2731* వ రోజు....... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

సుందరోద్యమ చల్లపల్లిలో 2731* వ నాటి శ్రమదాన రీతులు!

శనివారం వేకువ (8.4.23) రహదారి శుభ్ర - సుందరీకరణలో

1) స్థలం మారలేదు- బెజవాడ వైపుగా ఆటోనగర్ ప్రాంతమే;

2) కాలమూ అంతే – 4.17 & 6.12 ల మధ్యే; కార్యకర్తల సంఖ్య  మారింది - 33 మంది;

3) పని స్వభావంలో సైతం మార్పేమంత లేదు - పడమటి నరకప్రాయమైన మురుగు కాల్వే, మరొకమారు ఎవరో విసిరిన ప్లాస్టిక్ పరికరాల రివేతే, రోడ్డు మీది దుమ్మూ-చెత్తలు ఊడుపే!

          చెప్పుకోదగ్గ మార్పు- పనుల్లో చిల్లల వాగు దిశగా కొంత పురోగమనం!

 - తూర్పు ప్రక్క డ్రైను లోతట్టు గట్టు శ్మశాన ప్రవేశం దాక పిచ్చి మొక్కలు, తుప్పలు, గడ్డి వదుల్చుకొని నలుగురు కత్తి కార్యకర్తల చలవ వల్ల బాగుపడినవి!

          ఇంకో మార్పు - దహన వాటికల దగ్గర ఏ కొంచెమో ఖాళీ జాగా దొరికితే - ఐదారుగురు కార్యకర్తక్కడ బాగుచేసి, గోతులు త్రవ్వి - కొన్నాళ్ల క్రితం ఎవరో బహూరించిన మొక్కలు నాటగలిగారు!

          స్వచ్ఛ చల్లపల్లిఅనగానే చప్పున గుర్తొచ్చేది బహుశా ఈ శ్మశానమే!

           అది వందలాది కార్యకర్తలు - నెలల తరబడీ చేసిన శ్రమ త్యాగాని కొ జ్ఞాపకం!  అసలు మన ఊళ్లోని ఎన్ని అందమైన ఇళ్లు ఇంత ప్రణాళికా బద్ధంగా, హరిత సుందరంగా, దర్శనీయంగా ఉన్నాయో లెక్కబెట్టి చెప్పవలసిందే!

          - చల్లపల్లి వాళ్లం గనుక ఇది రుద్రభూమి అని తెలుసుగాని, ఊళ్లోని చిన్న పిల్లలూ, బైట వారూ ఇదొక సర్వాంగ సుందరమైన ఉద్యానమనే అనుకొంటారు - ఇదెందుకింత అందంగా, సౌకర్యంగా రూపొందిందో - దాని వెనుక శ్రమ ఎంతటిదో మాత్రం గుర్తించరు!

నేటి శ్రమదాన ఇతర విశేషాలు మరికొన్ని :

1) పడమటి డ్రైనులోని గడ్డి గుబుళ్లను తొలగించడంలో బాగా అలసిపోయిన ఏడెనిమిది మంది కార్యకర్తలు;

2) నిన్న త్తుల్తో నరికీ, పీకీ, డ్డుకు లాగిన పచ్చ గడ్డి కాడల్ని - (అవింకా కంపు గొడుతూనే ఉన్నాయి!) ట్రాక్టర్ లో నింపిన ఆరేడుగురి పట్టుదల!

3) నిన్న ఇదే డ్రైను గడ్డి మీద కత్తి గట్టిన ఒక సుందరీకర్త పొరపాటున కాలు పట్టు తప్పి, మురుగులో పడబోయి - నిలద్రొక్కుకొన్నా, కాలిబూటులు లోతుగా కూరుకుపోవడం.

4) రెండు బళ్ల తుక్కును ఒక్క ట్రక్కులోనే ఒడుపుగా సర్దినా, ట్రక్కులో నుండి దిగుతూ ఒకాయన రోడ్డు మీద పడినా పెద్దగా దెబ్బతగలని వైనం!

5) ఇద్దరు మురుగు పని మంతుల చొక్కాలూ - లాగులూ అటు చెమటతో - ఇటు నల్ల మురుగు మరకల్తో నిండడం!

నేటి శ్రమ సమీక్షా కాలంలో:

- దుబాయికి తిరిగి పయనమౌతున్న దాసరి స్నేహ గ్రామ స్వఛ్ఛ - సుందరోద్యమ - నినాదాలూ, ఇక్కడి కార్యకర్తల కాయకష్టంతో తనకు దుబాయి తెలుగువారి ప్రశంసలెంతగా దక్కుతున్నవో ఇచ్చిన వివరణ,

- మరొకమారు రావెళ్ల - గుత్తికొండ ఉపాధ్యాయ దంపతుల సున్నుండల పంపకం,

- SRYSP కళాశాల మాజీ అధ్యక్షులు. T. సాంబశివరావుగారి 500/- విరాళం,

          ఇక చివరగా రేపటి శ్రమదానం కూడ చిల్లలవాగు వంతెన దగ్గరే అనే ప్రకటన!

          అది అనితర సాధ్యం

ప్రధాన వీధినైన విడిచితిరా ఊడ్చకుండ

చెరువైనా - మురుగులోని సిల్టైనా - చెట్లైనా

పుట్టైనా కార్యకర్త పట్టుదలలు తగ్గలేదు

అది అనితర సాధ్యం మరి - అది గ్రామం అదృష్టమే!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   08.04.2023.

T. సాంబశివరావు గారి విరాళం