2716* వ రోజు....... .......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు.

2716* వ నాటి శ్రమదానోత్సవం!

            ఆ ఉత్సవ సమయం- శుక్రవారం (24.3.23) వేకువ 4 .15 నుండి ; సదరు ఉత్సవోద్విగ్నులు 20 మందైతే- ఆ సంఘటనా స్థలం బెజవాడ బాటలోని క్రొత్త అపార్ట్మెంట్స్ - ఒకానొక మెకానిక్ షెడ్ల దగ్గర!

            అందు మూలంగా బాగుపడినవి తూర్పు, పడమరల ఏభయ్యేసి గజాల మురుగు కాల్వలూ ; ఇద్దరు సుందరీకర్తల కృషితో పశ్చిమాభి ముఖంగా 10 పెద్ద, చిన్న చెట్లు కూడ అనవసరమైన కొమ్మలు కోల్పోయి కాస్తంత మర్యాదా మప్పిదాలు నేర్చుకొన్నాయి.!  అందుకోసం వాళ్ళు 2 మార్లు పని విరమణ ఈల మ్రోగినాకాఫీల సమయం దాటుతున్నా తీరిక లేకుండ శ్రమిస్తూనే ఉన్నారు.

            దారికి పశ్చిమాన డ్రైనులో నలుగురి శ్రమదానం అవశ్యం ప్రస్తావనార్హం! ఇప్పుడిప్పుడే గ్రీష్మం కుదురు కొంటున్న రోజున  - అటు వాతావరణమూ - ఇటు మితిమీరిన శ్రమ బడలికా -  ఫలితంగా చెమటతో తడిసి ముద్దైన బట్టలూ - గంటన్నర కాయ కష్టంతో శరీరాలు బడలినా, తమ కారణంగా పరిశుభ్రంగా మారిన ప్రాంతాన్ని చూసుకొన్న సంతృప్తీ - ఇవీ 6.10 సమయానికి వాళ్ల వైఖరి!

            తూర్పు ప్రక్క డ్రైనులో దిగి రకరకాలుగా శ్రమించిన డజను మంది కథ వేఱు! అక్కడ కత్తుల రాపిడులూ - దంతెల లాగుడులూ - తుక్కును డిప్పల్లో నింపుడులూ - అప్పుడప్పుడు జోకులు ప్రేల్చుడులూ - ట్రాక్టరు బండిలో వ్యర్థాల ని౦పుడులూ- పదేపదే మంచి నీళ్లు త్రాగుడులూ...! (ఎన్నాళ్లు - ఎన్నేళ్లు చూసినా నాబోటి వాడికేమో ఈ మురికి చెమట కంపు పనుల్ని ఇంకా చూస్తూనే ఉండాలనిపించడాలూ!)

            ఇంకొక ఆసక్తికర సన్నివేశం కూడ ఉన్నది. అసలు క్రింద నుండి అందించే చెత్తను ట్రాక్టరులో సర్దే పని హక్కుదారుడు కమ్యూనిస్టు వీధి నివాసుడైన ఒక రైతు ! ఈ వేకువ సైతం ఆపనిలో ఉంటే- తన నడుము బెల్టు త్రెగి, ఇంటికెళ్లిరావలసి రాగా - ఆస్థానాన్ని భర్తీ చేసినదెవరు? 15 ఏళ్లుగా ఆస్పత్రి నర్సుగా ఉద్యోగిస్తున జ్యోతి అనే యువతి!  తన వంటిల్లు సర్దినంత శ్రద్ధగా దిక్కుమాలిన - వ్యర్థాలన్నిటినీ ఆమె సర్దిన తీరు పదే పదే ప్రశంసార్హం! 

             ఇలాంటి చిన్న సాహసాలూక్రమం తప్పని సమయ - శ్రమ దానాలూఅడక్కుండానే గ్రామానికి స్వచ్చ -  శుభ్ర - సౌందర్య ప్రదానాలూ .... ఇవన్నీ చల్లపల్లికే సాధ్యం!

            6. 26 వేళ గ్రామ స్వచ్ఛ- సుందరోద్యమ సంకల్ప నినాదాలను ముమ్మారు ధ్వనించిన వ్యక్తి  శ్రీమతి పిండి నాగ జ్యోతి!

            కార్యకర్తల శ్రమనూ, అభిప్రాయాలనూ సమన్వయ పరచి, సమీక్షించినది డాక్టరు దాసరి రామకృష్ణ గారు!

            రేపటి శ్రమదాన స్థలం కూడ బెజవాడ బాటలో - నేడు ఆగి శ్రమించిన చోటే అని ప్రకటించినది - అందరూ!

        ఎట్లు నిద్రపట్టగలదు?

స్వచ్చోద్యమ సంగీతం చవి చెవులకు సోకనపుడు - 

ప్రతి వేకువ పరస్పరం అభివాదము లందనపుడు-

వీధో-రహదారో - మురుగు కాల్వొ చక్కబెట్టనపుడు

 ఈ స్వచోద్యమ కారుల కెట్లు నిద్రపట్టగలదు?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   24.03.2023.