2723* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు.

మార్చి నెలాఖరు నాటి గ్రామ స్వఛ్ఛ - సుందర కృషి - @2723*

            శుక్రవారం వేకువ 4.20 కే - సగం మందితో ప్రారంభమైన ఆ ప్రయత్నం 6.10 దాక సాగింది. నేటి మొత్తం శ్రమ వీరుల సంఖ్యా బలం 22; మహిళల ప్రాతినిధ్యం కేవలం 2. కార్యకర్తల చెమటలు చిందిన ప్రదేశాలు :

1) విజయవాడ బాటకు తూర్పు పడమర మురుగు కాల్వలు,

2) నారాయణరావునగర్ ముఖ్య వీధి కెదురుగా 3 చెట్లు,

            గ్రామ వీధులు కశ్మలాల మీద, అస్తవ్యస్తతల మీద కత్తి గట్టిన స్వచ్ఛ కార్యకర్తల ఈ నాటి పని విధాన మెట్లున్నడో చూద్దాం!

            బాలాజీ అపార్ట్మెంట్ల దగ్గరే -  వాహనాలాపుకొని, చేతొడుగులు కత్తులు - దంతెలు చీపుర్లు డిప్పల వంటి సాధనాలు చేబూని, తొలుతనే కార్యకర్తలు మూడుగా చీలి, మూడు చోట్లపనికి దిగారు.

            సుందరీకర్తలు ఆగిన చోటు నుండి వెనక్కి పోయి, చెట్ల కొమ్మల అక్రమాలను సరిచేయడం మొదలుపెట్టారు - కొన్నిటిని మంచి ఆకృతుల కోసమూ, మరికొన్నిటిని కరెంటు తీగల నంటు కోకుండానూ! విజిల్స్ మ్రోగినా సరే చివరగా పని విరమించింది వీళ్లే!

            బాటకు తూర్పున - ఆటోనగర్ వైపున డ్రైనులో నీళ్లు లేవు గాని - అక్కడక్కడ గడ్డి గుబుళ్లు, చెత్తా చెదారాలూ ఫుల్లు! అక్కడి రెండు అడ్డరోడ్ల నివాసుల్లో వాటిని పట్టించుకొన్న వాళ్లు నిల్లు! పంచాయతీ కార్మికుల దృష్టి వాటి మీద పడనపుడు - నదుల వరదకు సముద్రాలే గతి ఐనట్లు గ్రామ రహదార్ల, మురుగ్గుంటల రోతల బాగు చేతకు స్వచ్ఛ కార్యకర్తలే గతి!

            అపార్ట్మెంట్లకు 100 గజాల ఉత్తరాన - బెజవాడ దారికి పశ్చిమాన ఏడెనిమిది మంది శ్రమదానం! అక్కడ మాత్రం అపార్ట్మెంట్ గృహస్థుల వాడకంతో డ్రైను నిండా మురుగు నీరే! ఆ మురుగు మీద తేలుతూ అసహ్యంగా నూనె తెట్టో - ప్లాస్టిక్ వస్తువులో - సంచులో - ఆహార పదార్థాలో.... డ్రైను కడ్డంగా పెద్ద మృత వృక్షం. వీటన్నిటికీ కార్యకర్తల కష్టమే - సహనమే సమాధానం!

            అక్కడి పూల మొక్కల పాదుల్ని సరిదిద్దినా, రోడ్డు మీదికి పూలకొమ్మలు వస్తుంటే కత్తిరించి నా రోడ్డును ఊడ్చినా - రకరకాల వ్యర్ధాల్ని గుట్టలుగా లాగి, డిప్పల్తో మోసి, ట్రాక్టర్ లో నింపినా - ఒక కార్యకర్త గట్టిగా త్రొక్కి సర్దినా - ఈ అన్ని పారిశుద్ధ్య చర్యలకూ కర్తలు ఈ కొద్ది మందే! కరెంటు తీగకు దెబ్బ తగిలి, విద్యుత్ ప్రసారం నిలిపినా - అందుకే చీకటైనా తమ పని ఆపలేదు!

            చెన్నై - మహబలిపురం పర్యటనలో జలుబూ - జ్వరాలంటుకొన్న డాక్టర్ DRK గారు బాగా నీరసించినా ఐదో రోజు కూడ వీధి శుభ్రతకు దూరంగా ఉండలేక - అతి కష్టం మీద - ఆలస్యంగానైనా వచ్చారు! 6.25 కు నేటి కార్యకర్తల కష్టాన్ని సమీక్షించారు.

            మొన్నటి రావెళ్ల - గుత్తికొండ ఉపాధ్యాయ దంపతుల, నిన్నటి పాలడుగు కృష్ణశ్రీ గార్ల విరాళాలకు కార్యకర్తల బృందం హర్షం ప్రకటించింది. రావెళ్ల వారి కేకుల పంపిణీ మాలెంపాటి వైద్యుని ద్వారా ఈ ఉదయం జరిగింది.

            అన్ని సంగతులు ముగిసేందుకు 6.40 దాటింది.

            బెజవాడ బాటలో మిగిలిన ఉత్తర భాగం మెరుగుపరిచే కృషి కోసం రేపటి వేకువ కాటాలదగ్గర కలుసుకోవాలనే నిర్ణయంతో గృహోన్ముఖులయ్యారు.

    చోద్యం చూస్తుంటేనో ఏం లాభం?

ఏళ్ల తరబడీ ఊరును ఎవరొ శుభ్రపరచునపుడు

శ్మశానాల్ని, రహదార్లను సుందరీకరించు నపుడు

అభినందిస్తుంటేనో - చోద్యం చూస్తుంటేనో

ఏం లాభం? శ్రమించకుండ ఏ ఫలితం దక్కగలదు?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   31.03.2023.