2707* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవచ్చా?

                            ఈ శ్రమదాన నివేదిక 2707* వ నాటిది!

          ఆదివారం (12.03.2023) వేకువ తలా 100 నిముషాల సగటున జరిపినదీ – 30మందికి సంబంధించిన మొత్తం 3000 నిముషాల కృషి! మరి వీరిలో షష్ట్యబ్ది దాటిన 100 మందీ, ఐదుగురు మహిళామతల్లులూ, ముగ్గురు వైద్యులూ, ఇంకా బడి పంతుళ్ళూ, రైతులూ, వ్యాపారులూ వగైరా!

          2-3 ఊళ్ల నుండి వాళ్లు చేరుకొన్నది బెజవాడ బాటలోని 6 వ నంబరు కాలువ వంతెన దగ్గరకు! అంతు చూసింది 4 చోట్ల విస్తరించిన కశ్మలాల్ని! ప్రోగులు బడ్డ అన్ని రకాల తుక్కుల్నీ ట్రాక్టర్ లో కెక్కించి, తరలించిందేమో చెత్త కేంద్రానికి!

          విడివిడిగా నాలుగు స్థలాల స్వచ్చ- శుభ్ర-సుందరీకరణ కృషి విషయాల్ని క్రోడీకరిస్తే:

1) పంచ సంఖ్యాక సుందరీకర్తల ప్రయత్నం మరొక మారు వంతెన – స్మృతి వనాల నడుమ రహదారికే పరిమితమయింది. “3 రోజులుగా చెమటలు చిందించి, మనసులు పెట్టి చాలా బాగా ఈ 100 గజాల రోడ్డును తీర్చిదిద్దారే” అని మన బోటి వాళ్లకనిపిస్తుంది గాని- ఇంకా ఏ చిన్న లోటు పాట్లున్నదీ, ఏ ప్రయాణికుడైనా తప్పనిసరిగా ఆగిచూసి మెచ్చేలా ఏమి చేయవలసిందీ ఆ బృందానికే తెలుసు!

2) నిన్న కష్టించిన కృషికి పొడిగింపుగా – వంతెనకు తూర్పు బాటలో కృషి చేసిన 16-17 మంది సంగతి వేరు! కాలువ దక్షిణంగా, సైడు కాలువ గట్టున అంతా ఎగుడు దిగుళ్ల – మట్టి పెళ్లలు – ఉచ్చ మడుగులు! వెలుతురు వచ్చాక కనిపించిన కొన్ని ‘కళ్ళాలు’! అందుకని అక్కడి ప్లాస్టిక్ లు ఏరక, ముళ్ళ – పిచ్చి మొక్కల్ని తొలగించక – దారిని విశాల పరచక – వదిలేసే రకాలు కాదు గదా స్వచ్చ కార్యకర్తలు?

3) తమ అంచనా మేరకు ఆ నారాయణ రావు నగర్ వీధి శుభ్ర పడ్డాక – వాటిని ట్రాక్టర్ లో లోడు చేశాక – ఈ కార్యకర్తలే మళ్ళీ బెజవాడ రోడ్డులో వంతెన – చిన్న కార్ల షెడ్డు ల మధ్య, డ్రైను కొంతా, వీధి మార్జిన్లు కొంతా, చెట్ల కొమ్మల్ని అదుపులో ఉంచిన కృషి కొంతా సాగించారు! గ్రామ దేవత ఊరేగింపు బళ్ళూ, బస్సుల – ట్రాక్టర్ల రొదలూ వారి ప్రయత్నాలకు కొంత ఆటంకాలు కల్పించక పోలేదు!

4) 6.00 కు పని ముగిశాక – మళ్ళీ 15మందికి పడమర వైపు పంట కాల్వ గట్లు నచ్చక – తమ సమయాన్ని పావు గంట పాటు పొడిగించి, ఉభయ దరుల్నీ 20 గజాల బారునా శుభ్ర పరిచారు. నీళ్లు చేరినవి గాని- లేకుంటే కాల్వలో రకరకాల కశ్మలాలకూ మూడి ఉండేది!

          మనలో చాలామందిమి పెద్ద వాళ్లు చీపుళ్ళతో వీధులూడ్చే ఫోటోల్ని చూస్తుంటాం! అప్పుడప్పుడూ అనివార్యంగా టీవీలో నాయకుల సామాజిక బాధ్యతా ప్రసంగాలూ వింటుంటాం! ఎండనక –వాననక, పగలూ-రేయీ పాటింపక- ఒకటి కాదు, వందకాదు 2707* వేకువ సమయాల వాస్తవిక శ్రమ వేడుకను మనం తప్ప ఎవరూ చూసి ఉండరు!

          కాఫీల సమయం దాటాక – వంతెన ప్రక్కనే జరిగిన శ్రమ సమీక్షా కాలంలో– ధ్యాన మండలి ప్రముఖుడొకాయన(వేంకట రత్నం)- తన మనుమడు ‘ దిలీప్’ తో సహా నేటి శ్రమ వేడుకలో పాల్గొన్నాక – మూడు మార్లు స్వచ్చ- సుందరోద్యమ సంకల్ప నినాదాలు ప్రకటించగా,

          ఒక స్వచ్చ వైద్యుడు – చెన్నై, భాగ్యనగరాలకు చెందిన పర్యావరణ హితంకాని వేడుకల్ని ప్రస్తావించి, క్రొత్త రకం ఫ్లూ జ్వరాల్ని విశ్లేషించగా, నేటి శ్రమదాన కార్యక్రమం ముగిసెను.

          బుధవారం నాటి కృషి కూడ ఇదే బెజవాడ రహదారి వంతెన కేంద్రంగానే ఉండగలదు!    

       ఉదయ కాల- మంత్రం జాల

ఇది స్వచ్చ ప్రయోగ శాల- సమాజ బాధ్యతా హేల

అన్ని గట్టి అడ్డంకుల నధిగమించి కొనసాగుచు

జనం కొరకు – జనం నడుమ జరిగే శ్రమదాన లీల

ఉదయ కాల- మంత్రం జాల – స్వచ్చోద్యమ ప్రగతి శీల  

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   12.03.2023.