2728* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు.

4.18AM నుండే 2728* వ నాటి శ్రమదాన కేళి!

            ఈ 5.4.23 - బుధవారం నాటి ఆ ఆటస్థలం బెజవాడ బాటలోని కాటాల - చిల్లలవాగు నడుమ! ఛాయాచిత్రాన్ని బట్టి తొలి ఆటగాళ్లు డజను మందే గాని, అనతి క్షణాల్లో వచ్చి కలిసిన + ఆఖరి బంతిలో చేరిన అందర్నీ లెక్కిస్తే 25+3 మంది.

            కార్యకర్తల నివాసాలు ఇక్కడికి సగటున 3 కిలోమీటర్లు. చోటేమో వీధి దీపాలు వెలగని రహదారి భాగం. పని జరగవలసిందేమో పూదీగల పొదల వెనుక డ్రెయినూ, ముళ్ల పిచ్చి చెట్ల నడుమ! ఐనా వీరిలో ఎవరు వెనక్కి తగ్గారు గనుక?

            ఇంకా పూర్తి వేసవి మండక ముందే ఉక్క వాతావరణంలో కత్తులతో పనికిరాని మొక్కల్నీ, చెట్ల కొమ్మల్నీ నరికేందుకూ, డ్రైన్ వ్యర్థాల్ని దంతెలతో బైటకు లాగేందుకూ డజను మంది కార్యకర్తలెంత శ్రమించారో - పని మెలకువ చూపారో - ఎంతగా చెమటలు కార్చారో నేను ప్రత్యక్షసాక్షిని!

            ఇద్దరు ముగ్గురికైతే పని విరమించిన అరగంట పిదప కూడ చెమట చెమ్మలారనే లేదు. కఠోర శ్రమకు విరుగుడుగా సీసాల కొద్దీ నీరు త్రాగుతూనే ఉండడం వారి తెలివైన పని!

            స్థూలంగా చూస్తే ఏ రోజైనా కార్యకర్తల శ్రమ ఇంచుమించు ఒకేలా ఉంటుంది. మరి - పనిగట్టుకొని నేను ప్రతిరోజూ ఎందుకు వ్రాస్తున్నట్లు? అంటే - ఎవరి సంతృప్తి వాళ్లది!

            ఈ మురికి - బురద - మట్టి పని వాళ్లది నిజమైన శ్రమజీవన సౌందర్యమైతే - దగ్గరగా పరిశీలించి, కొంచెం విశ్లేషించి ఇలా పలవరించడం అస్మదీయ అంతరంగిక సంతృప్తన్న మాట!

1) ఎక్కడో దుబాయి నుండి వచ్చిన ఉద్యోగిని (మనకోసం మనంట్రస్టు మెంబరు కూడ) తాను వీధి పారిశుద్ధ్యం కోసం పాటుబడుతూ, తన 8 ఏళ్ల కొడుక్కి ఎలా చీపురు పట్టి ఉడ్వాలో - దంతెతో వ్యర్ధాల్నెలా ప్రోగులు పెట్టాలో నేర్పుతుండ డమూ -

2) దూరంగా ఆరేడుగురు డ్రైను కడ్డం పడిన ఎండుచెట్టును ఒడ్డుకు లాగి, కోసి, నరికి, ట్రాక్టర్ లోకి ఎక్కించడమూ -

3) సుందరీకర్తలనబడే నలుగురు చాకచక్యంగా కరెంటు తీగల మధ్య పెరిగిన చెట్ల కొమ్మల్ని బారు కత్తుల్లో తప్పించడమూ

4) రోడ్డును ఊడ్చేవాళ్లు ఊడ్చి,

5) నలుగురైదుగురు అన్ని వ్యర్ధాల ప్రోగుల్ని ట్రాక్టర్లో నింపి, చెత్త కేంద్రానికి చేర్చడమూ - అన్ని విధాలా పరస్పర సహకారమూ, సమన్వయమూ -

            ఇలాంటి సన్నివేశాల్ని స్వచ్చ సుందర చల్లపల్లిలో మాత్రమే చూడగలం!

            పైగా ఇదంతా తమ సామాజిక కర్తవ్యమనీ, అది నిర్వహిస్తుండడం తమ అదృష్టమనీ, మిగిలిన గ్రామ సోదరులెప్పటికైనా తమతో కలిసి రాకపోరనే భావిస్తారు తప్ప – “ఊళ్లో అందరూ సుఖంగా సౌకర్యంగా నిద్రిస్తున్న వేళ మాకిదేం ఖర్మరాఅనుకోరు! (అనుకొంటే 2728* రోజుల  - 4 లక్షల పని గంటల శ్రమదానం సాధ్యపడేదా?)

            ఇక 6.30 నుండి 10 నిముషాలు జరిగిన సమీక్షా - సింహావలోకన సమావేశం కూడ అన్ని చోట్ల జరిగేదేమీ కాదు! గబగబా దులుపుకుపోయేదీ కాదు! ఈ ఉదయం:

- సజ్జా ప్రసాదు గట్టిగా - స్పష్టంగా ప్రకటించిన స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలూ, ఒక వినూత్న పద్ధతిలో చల్లపల్లి స్వచ్చోద్యమాన్ని ఆయన విశ్లేషించడమూ,

- శివరాంపురం నుండి వేంకటాపురం దాక 2 కిలోమీటర్ల రోడ్డు బారునా చెట్లను నాటి  పెంచేందుకు ముందుకొచ్చిన కోనేరు మారుతి ప్రసాదు గారి ప్రతిపాదనా,  

- (తనదో, ఎవరిదో గాని) షణ్ముఖ శ్రీనివాసుని 500/- విరాళమూ, కార్యకర్తలకు 50/- చొప్పున విలువైన గృహోపకరణ వితరణా,   

- మాలెంపాటి పెద్ద డాక్టరు గారి 2000/- చెక్కూ.... కొన్ని విశేషాలు!

            మన రేపటి శ్రమదానం కోసం కలుసుకోదగినది కూడా తరిగోపుల ప్రాంగణం దగ్గరే!

            గంగులపాలెం బాటకు

ఎప్పటికీ గుర్తుంటవి హీనత్వం, గొప్పతనం

గంగులపాలెం బాటకు కలదు సుమా ఉభయత్వం

దాని గతం దుర్భరం - వర్తమాన మద్భుతం

కార్యకర్త శ్రమదానం కదా మూల కారణం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   05.04.2023.

షణ్ముఖ శ్రీనివాస్ గారు
మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారు