2714* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు.

బుధవారం నాటిది 2714* వ ప్రయత్నం!

            22.3.23 - శోభకృత్ నామ సంవత్సర ఉగాది తొలి వేకువ - 4.19 నుండి గంటా ఏభై నిముషాల శ్రమ సందడి చేసిన కార్యకర్తలు 26 మంది! ఈ స్ఫూర్తి దాయక శ్రమదాన రంగస్థలం బెజవాడ రహదారిలోని చిన్న కార్ల షెడ్డు క్రొత్త భవన విభాగ సముదాయాల నడుమ! స్వచ్ఛ - శుభ్రతలు తిరిగి పొందిన బాట 130 గజాల మేర!

            ఎవరి ఇళ్లలో వాళ్లు తమ గ్రామ సామాజిక శ్రేయస్సుకై చేస్తున్నవి జపతపాలో, “సర్వే గ్రామ జనాః సుఖినోభవంతుఅనే తరహా ఆశీర్వచనాలో కావు! 3.30 కు మేల్కోని, 4.15 కే 2 - 3 కిలోమీటర్ల దూరం పయనించి, శ్రమదాన గమ్య స్థలం చేరుకొని, అత్యవసరాయుధాలు - అంటే చీపుళ్లు, గొర్రులు, కత్తులు ధరించి, డ్రైన్లలో బాట మార్జిన్లలో - ఉచ్ఛల, ఉమ్ముల జాగాల్లో అన్ని కశ్నలాలనీ విసుగు లేక తొలగిస్తున్న క్రియాశీలక కార్యకర్తల చర్యలివి!

            అవసరార్థం చెట్లెక్కే మురుగు తోడే - ముళ్ల, పిచ్చి చెట్లను తొలగించే - త్రాగి పడేసిన సారా బుడ్లను ఏరే - అడుగడుగునా వీధుల్ని సుందరీకరించే - తలపెట్టిన మహత్కార్యం కోసం దశాబ్దాల పర్యంతం శ్రమించే - విశిష్ట కార్యకర్తలు చల్లపల్లిలో కాక ఇంకెక్కడా కనపడకపోవచ్చు! ఎప్పుడో - ఎక్కడో నక్కను త్రొక్కి వచ్చిన ఊరై ఉంటుంది.

            ఇంకా ఇప్పటికీ స్వచ్ఛ సుందరోద్యమ సంబంధం పెట్టుకోని గ్రామస్తులైనా, బైట వాళ్ళైనా ఈ ఊరి ముఖ్య కేంద్రం నుండి బైటకు వెళ్లే 7 రోడ్లను బాగా పరిశీలిస్తే విశ్లేషిస్తే - తొమ్మిదేళ్లకు పైగా చల్లపల్లికే ప్రత్యేకమైన శ్రమదానోద్యమం విలువేమిటో ఫలమేమిటో ప్రతి గజం జాగాలోనూ ఇట్టే తెలిసిపోతుంది!

            దూషణ - భూషణ - తిరస్కార - పురస్కారాల కతీతంగా ఏకదీక్షతో లక్ష్యం దిశగా పురోగమిస్తున్న ఒక అరుదైన కృషి ఎందుకో అర్ధమౌతుంది!

- నేటి పాతిక మంది శ్రమదాతల్లో కనీసం 8 మంది బట్టలు చెమటతో తడిసిన విషయం గమనించాను - వాళ్లు పెద్ద డాక్ట రమ్మలో - సర్పంచమ్మలో పెద్దలో - పిన్నలో, డ్రైన్ల పిచ్చి పొదల్లో శ్రమించారో, రహదారి దుమ్ము దులిపి శుభ్రపరిచారో, పనేదైతే నేం వాళ్ళు తలా 110 నిముషాల పాటు తమ కోసం కాక, ఊరంతటి సౌకర్యార్ధం శ్రమించారు! బట్టలకూ, ఒంటికీ దుమ్మంటుకొన్నా - నిన్నటి పని వేళ స్వల్ప గాయాలైనా పట్టుదలతో వచ్చి చాతనైనంత పాటుబడ్డారు!

            రోడ్డు కిరుప్రక్కలా చెట్లను సుందరీకరించినా, ప్లాస్టిక్ తుక్కు లేరినా, ప్రోగు చేసినవన్నీ డిప్పల్లో కెత్తి ట్రాక్టర్లో సర్ది చెత్తకేంద్రానికి తరలించినా - అందరిదీ ఒకే గమ్యం! ఎన్ని రోజులు పట్టినా - ఈ బెజవాడ బాటను ఏ ఊళ్లోనూ లేనంత పరిశుభ్రంగానూ, ఆహ్లాదకరంగానూ మార్చాలనే పంతమే!

            6.30 సమయంలో జాస్తి ప్రసాద నామధేయుడు ముమ్మారు గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ సందేశ నినాదాలను ప్రకటించాక,

            కార్యకర్తలందరూ శోభకృత్ నామ ఉగాది పరస్పర శుభాకాంక్షల పిదప,

            DRK గారి ఈ నాటి శ్రమదాన వైఖరి సమీక్షా ప్రశంస ముగిశాక, అందరి గృహోన్ముఖ ప్రయాణం!

            రేపటి వేకువ కూడ ఈ రహదారి శుభ్ర - సుందరీకరణ నిమిత్తం మనం కలుసుకోదగింది అట్ట పెట్టెల మిల్లు గేటు దగ్గర!

            రెండు వారాల క్రిందట మనకోసం మనంట్రస్టుకు 10,116/- చందా ప్రకటించిన దాత శ్రీమాన్ గుత్తికొండ కోటేశ్వరరావు వాగ్దాన భంగం కానీయకుండా మేనేజింగ్ ట్రస్టీ గారికి ఆ మొత్తాన్ని చెల్లించారు.    

            ఆ అన్నిటి కతీతముగ

పదవులు, గుర్తింపు కొరకు - ప్రఖ్యాతిని ఆశించీ

చేసే శ్రమదానమైతే చెల్లిపోవునేనాడో

ఆ అన్నిటి కతీతముగ - అంతరాత్మ సంతృప్తిగ

సాగుతోంది తొమ్మిదేళ్ల స్వచ్చోద్యమ చల్లపల్లి!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   22.03.2023.