2721* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు.

ఇది 29-3-23 (బుధవారం) నాటి (2721*) స్వచ్యోద్యమ సమాచారం!

            2721 వేకువ సమయాలు గడిచినా శ్రమదానాని కారంభమే గాని, కనుచూపు మేరలో అంతం కనిపించడం లేదు; ఏనాడైనా పాతిక - ముప్పై - నలభై మంది గ్రామ సౌందర్యకారులకు అలుపూ - విసుగూ లేవు; ఊరి స్వచ్చ - శుభ్రత అవగాహన లోపించిన కొందరు గ్రామస్తుల వీధి కశ్మల చర్యలాగనూ లేదు!

            ఎక్కడ రోత - కశ్మలం అసౌకర్యం - అశుభ్రం ఉండునో అక్కడ స్వచ్ఛ కార్యకర్తలుందురుఅనే సూత్రం ప్రకారం మొత్తం 100 కు పైగా కార్యకర్తల నుండి కుదిరినంత మంది అత్యవసరమైన వీధిలో ప్రత్యక్షమౌతారు. సుమారు 2 గంటలు ఋతువుల్ని బట్టి మంచులోనో వానలోనో ఉక్కపోతలోనో పాతుబడుతూనే ఉంటారు! తమ ఊరి బాగు కోసం కష్టించామనే సంతృప్తి పొందే అల్పసంతోషులన్న మాట!

            ఈ వింత మనుషులకు కనపడ్డ ప్రభుత్వ జాగాల్ని కబ్జా చేయాలనే స్పృహే ఉండదు! ప్రచారం పిచ్చీ కనపడదు! సమాజంలో గౌరవ స్థానంలో ఉండి కూడ ఈ మురికి - రోత - పారిశుద్ధ్య పనులేమిటిఅనే న్యూనతా లేదు! ఎన్ని లక్షల పని గంటల శ్రమకైనా వెనకాడిందీ లేదు! సద్విమర్శలకు తప్ప - అసత్యారోపణలకు స్పందనా ఉండదు!

            కర్మణ్యే వ్యాధి కారస్తే - మాఫలేషు కదాచన...” (సత్కర్మ లాచరించు - కాని ఫలితం పట్ల చింతించకు ...”) అనే గీతా వాక్యం స్వచ్ఛ కార్యకర్తలకు వర్తిస్తుంది.

            అన్ని రోజుల్లాగే ఈ బ్రహ్మముహుర్తాన సైతం 22 మంది బెజవాడ బాటలోనే నిర్ణీత బాలాజీ భవన విభాగాల దగ్గర కలుసుకొన్నారు;

చేతొడుగులూ, అవసరానుగుణంగా కత్తి, దంతె, డిప్ప, పార వంటి సాధనా సన్నద్ధతతో

1) బాటకు పడమర దిక్కు పెద్ద ఖాళీ స్థలంలోని అవసరమైన కొంత భాగాన్ని

2) తూర్పు వైపు మురుగు కాల్వనూ

3) బాలాజీ అపార్ట్మెంట్ల ఉత్తరం దాక రహదారిని

            100 నిముషాల పాటు శుభ్రపరిచారు. రెండు గోనె సంచుల ప్లాస్టిక్ - వ్యర్థాలూ, ట్రాక్టర్ సగానికి చెత్తా చెదారాలూ, గడ్డీ గాదమూ ఈ నాటి స్వచ్ఛంద శ్రమదాన ఉత్పత్తులు!

            ఎక్కువ మందికి చెమటతో బట్టలు తడవడమూ, దుమ్ము కొట్టుకోవడమూ, ఉక్కపోతతో మంచి నీళ్ల వినియోగమూ - అందరికీ అలసటలూ - కనిపించిన దృశ్యాలు!

            ఊరంతటి సుస్థితి కోరి శ్రమించింది ఇరవై ఇద్దరే కావచ్చు - ఈ ఉదయం వాళ్ల ప్రయత్నం వల్ల ఊరడిల్లింది 120 గజాల రహదారే - అనుకోండి - ఉభయ అపార్ట్మెంట్ల నుండి 0మందే స్వచ్ఛ కార్యకర్తల్తో చేయి కలిపారనుకొందాం ఒక హద్దు గీసుకొని, 3 - 4 వారాలుగా శుభ్రపడిన దక్షిణ భాగాన్నీ, మిగిలిన ఉత్తరం దిశ రహదారినీ, పోల్చి చూస్తే తెలియడం లేదా - ఒక సామూహిక శ్రమదాన ఫలితమేమిటో?

            6.25 కాఫీల కార్యక్రమం గడిచి, సమీక్షా సమావేశంలో తొలుత మాలెంపాటి వైద్య వృద్ధుని స్వగ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్య సాధక నినాదాలూ, నేటి పని తీరు ప్రస్తావనా జరిగి,

            రేపటి రహదారి బాగుదల కోసం కలువదగిన చోటు కూడ బాలాజి భవన సముదాయమనే నిశ్చయించారు!

            శివరామపురంకు చెందిన విశ్రాంత ఉద్యోగులు శ్రీ, శ్రీమతి రావెళ్ళ శివరామకృష్ణయ్య, గుత్తికొండ లీలావతి గారలు చల్లపల్లి స్వచ్చ సుందరోద్యమ ఖర్చుల నిమిత్తం ఈ రోజు మేనేజింగ్ ట్రస్టీ గారికిచ్చిన 10,000/- విరాళానికి మన ధన్యవాదాలు.

            సంచలనం ఇది!

ప్రతిఫలితం శ్రమతోనే వస్తుందని తెలుసుకొనీ

అడ్డదారి ఫలితాలను అసలే నమ్మొద్దనుకొని

వ్యక్తికి బహువచనం శక్తేనని గ్రహించుకొన్న

తొమ్మిదేళ్ల స్వచ్ఛ - సుందరోద్యమ సంచలనం ఇది!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   29.03.2023.