2722* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు.

ప్రశంసార్హమైన 2722* వ నాటి శ్రమ సంతర్పణ!

            గురువారం (29.3.23) వేకువ 4.20 కే - అది అనుకొన్న చోటే - అనుకొన్న కన్న ముందే మొదలయింది! 6.05 దాక సదరు సంతర్పణదారులు 25+1 మంది! నిన్న బాగుపడిన అపార్ట్మెంట్ల ఎదుటి నుండి మరొకమారు ప్రారంభించి, ఉత్తరాభిముఖంగా నారాయణరావునగర్ - ఆటోనగర్ 3 అడ్డ రోడ్ల దాకనూ, కొసరుగా పడమటి అడ్డ రోడ్డును కొంత మేరా ప్రయత్నించారు!

            నేనేమిటి - ఎవరు వచ్చి, అరగంట సమయం ఈ వేకువ శ్రమ సందడిని దగ్గరగా పరిశీలించినా ముందు అనుమానిస్తారు. తరువాత ఆశ్చర్యపోతారు; అప్పుడు ఈ గ్రామ వీధుల్లో -  ఇలాంటి అద్భుతమొకటి తొమ్మిదేళ్లుగా ప్రదర్శితమౌతూనే ఉన్నదనీ, అది వినా ఈ రోజుల్లో ఊరి మేలుకు గత్యంతరం కానరాదనీ, విచక్షణతో - వివేచనతో తప్ప గ్రుడ్డిగా జరిగే శ్రమదానం కానే కాదనీ విధి లేక అంగీకరిస్తారు!

            వారిలో కొందరనుసరిస్తారు, మరికొందరనుకరిస్తారు, ఐతే అందరూ మెచ్చుతారు, సకృత్తుగా ఏ ఒకరిద్దరో ఈ నిస్వార్థ శ్రమదానంలోనూ  క్రొత్త కోణాలన్వేషిస్తారు! సెబాష్అన్నా, రంధ్రాన్వేషణ చేసినా ఈ స్వచ్ఛంద శ్రమదానోద్యమం పురోగమిస్తూనే ఉంటుందని కూడ చివరికెవరైనా అంగీకరిస్తారు!

            9 ఏళ్లనాడు జనవిజ్ఞాన వేదికబాధ్యులు మేమొక ఏడాది పాటు చీపుళ్ళు పట్టి ఊరి వీధులు శుభ్రం చేస్తామంటే’ – అదేదో మాట వరస కన్నదనీ, చాల మంది చాలమార్లు చేసే ప్రకటననీ ఎక్కువ మంది అనుకోలేదా?

            ఇక - కాలక్రమాన వందలూ, వేల రోజులుగా వాళ్ళూ, వాళ్ళకండగా నిలిచే ధ్యానమండలీ, లయన్స్ క్లబ్బులూ, వాసవీ వైశ్య సంఘమూ ఉషోదయ నడక మిత్రులూ, తదితర వివిధ సంస్థలు, వ్యక్తులూ శ్మశానాలనూ, బస్ ప్రాంగణాలనూ, గుడులనూ, బడులనూ, మురుగు కాల్వలనూ, బోసిపోయిన రహదార్లను బాగుచేసి, హరిత సంపద పెంచి, అడుగడుగునా సౌందర్య సాక్షాత్కారం చేయడం లేదా?

            మొక్క పోవని దీక్షతో ఊరిని తీర్చిదిద్ది, ఒక్కొక్కటిగా సౌకర్యాలు కల్పించి,

            సాధనమున పనులు సమకూరు ధరలోన

            విశ్వదాభిరామ! వినుర వేమ!

            అనే వేమన నమ్మకాన్ని నిలబెట్టడం లేదా?

            అంత చక్కని ప్రయత్నంలోనే - శ్రీరామనవమి పర్వదినమైనా సరే - ఊరు దాటి, 2-3-4 కిలోమీటర్లు ప్రయాణించి, పడమటి డ్రైనులో మురుగులోని, గట్టు మీది సకల వ్యర్ధాలను ఏరి, దురదమొక్కల్తో సహా గడ్డినీ తొలగించి, ఐదారుగురా గుట్టల్ని డిప్పల్తో అందించి - 

            ట్రాక్టర్ మీదికెక్కిన పసి మొక్కల పెంపకం/విక్రయదారుడు జాగ్రత్తగా రెండు బళ్ల చెత్తను ఒకే ట్రక్కులో కుక్కి

            బాట తూర్పు డ్రైనులోని, ప్రక్క సందుల్లోని పిచ్చి మొక్కల గుబుళ్ళనొక డజను మంది శుభ్రపరచి

            ఇద్దరు నర్సులు రహదారిని ఊడ్చి- ఊడ్చి

            అప్పుడిక అందరూ 6.10 కి చెమట మొహాలతో వచ్చి, మన్ను చేతుల్ని కడిగి, కొన్ని కబుర్లాడి, కాఫీలు సేవించారు గదా!

            6.25 కు సమీక్షా సమయానికి ముందు వామపక్షీయుడైన మధు తన 63 ఏళ్ల వయస్సును గడిచిన సందర్భంగా తన జననీ జనకులు యద్దనపూడి పూర్ణచంద్రరావు - బాలమ్మల జ్ఞాపకార్ధంగా స్వచ్చ - సుందరోద్యమానికి 1000/- సమర్పించారు!

            నిన్నటి 10 వేల స్వచ్చోద్యమ విరాళం కాక, రావెళ్ళ శివరామకృష్ణయ్య దంపతులు స్వచ్చ కార్యకర్తలనభినందిస్తూ ఈ ఉదయం తొలి విడతగా పప్పుండల పంపకం చేయించారు.

            నలత చెందిన DRK - పద్మావతి దంపతులీవేళ కూడ రాలేకపోవడమొక లోటు!

            రేపటి ప్రత్యూష పవనాల నడుమ మనం కలిసి శ్రమించవలసిన చోటు నేటి శ్రమదాన ప్రదేశం దగ్గరగా - బెజవాడ బాట యందే!

నిన్నటి మరొక విశేషంగా

            చల్లపల్లికే చెందిన పాలడుగు ఆనందకుమార్ గారి కుమార్తె అమెరికాలో ఉద్యోగిని కృష్ణ శ్రీ తన స్వార్జితమగు 50,000/- ను తన తండ్రి ద్వారా తనకెంతో ఇష్టమైన చల్లపల్లి స్వచ్చ సుందరోద్యమానికి సమర్పించడం.  

            కావా పెను సాహసాలు?

మురుగు ప్రవాహం నడిమిది మొట్టమొదటి సాహసం

శ్మశానమున రాత్రి వేళ శ్రమదానము ద్వితీయం

ఊరి వాళ్ల స్వస్తతకై, ఆహ్లాదాల కల్పనకై

కలుపేరుట - రోడ్లూడ్చుట - కావా పెను సాహసాలు?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   30.03.2023.