2727* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు.

స్వచ్చోద్యమంలో మరొక శ్రమదాన పర్వం - @2727*

            షరా! మామూలుగానే - మంగళవారం(4-4-23) వేకువ 4.30 కే - వీధి క్రమబద్ధీకరణ కోసం 6 గురు కర్మవీరులూ, వాళ్లకండ దండగా ఆరేడుగురూ అదే గంగులవారిపాలెం బాట వంతెన మలుపు దగ్గర వల్లమాలిన సందడి చేశారు!

            సాధారణ పరిభాషలో కొందరు గ్రామ బాధ్యులు వీధి అస్తవ్యస్త తలను తమకు తోచినట్లు - శక్తి మేరకు 100 నిముషాలు శ్రమించి కుదుట పరచిరిఅని కూడ వ్రాయవచ్చు - మరి అలాకాక -

            సందడనీ, పండగనీ, శ్రమ వేడుకనీ, త్యాగాలనీ విశేష పదాలు వాడి, వర్ణించడమెందుకంటారా - నా దృష్టిలో

- ఈ స్వఛ్ఛ సుందరోద్యమం మరీ ప్రత్యేకమూ, అసాధారణమూ!

- కొన్ని మార్లు అబద్ధాలూ - అభాండాలే అందమైన నిజాలు గానూ, కళ్ళెదుట జరిగే వాస్తవాలే నమ్మదగ్గవి కానట్లూ అనిపిస్తాయి

- తొమ్మిదేళ్లుగా - వేకువ 4.15 - 6.15 ల నడుమ ఈ గ్రామంలో క్రమం తప్పక జరుగుతున్న శ్రమదానమూ దాని తీరూ ఇప్పటికీ నమ్మశక్యం గానివిగానే ఉన్నాయి! మనం బ్రతుకుతున్న సమాజం యొక్క కాలం యొక్క స్వభావం అలా ఉన్నాయి మరి!

ఇక ప్రస్తుతానికొస్తే -

రోజుటి వలెనే రెస్క్యూదళ సభ్యులు బ౦డ్రేవుకోడు కాలువ వంతెన దగ్గరి ఐదారు చెట్లకు అందంగా క్రాపులు వేశారు.

            ఎత్తైన చెట్ల కొమ్మల కానించిన నిచ్చెన మీద నిలిచి, మర రంపంతో ఆ చీకట్లో ట్రిమ్ చేయడమన్నా - కత్తితో కొమ్మలు కొట్టడమన్నా - అదేమన్నా చిన్నా - చితకా పనులా? అందుకే ఈ విభాగానికి రెస్క్యూదళం అనే ముద్దు పేరు!

            ఎవరో ఏ పెద్ద వాహనంతోనో గ్రుద్ది విరగ్గొట్టిన వంతెన గోడను అరగంట పాటు చెమటలు కార్చి, డ్రైను నుండి లేపి, యధాస్థితిలో నిలపడమూ, అది కూడ ఉత్సాహంగా చేయడమూ చెప్పుకోదగ్గవే మరి!

            6.35 వేళ పద్మాభిరామం దగ్గర మాలెంపాటి వారి స్వచ్ఛ - సుందర సాథక నినాదాలూ,

            శంకర శాస్త్రి ప్రాయోజిత చాకొలెట్లూ, తాతినేని రమణ దంపతుల (గుడ్ల/ బూస్ట్ ల వితరణము - ఇలా చల్లపల్లి శ్రమదానం ఒక వేడుకలాగా మారిపోయింది!

            బుధవారం ఉదయాన విస్తృత కార్యకర్తల కలయికా, శ్రమ సందడీ తరిగోపుల ప్రాంగణం చిల్లలవాగు వంతెనల దగ్గరే!

            చల్లపల్లి గ్రామమెచట

కనువిందుగు బాట లెచట? సుమ సుందరవనము లెచ్చట?

హ్లాదముగా మోదముగా - స్వచ్ఛ శుభ్ర సాధనగా

ఊరిని నిలపాలనుకొను ఉద్వేగంతో కదలే

స్వచ్ఛ కార్యకర్తలున్న చల్లపల్లి గ్రామమెచట?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   04.04.2023.