2710* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు.

నేటి శ్రమదాన పనిదినాల సంఖ్య 2710*!

            చల్లపల్లి పరిశుభ్ర సుందరోద్యమంలో బుధవారం (15-3-23) కొండగుర్తన్న మాట! నేటి సామాజిక బాధ్యతలకు పూనుకొన్న కార్యకర్తలు 29+3 మంది - (చివరి సంఖ్య ట్రస్టు విధులకు హాజరౌతూ కొద్దిసేపు శ్రమదానానికి పాల్పడ్డ ట్రస్టు కార్మికులది!) ఈ ఉదయం పనివేళ కూడ 4.19 - 6.15 మధ్యనే!

            నారాయణరావు నగర్ కు దారి తీసే 6 వ నంబరు కాల్వ ఉత్తర గట్టును మాత్రం శుభ్ర - సుందరీకరించక ఎందుకు వదలాలి?’ అని కొందరు కార్యకర్తలు కత్తులు - దంతెలు - డిప్పలు వంటి పనిముట్లతో బాగా ఎగుడుదిగుడుగా ఉన్న ఆ కాలిబాట మీదకు పోయారు. ఆ 70-80 గజాల దారికే డజను మంది శ్రమ సమర్పితమయింది!

            ఆ చాలీ చాలని వెలుతురులో - చెట్ల కొమ్మల్ని క్రమబద్ధీకరించి, చిన్న మొక్కల పాదుల్ని సవరించి, గడ్డి - పిచ్చి మొక్కల్ని ఖండించి, ఒకాయనైతే జోడు కత్తులుపయోగించి, పుట్టుకొచ్చిన వ్యర్ధాల్నీ - ప్లాస్టిక్, గాజు బుడ్లనీ వింగడించి గంటకు పైగా అసలదొక స్వచ్చ సుందర మాలోకం అనుకోండి! ఆ పిచ్చి మాలోకంలో పెద్ద డాక్టర్లైనా - 75 ఏళ్ల పెద్దరికాలైనా - సర్పంచైనా అందరిదీ ఒకే జాతి - ఒకే కులం - ఒకే మతం! స్వచ్చ సుందర కార్యకర్తల జాతన్న మాట!

            అక్కడికి కొంత దూరంగా - బెజవాడ రోడ్డు మీద – ‘ఈ కులంవాళ్లే ఆరేడుగురు! వాళ్ళదేమో సుందరీకరణంఅనే మతం! వాళ్లు పట్టుకొన్న రహదారి భాగం అంతకు ముందు కార్యకర్తలు ఒకటికి రెండు మార్లు పరిశుభ్ర పరచిందే! బోగన్ విలియా పూలతో - పచ్చదనం వెలి క్రక్కే గానుగ వంటి తామే నాటి పెంచిన చెట్లతో బాగా కనువిందు చేస్తున్న చోటే -  ఐనా అంతిమంగా ఈ ముఠా తుది మెరుగులు తప్పవు!

            5.40 దాటాక - వంతెన ఉత్తరపు బెజవాడ రోడ్డులో ఏడెనిమిది మంది కృషీ, మూడు చోట్ల వ్యర్థాల లోడింగు సందడీ మొదలయింది! 20 నిముషాలకు పైగా సదరు పని ఉత్సాహం కొనసాగింది!

            ఇవన్నీ నేను వ్రాస్తున్నానని కాదు, ‘జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యంమాధ్యమ దృశ్య చిత్రాల్లో ఎవరైనా పరీక్షించవచ్చు - రావాలనిపిస్తే ఏ గ్రామ పౌరుడైనా ఎంట్రీ ఫీజూచెల్లించకుండానే రేపటి నుండి పాల్గొనవచ్చు!

            నేను సైతం నా గ్రామానికి శ్రమదాన పూర్వకంగా ఉపకరిస్తున్నానుఅనే ఆత్మ సంతృప్తిని రుచి చూడనూ వచ్చు!

6.25 కు కాఫీల రుచి చూశాక - 6.40 దాక జరిగిన శ్రమ సమీక్షా సమయపు విశేషాలు:

1) వేంకటాపురోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయినీ, ఆదివారాల్లో కార్యకర్తలకు బలవర్దక పప్పుండల ప్రదాయినీ ఐన లంకే సుభాషిణి విస్పష్టం చేసిన గ్రామ స్వచ్చ సుందరోద్యమ నినాదాలూ,

2) చల్లపల్లి పురాతన ఆర్య వైశ్య భవనంలో మన ఆస్థాన గాయకునికి సేవా సింహాలసన్మానమూ,

3) నిన్నటి లక్ష్మీపుర వాస్తవ్యుడు బ్రహ్మేశ్వరుని, రోహిణి ఉద్యోగిని చెరో 5 వేల విరాళాలూ;

4) నిన్నటితో ముగిసిన అధికారుల వ్యర్థాల నిర్వహణా తర్ఫీదూ’, కేంద్రం నుండి చల్లపల్లి సందర్శనకు వస్తున్న ఆ శాఖా పెద్దల సమాచారమూ;

            రేపటి వేకువ శ్రమదాన సన్నద్ధత కూడ బెజవాడ బాటలోని చిన్న కార్ల షెడ్డు వద్ద నుండే!

            అంతులేని అగాధాలలో

అందం, సౌకర్యంతో అలరిస్తవి గాని మనను

జీవకోటి మనుగడకే పెను సవాళ్లు ప్లాస్టిక్కులు

భూతలాల - జలరాశుల ముంచును కాలుష్యంలో

అంతులేని అగాధాలలో నెట్టును మన బ్రతుకును!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   15.03.2023.