2713* వ రోజు....... ....

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు.

అనుకోని సంఘటనతో 2713* వ నాటి శ్రమదానం!

            నేటి (మంగళవారం 21.3.23) వేకువ సైతం - ఇంకా 4. 19 ఐనా కాకుండానే - అదే గంగులవారిపాలెం వీధిలో తొలుత 7 గురూ, వెంట వెంటనే ముగ్గురమూ బండ్రేవుకోడు మురుగు కాలువ గట్టు మీద వీధి సుందరీకరణ కోసం చేసిన ప్రయత్నం.

            అనగా - బాటకు దక్షిణాన క్రమశిక్షణ లోపిస్తున్న - రోడ్డుపైకి దురాక్రమిస్తున్న మరో 3 - 4 చెట్ల కొమ్మల్ని శిక్షించి, అదుపు చేసే క్రమంలో ఆ చెట్టు కొమ్మే సగానికి పైగా కార్యకర్తలకి  - ఝలక్ ఇచ్చిన వైనం!

            4.30 నుండి కార్యకర్తల శ్రమదానం సాఫీగానే జరిగింది; 3 పెద్ద చెట్లకు నిన్నటిలా బోడి గుళ్లు కాక చక్కని క్రాపులు వేశారు. ఒక చెట్టు మీద ఎత్తుగా ఎండు కొమ్మను మాత్రం మోకు తగిలించి, ఆరుగురు కలిసి లాగి, విరిచేందుకు ఐదారు మార్లు బలాత్కారం చేసినా అది ఊడి రాలేదు; ఇక వాళ్ళు పంతం పట్టి - శక్తినంతా ప్రయోగించి లాగడమూ, ఫెళఫెళార్భటితో కొమ్మ విరిగి మూకుమ్మడిగా ఐదుగురు తూలి క్రింద పడిపోవడమూ  వెంట వెంటనే!

            పడిన చోట గులక రాళ్ళూ, ఎండుపుల్లలూ, చిన్న ముళ్లూ ఉండి, ఒకళ్ల మీద ఒకళ్లుగా ముగ్గురు పడడమూ - వారిలో ఒక కమ్యూనిస్టు వీధి కార్యకర్తకు బలంగా ఐదారు చోట్ల నెత్తురు రావడమూ, ఆ ఎగుడు దిగుడు చోట పైకి లేస్తూ ఇంకొకాయన తూలి పడడమూ వాట్సప్ మాధ్యమంలో కనిపిస్తే చూడండి!

            ఇవన్నీ స్వచ్ఛంద శ్రమదానంలో అప్పుడప్పుడూ జరిగేవే! ఇదేమీ అపశకునమో - దుర్ఘటనో కాదు; 23 నిముషాల్లో సంబాళించుకుని, చిన్న దెబ్బల్ని తడిమి చూసుకొని - వెంటనే మరో చెట్టు సుందరీకరణానికి పూనుకొన్నారు కూడ!

            ఇక - ఇప్పుడు చెప్పండి - వీళ్లని రెస్క్యూ టీమ్అనడం సమంజసమా కాదా!

            రేపటి మన శ్రమదానం విజయవాడ బాటలో  చిన్న కార్ల షెడ్డు కేంద్రం గానే జరుగవలసి ఉన్నది.

            ప్రారంభమె సంచలనం

ఒక అడుగుతొ ప్రారంభం ఉద్యమాలు ఏవైనా

ఏవి ఎప్పుడాగినవో - ఏవి ఎంత నిలిచినవో!

స్వచ్చోద్యమ చల్లపల్లి ప్రారంభమె సంచలనం

సుదీర్ఘ ఘన చరిత్రనూ చూచిన ఆశ్చర్యమే!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   21.03.2023.