2726* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు.

2726* వ స్వచ్ఛ - సుందర ప్రక్రియ సమాచారం!

            సోమ (3,4-4.23) మంగళవారాల వీధి మరమ్మత్తు పనుల కోసం ఐదారేడుగురు ప్రత్యేక కార్యకర్తలు సిద్ధంగానే ఉంటారు - ముందస్తు ప్రణాళికతో, పనిముట్ల సన్నద్ధతతో!  స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమ కార్యాచరణలో ఎవరి పాత్ర వారిదే! అందులో వీళ్ళెంచుకొన్నవి కాస్త రిస్కీ పనులు - అంటే చెట్లెక్కడం, రాళ్లు మోయడం, రోడ్డు గుంటలు పూడ్చడం వగైరాలన్నమాట!

            సదరు ప్రణాళికా బద్ద వృక్ష సుందరీకరణ కృషి గత మూడు- నాలుగు వారాలుగా గంగులవారి పాలెం దగ్గరగా - బండ్రేవు కోడు మురుగు కాల్వ ఒడ్డున జరుగు తున్నది. అక్కడ వీళ్లు పెంచినవి చాల వరకు ఏడాకుల ఏపు చెట్లే! ఆ మహావృక్షాల కొమ్మల్ని అదుపులో పెట్టే పనే రెస్క్యూ దళం చేస్తున్న పని!

ఈ పని ప్రయోజనాలు:

1) చెట్లు మరింత అందంగా పొందికగా కనిపించడం,

2) కొట్టేసిన కొమ్మల - రెమ్మలతో కాల్వ గట్టు రోడ్డుకు కొంత రక్షణ,

3) మహా వృక్షాల నడిమి చిన్న పూల మొక్కలు త్వరగా ఎదిగే ప్రోత్సాహం!

            ఈ బహుళార్థ ప్రయోజక కృషికి నేటి వేకువ 4. 29 కి హాజరైన తొలి బృందం ఆరుగురు; కొంత సమయం గడిచేప్పటికి 12; నినాదాల 6.45 వేళకు 15 మంది. చూశారా మురికి- కరకు, బరువు పనులకు కూడ ఒక గ్లామర్ ఉండేది చల్లపల్లిలోనే !

            భారీ చెట్లకు తగ్గట్లు - పొడవాటి వంతెన, 20 అడుగుల ఎత్తుకొమ్మల మీదో, నిచ్చెన చివరి మెట్టు మీదో నిలబడి కత్తి లేక మర రంపంతో కొమ్మల్ని తొలగించే పని రిస్కుకాక తేలిక పనా?

            నాలుగు చెట్లు ఈ ఉదయం అడ్డ దిడ్డమైన కొమ్మల్ని కోల్పోయి, కాస్త పచ్చదనం తగ్గి, అదొకరకమైన ఠీవిగా నిలబడినవి.  ఖండిత వృక్ష శాఖల్ని కాల్వ మురుగు అంచున రోడ్డుకు భద్రతగా పేర్చారు!

            పద్మాభిరామం గేటు వద్ద జరిగిన స్వచ్ఛ సౌందర్య ప్రేరక నినాదాల పని మాలెంపాటి గోపాల కృష్ణునిది.

            కార్యకర్తలకు గట్టి మిఠాయిల పంపకమూ, కాఫీల సత్కారమూ శంకర శాస్త్రిది కాక మరెవరిది?

         ఆరోగ్యపు తొలి సూత్రం

ఆరోగ్యపు తొలి సూత్రం భౌతిక, మానసిక శ్రమ

గ్రామాలకు ఆరాధ్యం శ్రమదానపు రంగవల్లి

ఉదయ వేళ శ్రమ వేడుక ఉత్సాహం ఉరకలెత్తి

సకలాంధ్రకు ఆదర్శం స్వచ్ఛోద్యమ చల్లపల్లి !

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   03.04.2023.