2724* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు.

శనివారం నాటి గ్రామ సామాజిక సేవల్ని పరిశీలించండి! @2724*

            [క్రొత్తనెల తొలి దినం చాల వింతల్ని తెచ్చింది. దాదాపు అన్ని వార్డుల్నుండీ వార్డు బాధ్యులో - ఉద్యోగ నిరుద్యోగులో వీధి పారిశుద్ధ్య కృషిలో పాల్గొనడమూమొత్తం 150 మంది దాక- అందులో మరీ ముఖ్యంగా 20 ఏళ్లలోపు వాళ్లు తగు సంఖ్యలో ఉండడమూ, సువిశాల బెజవాడ రాదారి కిలోమీటరు దాక స్వచ్చ- సౌందర్యాలు పులుముకొని స్వచ్ఛ- సుందరోద్యమ తడాఖా చూపడమూ - ఇవన్నీ వింతలు కావా?]

కొంచెం నిదానించండి! పైన బ్రాకెట్లో వ్రాతలు ఏప్రిల్ 1 కి చెందినవిగ్రాఫిక్ వ్రాతలన్నమాట! అసలు సిసలు సంగతు లేమంటే:

- నేను 10 నిముషాలు ఆలస్యంగా -4.30 కు బెజవాడ దారిలోని కాటాల దగ్గరికి చేరుకోకముందే 40-50 గజాలు ముందుగానే డజను మంది మైకు నుండి మంచిపాటలు వింటూ తూర్పు డ్రైనులో 8 మందీ, పడమటి మురుగు కంపు కాల్వ దగ్గర నలుగురూ శ్రమిస్తున్నారు.

- అందులో తూర్పు డ్రైను లోతుగా, నీటి గుంటగా, ట్రాన్స్ఫార్మర్ దగ్గరగా ఉండి, ఎంతో మెలకువగా, నెమ్మదిగా పని జరిగింది.  పైన మబ్బులు తప్ప - క్రింద వీధి దీపాలు లేవు!

- పడమర డ్రైన౦తా అపార్ట్మెంట్ల వ్యర్థ జలం చేరి, ఎన్ని దిక్కు మాలిన వ్యర్ధాలు వాటిలో చేరాల్నో చేరి, ఎంగిలాకుల - ఎంగిలి మెతుకుల వల్ల నిలవ నీరు కంపు కొడుతున్న సన్నివేశం!  పైగా డ్రైను ఒడ్డున వరుసగా మంచి రంగుల బోగన్ విలియా పూల చెట్లూ. ఐతే ముళ్ళ కంపలూ, పూల కొమ్మల ముళ్ళూ !

- మరొక 10 నిముషాల్లో చూస్తే- స్వచ్ఛ కార్యకర్తల సంఖ్యా బలం పెరిగి 22 దాక చేరి, అప్పుడిక చెత్త లోడింగు సందడి కూడ మొదలయింది!

- యధావిధిగా రాదారినీ, మార్జిన్లనూ చీపుళ్ల కార్యకర్తలు ఊడుస్తూనే ఉన్నారు; దంతె ధారులు  కరవాల ఖండిత ముళ్ల కొమ్మల్నీ, చెత్త పరకల్నీ లాగి పోగులు చేయడమూ జరిగిపోతూనే ఉన్నది.  ఈ పనులన్నీ చీకటిలోనే, వేగంగా వచ్చి, దూసుకు పోతున్న వాహన రొదల నడుమనే - అప్రమత్తంగానే చేయవలసి వచ్చింది!

            అలా 6.06 నిముషాల దాక సామాజిక స్పృహ ప్రదర్శించిన 22 మందిలో జ్వరం వల్ల ఒంట్లో ఓపిక  చాలకున్నా- అనివార్యంగా బాటనూడ్చి, శుభ్రపరచిన ఒక సీనియర్ స్వచ్ఛ వైద్యుడూ, ఊరి ఇతర బాధ్యతల్లో తలమునకలై కూడ వచ్చి శ్రమించిన గ్రామాధ్యక్షురాలూ ఉన్నారు!

            ఎవరో పెంచిన చెట్ల కాయల్ని రాతితో కొట్టడం తేలికే! అలాంటిదే  తొమ్మిదేళ్ల స్వచ్ఛ - సుందరోద్యమంలో తప్పులు వెదకడమూ - అభాండాలు వేయడమూ కూడ!

            ఈ కార్యకర్తలు తలా 105 నిముషాల అమూల్య సమయాన్నీ - శ్రమనూ ఈ 60-70 గజాల రోడ్డుకు  కాటాల దాక సమర్పించడ మొక్కటే నా దృష్టిలో ఆరాధ్యనీయం, అనుసరణీయం!

            6.30 సమయంలో కాఫీలు ముగించి, నేటి శుభ్ర-సుందరీకృత రహదారి భాగాన్ని సంతృప్తిగా చూసుకొని, సమీక్షించిన DRK గారైతే ఇంకాస్త ఎక్కువ అనుభూతికి లోనై అంతకు ముందు ట్రస్టు కార్మిక పర్యవేక్షక కస్తూరి శ్రీనివాసుని త్రివిధ నినాదాలు పునరుద్ఘాటించి, 6.40 కి నేటి కార్య క్రమానికి స్వస్తి పలికారు!

             కొన్నిరోజులుగా స్వచ్ఛ కార్యకర్తలకు తినుబండారాలు క్రమం తప్పక పంచుతున్న రావెళ్ల - గుత్తి కొండ దంపతులు నేటి ఉదయం కూడ ఆవిధంగా స్వచ్ఛ- సుందరోద్యమంలో మమేకమయ్యారు!

            రేపటి నిత్యవిధి - వీధి సుందరీకరణ నిమిత్తం మనం కలుసుకొని పాటుబడవలసింది - ఈ కాటాల దగ్గరనుండే!

        ఎలా ఫలితములు దక్కును?

తర్కవితర్కంతోనో ముఖ స్తుతుల గోలతోనొ

ఉపన్యాసములతోనో ఉమ్మడి ఫలితం దక్కదు

అని తెలిసీ ప్రతి వేకువ శ్రమ సందడి చూసికూడ

ఏంలాభం? పనికి దిగక ఎలా ఫలితములు దక్కును?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   01.04.2023.