2715* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు.

విజయవాడ బాటలోనే మరొక శ్రమదాన యజ్ఞం - @2715*

            గురువారం (23-3-23) 4.18 బ్రహ్మముహూర్తాననే సదరు సవనం తొలుత డజను మందితోనూ, నెమ్మదిగా మరో 12 మందితో 6.10 దాక జరిగింది. 24 వేల మంది గ్రామస్తుల సౌకర్య, సౌలభ్య జీవనం కోసం 24 మంది పూనిన యజ్ఞ దీక్ష!

            దాని వేదికేమో మళ్లీ అట్టపెట్టెల మిల్లు - క్రొత్త అపార్ట్మెంట్ల నడిమి ప్రాంతమే! అక్కడ రహదారికి తూర్పు పడమరలుగా లోతైన మురుగు కాల్వలే!

            డ్రైన్లలో ఊరి మురుగు పారడం సాధారణ పద్ధతి; ఏ ఊరి - ఏ ప్రవహించని మురుగులో దినదిన ప్రవర్ధమానమయేవి దోమలే! ప్రస్తుతానికక్కడ నిలవ మురుగు కాదు గాని - అందలి అవశేషాలైన పుల్లా పుడకా, నీళ్లు - మద్యం సీసాలూ, కాగితం పొట్లాలూ పెద్ద మోతాదులోనే ఉన్నవి!

            మరి - రోడ్ల శుభ్రతనూ, డ్రైన్ల మురుగు వ్యవస్థనూ పర్యవేక్షించి, పరిరక్షించవలసింది పంచాయతీ సంస్థ! అది నిర్వీర్యమై - వ్యవస్థలు అస్తవ్యస్తమైనపుడే చల్లపల్లిలోలాగా కొందరు సామాజిక బాధ్యులైన కార్యకర్తల అవసరం పడుతున్నది!

            అలా శ్రమదాతల చేయూత ఈ గ్రామంలో తొమ్మిదేళ్ళుగా కొనసాగుతూనే ఉన్నది! గ్రామానికే కొంతో ఉపకరిస్తున్నామనే ఉత్సుకతతో వేకువ 4. 30 కాకముందే పాతిక - ముప్పై - నలభై మంది ఏదో ఒక ప్రక్కన వీధులు శుభ్రపరచడమో శ్మశానాల నవీకరణమో - రహదార్ల హరిత సుందరీకరణమో రోడ్ల గుంటలు పూడ్చడమో తమ శక్తి వంచన లేకుండ చేసుకుపోతూనే ఉన్నారు!

            తలపెట్టింది మంచి పని గనుక - మధ్యలో ఆపరానిది కనుక ఆ పని తమకు ఏ నాటికానాడు మనః తృప్తిదాయకం కనుక - ఇంత సుదీర్ఘకాల శ్రమదానం ఇక్కడ పకడ్బందీగా సాగుతున్నది?

ఈ వేకువ దాదాపు రెండు గంటలు కూడ రెండు డజన్ల కార్యకర్తలు

1) రోడ్డు ఊడ్చి,

2) డ్రైన్లలో పిచ్చి - ముళ్ల మొక్కలు తొలగించి,

3) పర్యావరణ నష్టదాయకమైన ప్లాస్టిక్ - గాజు వస్తువుల్ని ఏరి - 

4) ఇలా వచ్చిన వ్యర్థాలన్నిటినీ ట్రాక్టర్లో నింపుకొని చెత్త కేంద్రానికి చేర్చి,

5) కొసరుగా ముగ్గురు సుందరీకర్తలు రోడ్డు పడమటి చెట్లనూ, పూల తీగల్ని క్రమబద్దీకరించి,

6) అసలీ పనులన్నీ గబగబా వచ్చిపోతున్న ఇసుక బళ్ల, గడ్డి బళ్ల, బస్సుల, ట్రాక్టర్ల, ద్విచక్ర వాహనాల సందడి నడుమనే పూర్తి చేసి

            6.20 సమయంలో భోగాది వాసు నాయకత్వంలో గ్రామ శుభ్ర - సుందరోద్యమ నినాదాలు ప్రకటించి,

            ఈ చిరకాల నిస్వార్థ శ్రమ - సమయదానాల్ని చల్లపల్లి స్వచ్చోద్యమ సంచాలకుడు సహర్షంగా సమీక్షించి, కోడూరు వేంకటేశ్వర నామకుడు పెరట్లో కాయించి, తెచ్చిన ఉసిరికాయల్ని తలా దోసెడు స్వీకరించి, 6.40 కి గృహోన్ముఖులయ్యారు!

            రేపటి మన శ్రమదాన రంగస్థలం బెజవాడ బాటలోని నేటి కార్యక్రమం పూర్తయిన చోట వద్దనే!

            తాత్త్విక ధోరణులు హెచ్చు!

చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదానం గమనిస్తే

ఆ వేకువ సామూహిక సాహసాలు తిలకిస్తే

సత్యమేది? సవ్యమేది? సామాజిక బాధ్యతేది?” అనే

తర్కవితర్కాలు వచ్చు! తాత్త్విక ధోరణులు హెచ్చు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   23.03.2023.