2708* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవచ్చా?

2708* వ రోజుకు సంబంధించిన శ్రమదానం!

            ఇది సోమవారం - (13.3.23) అనగా చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదానంలో గ్రామ భద్రతా దళం రోజున్నమాట! లిఖితేతర రాజ్యాంగం లాగే ఇదీనూ! అంటే - ఆరేడుగురు ఔత్సాహిక కార్యకర్తల బరువు పనుల సంప్రదాయమన్న మాట!

            సోమ - మంగళవారాల్లో ఈ టీమ్ అంతకుముందే గుర్తించిన - కొన్ని జరూరు పనులు రోడ్ల గుంటలో, వీధుల్లో పడిన రద్దో, బాటల మీదకి చొచ్చుకొని వస్తున్న చెట్లకొమ్మలో, బొత్తిగా నడవలేక - కుంట లేక కంపు గొట్టే మురుగు కాల్వలో ఈ రెండు రోజుల్లో ఈ ముఠా చక్కబెట్టుతుంది!

            ఈ వేకువ కూడ ఈ బృందం పోస్టాఫీసు వెనుక భాగపు ఇరుకు సందులో 4.20 కే ప్రత్యక్షమైంది. అందులో తొలి సభ్యులు 5+1 మందీ, మలి కార్యకర్తలిద్దరూ కాక ఇంకాస్త ఆలస్యంగా - వేకువ నడకలో భాగంగా వెళ్లి కలిసిన ఇద్దరమూ - అక్కడికి లెక్క 10 మంది!

            ఆ మారుమూల సందులో ఉన్నది - కట్టబోతున్న మాధురి - ప్రభాకర్ ల ఇల్లు! అక్కడ చేరింది పునాదుల మిగులు మట్టి! దాని మీద పడింది స్వచ్ఛ కార్యకర్తల కన్ను! సదరు మన్ను గుట్టనూ, ఇసుక - దుమ్ము మిశ్రాన్ని ముప్పావు గంట పాటు డిప్పల్తో ఎత్తి, గురవారెడ్డి టాటాఏస్ లో నింపుకొని, మళ్లీ ఈ బలగమంతా - 2 కిలోమీటర్ల దూరంలోని గాంధీ స్మృతి వనం దగ్గరకు చేరడం!

            ఆ వనం గేటు వెలుపల రంగులద్దిన కుండీల్లో ఒక క్రమ పద్ధతిలో మట్టినీ ఇసుకనీ పొరలుగా నింపడంతో నేటి స్వచ్చ - కార్యకర్తల ఆలోచన కార్యరూపం దాల్సింది.

            గాంధీ స్మృతి వనానికిది బాహ్య ద్వార అలంకరణం! ఆ కుండీల్లో రేపో మాపో రాబోయేవి అందమైన పూలమొక్కలు కాబోలు!

            నేటి కార్యక్రమానికి కొసమెరుపుగా BDR ధ్వనించిన సుందరోద్యమ నినాదాలు!

            పర్యావరణ మేమగునిక?

ఉత్సవాల టపాసులూ, వాహన కాలుష్యాలూ

అవి చాలక అడుగడుగున ప్లాస్టిక్కుల పెనుగుట్టలు,

చెవులు పగులు పెను మ్రోతలు, ఆలయాల మైకు రొదలు

పర్యావరణ మేమగునిక? బ్రతుకుల స్వస్తత ఎక్కడ?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   13.03.2023.