2729* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు.

2729* వ నాటి వీధి పారిశుద్ధ్యం 4.17 కే మొదలు!

            గురువారం (6.423) నాడు దానికి శ్రీకారం వ్రాసింది తొలిగా డజను మందీ, (అందులో ఒకాయన పొరుగూరు నుండి!), మలిగా ఇంకో డజనూ! వీళ్ల కర్మక్షేత్రం తరిగోపుల ప్రాంగణం చిల్లలవాగు వంతెనల పరిసరాలు! 6.05 దాక జరిగిన 3 విధాల కృషి అది!

              30 - 40 మంది ప్రతిరోజూ ఊళ్లో ఏదో ఒక చోట - తొమ్మిదేళ్లుగా చాతనైనంత దాక శుభ్రపరచబట్టి - చల్లపల్లి ఇంత చక్కని నివాసయోగ్యంగా, ఆహ్లాదకరంగా, సౌకర్యవంతంగా కనిపిస్తున్నది గాని - ఇతర గ్రామాల సంగతేమిటి?

            దోమలు పుట్టుకొస్తే అవి జన్మ స్ధలానికే పరిమితం కావు గదా! అసలు తొమ్మిదేళ్ల స్వచ్చోద్యమ ప్రత్యేకత తెలియాలంటే - మనం అప్పుడప్పుడూ ఏదొక గ్రామం ముఖ ద్వారాన్ని చూసి రావాలి!

            కార్యకర్తలు నాటి పెంచిన పాతిక వేల మొక్కల విలువ తెలియాలంటే ఈ మండుటెండలిం కాస్త ముదరాలి! శ్మశానాల బస్ ప్రాంగణ - 7 రహదార్ల చెట్ల చల్లదనమూ, వాటి వెనక కార్యకర్తల కష్టమూ అప్పుడైనా తెలిసొస్తుంది!

            2729* నాళ్ల సుదీర్ఘ శ్రమదానం తరువాత - కార్యకర్తలకు గ్రామస్తుల ప్రశంసలక్కర్లేదు కొంచెం సహకారమున్నా చాలు! ఆ సహకారం 2 విధాలు:

1) రోజూ కాకున్నా - వీలైనపుడైనా వచ్చి, శ్రమదానంలో పాల్గొనడం,

2) మాట సాయం చేయకున్నా - దుర్విమర్శలకు దిగకుండడం!

            నేటి కార్యకర్తల 1 వ ప్రయత్నంగా - అపార్ట్మెంట్ల దగ్గరి డ్రైను దగ్గరి ఎండు చెట్లను ముగ్గురు గట్టి పిండాలు రంపంతో కోసి, కత్తుల్తో నరికి, ట్రక్కులోకెక్కించడం!

            2 వ కృషి బెజవాడ బాట పడమటి చెట్ల సుందరీకరణం! అందుకోసం నలుగురైదుగురు ట్రాక్టర్ పైన నిలిచి - బరువైన బారు కత్తుల్తో ఏ కొమ్మలెలా తప్పించారో - కరెంటు తీగల దగ్గర ఖాళీ ఎంత కష్టపడితే వచ్చిందో అదొక కథ!

            ముగ్గురు చీపుళ్ల వారు ఆటోనగర్ సువిశాల ప్రధమ వీధి భాగాన్నెంతగా తీర్చిదిద్దారో వాట్సప్ చిత్రమే వివరిస్తుంది!

            పడమటి మురుగు కాల్వలో గజమెత్తు పెరిగి, బాగా వ్రేళ్లూనుకొని, చిక్కుబడిపోయిన గడ్డిని రెండు మూడు చోట్ల ఆరేడుగురు కార్యకర్తలెంత శ్రమిస్తే చెమట కారిస్తే - దంతెలతో - చేతుల్తో లాగితే ఆ మురుగుకాల్వ ఇప్పుడా మాత్రం శుభ్రంగా మారిందో!

            ముందే వివరించినట్లు స్వచ్ఛకార్యకర్తలదొక మొండి ప్రయత్నం! కొండకు నిచ్చెనవే యడమనో - త్రాడు గట్టి లాగే ప్రయత్నమనో కాక - ఎప్పటికైనా గ్రామస్తులు తమ శ్రమదానానికండగా వస్తారనీ, పంచాయతి ఎప్పటికైనా శక్తి పుంజుకొంటుందనే స్వచ్ఛ కార్యకర్తల అచంచల విశ్వాసంగానే చూద్దాం!

            నేటి శ్రమ సమీక్షా సభలో ప్రముఖ ప్రస్తావన - ఒక సమర్థుడైన, ప్రజలకత్యంత ప్రయోజకుడైన - బెజవాడ వాస్తవ్యుడైన - డాక్టర్ DRK గారి కాప్తమిత్రుడైన డాక్టర్ సూర్యప్రకాష్ గారి అకాల అనుచిత దుర్మృతి! ఎవరమైనా శ్రమదాన వేళ అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరిక!

            రేపటి మన శ్రమదానం కూడ చిల్లలవాగు వంతెన కేంద్రంగానే ఉండగలదు!

            సంకల్ప బలం కావచ్చును

మహామహుల చరిత్రలను మరపించే స్థాయికెదిగి

సాధారణ మనుషులిపు డసాధారణ వ్యక్తులైరి

మారుమూల చల్లపల్లి ప్రాధాన్యత పెరిగిపోయె

కాలమహిమ కాదిది సంకల్ప బలం కావచ్చును!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   06.04.2023.