2709* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవచ్చా?

2709* వ రోజుకు చేరిన శ్రమదానం!

            సంఖ్య మంగళవారం (14/3/23) నాటిది! చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమంలో అది చివరి సంఖ్య కాదు - కారాదనేది ఊరిలో అధిక సంఖ్యాకుల కోరిక! స్వచ్ఛ కార్యకర్తల దృఢ సంకల్పం కూడా అదే!

            ఊళ్లో ప్రతి వార్డు ఓటర్లూ చైతన్యవంతులై - సక్రమంగా ఎన్నికలు జరిగి - ఎప్పటికప్పుడు మరింత మేలైన ప్రజా ప్రతినిధుల్ని తెచ్చుకొని వాళ్ళు కూడ తమ తమ వార్డుల్లో స్వచ్ఛ కార్యకర్తలుగా మారి - డ్రైన్లు బాగుపడి, వీధులు పరిశుభ్రపడి, చెట్ల పచ్చదనాలూ, అడుగడుగునా పూ బాలికల పలకరింపుల్తో అన్నీ గంగులవారిపాలెం రోడ్లుగా మారినపుడు - ఆహ్లాదం, ఆరోగ్యం అడ్రస్ లన్నీ చల్లపల్లోలో చేరినపుడు....

            అప్పుడు మాత్రమే స్వచ్ఛ కార్యకర్తల నిత్య శ్రమదానానికి చివరి రోజు కావాలి! అప్పటి దాక చల్లపల్లి స్వచ్చోద్యమానికి తెర పడరాదు!

            ఈ వేకువ కూడ 4.30 కు ముందే ఏడుగురూ, కొన్ని నిముష క్రమాన ముగ్గురూ గ్రామ 3 రోడ్ల ముఖ్య కూడలిలో ప్రత్యక్షం కావడమూ - ఇటీవల ఏమంత చురుగ్గా పాల్గొనలేని ఉస్మాన్ షరీఫ్ (ట్రాక్టరు పైన నిలబడి మట్టి సర్దుతున్న మానవుడే) అభ్యర్ధనతో అక్కడి దుకాణ సముదాయం దగ్గరి మట్టిని త్రవ్వి, డిప్పలతో మోసి, గ్రామ అవసరాల కోసం డంపింగ్ కేంద్రం దగ్గరకు చేర్చి నిల్వ చేయడమూ.... అన్నీ స్వచ్ఛ - సుందరోద్యమ శాస్త్రోక్తంగా జరిగిపోయాయి!

            చల్లని వేకువలో కూడ చెమటలు పట్టి - సీసాల కొద్దీ నీళ్లు త్రాగుతూ - ఊరంతటి ప్రయోజనం కోసం ఇలా శ్రమించిన ఏడెనిమిది మంది రెస్క్యూ దళమూ, ఈ పనుల్ని చూస్తూ కూడ పట్టించుకోక పాల్గొనక దూరంగా వెళ్తున్న గ్రామస్తులూ.... అదంతా ప్రతిదినమూ జరిగే తంతేననుకోండి!

            నేటి నినాదాలు ధ్వనించిన వంతు గంధం బృందావన కుమారుడిది!

            రేపటి వేకువ కార్యకర్తల రాకకు వేచి ఉన్నది బెజవాడ రోడ్డులోని మెకానిక్ షెడ్డు ప్రాంతం!

            స్వచ్ఛతకై అనుక్షణం

అనుక్షణం స్వచ్ఛతకై ఆరాతీసెడి వాళ్ళు

అను దినమూ గ్రామ సమస్యలకై స్పందించు వాళ్ళు

నిద్రలోను గ్రామస్తుల భద్రత చర్చించు వాళ్లు

ఎవరు వాళ్లు? స్వచ్ఛోద్యమ కర్తలుగా కింకెవ్వరు?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   14.03.2023.