2730* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

2730* వ పారిశుద్ధ్య కృషి వేకువ 4.17 కే మొదలు!

            శుక్రవారం బ్రహ్మ ముహుర్తాన - పెద్ద శ్మశానం దగ్గరగా - బెజవాడ రహదారిలోనే - సదరు పవిత్ర కార్యానికి పూనుకొన్నదెవరు? రెండు మూడూళ్లకు చెందిన సామాజిక బాధ్యతా మూర్తులు ఆ 24 మందిలో ఎక్కడో దుబాయి నుండి వచ్చిన ఒక యువతి కూడ! ఏమంత మర్యాదకరమైనవి కాని ఈ వీధి శుభ్రతా చర్యలకు సమీప గృహస్థులు కాని, అపార్ట్మెంట్ల నివాసులు గాని ప్రయత్నించనే లేదు!

            ముందుగా నా దృష్టిలో పడిన దృశ్యం - ఒక పెద్ద వైద్యుడూ, ఊరి సర్పంచి కుటుంబమూ చీపుళ్లు, డిప్పలతో ఊడ్వడమూ, కంపుగొట్టే తడి కశ్మలాలను ఎత్తడమూ!

            ఐతే - రోడ్డుకు పశ్చిమాన మురుగు కాల్వలో నలుగురు రైతులూ, ఉద్యోగినులూ చేస్తున్న పని దూరం నుండే నాకు తెలిసిపోయింది - ముక్కుల దరగోట్టే మురుగు కంపు వల్ల! తమ ఇంటి మురుగు కాక, ఎవరెవరి కారణంగానో చేరి, క్రుళ్లిన వ్యర్థాలను కాల్వలో దిగి, తొలగిస్తున్న ఈ స్వచ్ఛ కార్యకర్తలు ఎంతటి స్థిత ప్రజ్ఞులైయుండాలి? ఊరి కల్మషమనే శిలువ మోస్తున్న ఏసుక్రీస్తు మనుషులైయుండాలి?

            వీలైతే చల్లపల్లి గ్రామ సహృదయులు అటుగా వెళ్లి, ఒడ్డున ఉన్న ఆ కశ్మలాలను - చేత్తో తాకవద్దు గాని, చూడాలని మనవి!

            కత్తి కార్యకర్తలు తూర్పు డ్రైన్లో గాని, అపార్ట్మెంట్ల వద్ద గాని చేసిన శ్రమకు ఏషరాబులు ఖరీదు కట్టగలరు?

            100 నిముషాల పాటు ప్రధాన రహదారినీ, తూర్పు వైపు అడ్డ రోడ్లనూ ఊడ్చి, శుభ్రపరచి, అనందిస్తున్న మహిళా కార్యకర్తల ఋణం ఈ ఊరు ఎప్పటికి తీర్చగలదు?

            ఏక కాలంలో ఒక ప్రక్క ప్లాస్టిక్ దరిద్రాలను ఏరుతున్న, మరి కొందఱు మోకాలి లోతు మురుగులో నిర్వికారంగా దిగి శుభ్రపరుస్తున్న, దంతెలతో వ్యర్ధాలను ప్రోగులుగా లాగి, డిప్పల్తో మోసి, ట్రాక్టర్లోకి చేరవేస్తున్న దృశ్యాలు ఎన్ని వేల రోజులు చూస్తున్నా మాబోటి వాళ్లకు తనివి తీరదే!

            పైగా ఇవేమన్నా ముక్కుతూ మూల్గుతూ - ఈసురోమంటూ – ‘ఎందుకొచ్చిన తద్దినపు మురికి పనుల్రాఅనుకొంటూ చేస్తున్నారా - అంటే ఒక లక్ష్యం కోసం సంతోషంగా శ్రమిస్తూ - ఏనాటికానాడు పునర్నవోత్సాహం పొందుతూ - చేస్తున్న బహుశా దేశంలో మరెక్కడా కనిపించని దృశ్యాలు!

            ఇక్కడ కొసమెరుపైన వింతే మంటే - ఈ స్వచ్ఛ సుందరోద్యమంలోని కొందరు పెద్దలకు కూడ స్వార్ధాలూ, దురుద్దేశాలూ కొందరికి కనిపించడం!

నేటి స్వచ్చ - సుందర శ్రమానంతర సమావేశంలోని విశేషాలు:

- ఉదయ శంకరశాస్త్రి సంబంధిత చెక్కెర కేళీ పండ్ల పంపకం,

- జోడు కత్తుల గురవయ్య గారి త్రివిధ యధాపూర్వక నినాదాలూ ప్రతినినాదాలూ,

-  అతగాడే ఒక చిన్న పాఠం చెప్పి, మదర్ థెరిస్సా సేవల ప్రత్యేకతను తెలిపి,

            ప్రార్థించే పెదవుల కన్న పరులను సేవించే చేతులే మిన్నఅనే ఆ మహా తల్లి సూక్తిని గుర్తుచేయడం! ఐతే సదరు పెదవుల కన్నా చేతుల కన్నా, ఇన్ని వేల ఉషోదయాలు శ్మశానాల్లో - మురుగ్గుంటల్లో ఊరి జనుల మేలు కోసం మురుగు దేవుతున్న స్వచ్ఛ కార్యకర్తల చేతులే మరీ మరీ మిన్నఅని నాకనిపించడం....!

            8 వ తేదీ - శనివారం వేకువ తదుపరి పారిశుధ్య కృషి కోసం మనం కలసి, సాగవలసిన చోటు తరిగోపుల ప్రాంగణమే!

            తొలగిపోక తప్పదా?

స్వచ్ఛంద శ్రమదానం సంభవించనప్పుడు

ప్రతి వీధికి కార్యకర్త పాద స్పర్శ లేనప్పుడు

తొమ్మిదేళ్ల పరిశుభ్రత తొలగిపోక తప్పదా?

లక్షలాది గ్రామాల్లో చల్లపల్లి ఒక్కటా?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   07.04.2023.