2725* వ రోజు....... .......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు.

                         ఆదివారం నాటి శ్రమదాన వీరం -@ 2725*

            ఏప్రియల్ మాస ద్వితీయ దివసం- వేకువ 4.21 సమయం – బెజవాడ మార్గంలోని కాటాల దగ్గర సుశిక్షితులైన 15 మంది పారిశుద్ధ్య కృషిలో దిగబోతున్న దృశ్యం!  నేటి పనుల్ని అంచనా కట్టుకొని, మూడుగా విభజించుకొని, బాటకు తూర్పు – పడమరల డ్రైన్ల కశ్మలాల మీద ప్రకటించిన యుద్ధం! క్రమ క్రమ క్రమంగా కార్యకర్తల సంఖ్య చూస్తుండగానే 35 కు చేరి, ఒక దశలో 40 గా మారిన వైనం!

          ఒక సైన్య విభాగం అక్కడికి కాస్త దూరంగా – ఉభయ అపార్ట్ మెంట్ల నడుమ ప్రోగు బడిన చెత్త సేకరణకు తరలి, 15-20 నిముషాల్లోనే పని ముగించుకొస్తే –

          రెండవ పటాలం రోడ్డుకు తూర్పు డ్రైను – లోతైనదీ, 200 గజాల పొడవైనదీ, రెండు నాళ్లుగా సవాలు విసురుతున్నదీ, ఎంత దట్టంగానో రకరకాల కశ్మల భూయిష్టమైపోయిన దానిలో దిగి- గంటన్నర సమయపు సమరంలో విజేతగా నిలిచింది!

          6.00 తరువాత అది ఎంత బాగున్నదో మన వాట్సాప్ చిత్రాల ద్వారా ఈ 30 కి పైగా శ్రమదాతల కృషిని – ఒక పెద్ద, ఒక చిన్న ట్రక్కుల్లో నింపి, డంపింగ్ కేంద్రానికి చేరిన రకరకాల తుక్కుల్ని – వాటి వెనకున్న నిస్వార్థ సామాజిక చైతన్య దీప్తిని ఊహించుకోవచ్చు !

          ఇక సుందరీకరణ విభాగానికీ రోజు చేతి నిండా పని! ఏ రోజైనా వాళ్ల రాకకు అదుపాజ్ఞలు మీరి పెరిగే చెట్ల కొమ్మలు, పూల పాదులు, కరెంటు తీగల్ని సమీపిస్తున్న కొమ్మలు ఎదురు చూస్తూనే ఉంటాయి! ఈ ఒక్క రోడ్డులోనే వందల కొద్దీ ఏపుగా పెరిగిన వృక్షాలుండగా – అడుగడుగునా వాళ్ల అవసరమే!

          ఇటీవల ఎక్కువగా ఆదివారాలకు పరిమితమౌతున్న  ధ్యాన మండలి కార్యకర్తలకు కూడ ఈ ఉదయం చాలినంత పని. కాటాల ఎదుటే. చిందర వందరగా పెరిగిన పిచ్చి మొక్కలూ, అల్లుకొన్న తీగలూ, గడ్డీ, అరచేతి మందాన కసవూ, దుమ్మూ,చెత్తల తోనే వాళ్లకు అరగంట కాలం గడిచిపోయింది!

           కార్యకర్తల్లో కొందరేమో ప్రశాంతంగా, నింపాదిగా కాస్త అంతర్ముఖంగా పని చేసుకు పోతుంటారు.

         మరికొందరికి మాత్రం పనితో బాటు సందడీ, చతురోక్తులూ, కూనిరాగాలూ, శ్రుతి మించని హాస్య ప్రసంగాలూ అలవాటు! అక్కడికీ-మైకు పాటల సత్కాలక్షేపం ఉంటుంది కాని – వాళ్ల పద్దతి మరీ నిశ్శబ్దంగా నిరామయంగా ఉండదు!

          నేటి పారిశుద్ధ్య కార్యక్రమం కాస్త వేగంగానే సాగి, ఇంచుమించు తరిగోపుల ప్రాంగణం దాక వెళ్లింది! అందరికీ సంతృప్తిని మిగిల్చింది!

          6.25 కు ధ్యాన మండలి తరపున – వివేకానంద కాలేజీ మాజీ ప్రిన్సిపల్ శ్రీమాన్ కోటేశ్వర రావు గారి స్వచ్చోద్యమ నినాదాలూ, 40 మందితో ప్రతి నినాదాలూ, స్వచ్చోద్యమ సంచాలకుని సముచిత సమీక్షా వచనాలూ!

          10 రోజుల స్వచోద్యమం ఎడబాటు పిదప ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి గారు స్వచ్చ కార్యకర్తలకు భారీగా – రుచీ, సుచికరంగా – అల్పాహార విందుతో తన పునః ప్రవేశాన్ని చాటుకొన్నారు (టిఫిన్లూ – అనుపానాలూ రుచిగానైతే ఉన్నాయి గాని, మరీ ఇంత రుచిగా ఉండాలా? అని ఒక కార్యకర్త వ్యాఖ్య!).

          బుధవారం వేకువ మనం కలుసుకోవలసిందీ , పారిశుద్ధ్య కృషికి పూనుకోవలసిందీ తరిగోపుల ప్రాంగణం దగ్గరే!

          కాలమనే కడలి గెలుపుకై....

సహనమనే ఆయుధమ్ముతో సాహసమే ప్రతి ప్రత్యూషం

కులమతాల కుంపటులుండవు – స్త్రీ, పురుష వివక్షలుండవు

ఏదో ఒక వీధి శుభ్రతకు ఎంతైనా శ్రమించు నైజం

కాలమనే కడలి గెలుపుకై కార్యకర్త సుదీర్ఘ సమరం!

 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   02.04.2023.