిల్టమాంతంగా తొలగి పోదు

ఊక దంపు మాటలతో ఊరి కసవు మాయమవదు

పబ్లిక్ – ప్రైవేట్ స్థలాలు చిట్కాలతొ బాగుపడవు

శ్రమదానమె లేనప్పుడు గ్రామం వెలవెల పోవును!   

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   11.03.2023.